Share News

మెటా కళ్లద్దాలతో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం: కర్ణాటక సీఎం

ABN , Publish Date - Oct 23 , 2026 | 02:58 PM

కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. తనపై స్టింగ్ ఆపరేషన్‌కు ప్రయత్నం జరిగిందని చెప్పారు.

మెటా కళ్లద్దాలతో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం: కర్ణాటక సీఎం
Dk Shiva Kumar

ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. తనపై స్టింగ్ ఆపరేషన్‌కు ప్రయత్నం జరిగిందని చెప్పారు. తనతో పాటు కేరళ సీఎం వీడీ సతీశన్‌ను కూడా టార్గెట్ చేశారని ఆరోపించారు. స్థానిక మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం ఈ ఆరోపణలు గుప్పించారు.

మెటా స్మార్ట్ కళ్లద్దాలు ధరించిన ఓ వ్యాపారవేత్త తనను కలిసేందుకు రావడంతో అనుమానం కలిగిందని కర్ణాటక సీఎం చెప్పారు. దీంతో, ఆ వ్యాపారవేత్త ఇంకా ఏయే రాజకీయ నాయకుల్ని కలిశారో తెలుసుకునేందుకు ప్రయత్నించానని అన్నారు. కాంగ్రెస్ నేతలే టార్గెట్‌గా భారీ స్టింగ్ ఆపరేషన్‌కు ప్రణాళికలు రెడీ అయ్యాయని ఆరోపించారు. అందులో భాగంగానే తనను టార్గెట్ చేశారని చెప్పారు.


అధికారుల ద్వారా అపాయింట్‌మెంట్ తీసుకుని ఓ పారిశ్రామికవేత్త తనను కలిసేందుకు వచ్చారని సీఎం డీకే శివకుమార్ చెప్పారు. తొలుత వ్యాపార వ్యవహారాలు మాట్లాడాక విషయం రాజకీయాలవైపు మళ్లిందని అన్నారు. రాజకీయ పరిణామాలు, బూత్ స్థాయి వ్యూహాల గురించి ఆ పారిశ్రామికవేత్త మాట్లాడటం ప్రారంభించారని చెప్పారు. చర్చ సడెన్‌గా రాజకీయాల వైపు మళ్లడంతో పాటు ఆ వ్యక్తి పెట్టుకున్న కళ్లద్దాలను చూశాక తనకు అనుమానం కలిగిందని అన్నారు.


వ్యాపారవేత్త బ్యాక్‌గ్రౌండ్ ఏంటో కనుక్కోవాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఆ వ్యాపారవేత్త స్మార్ట్ గ్లాసెస్ పెట్టుకున్నట్టు తనకు ఆ తరువాత సమాచారం వచ్చిందని తెలిపారు. కేరళ సీఎం వీడీ సతీశన్‌తో సమావేశం సందర్భంగా కూడా ఆ వ్యక్తి మెటా గ్లాసెస్ ధరించినట్టు తెలిసిందని అన్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలతో సమావేశం సందర్భంగా మాత్రం ఆయన ఇలాంటి కళ్లద్దాలు పెట్టుకోనట్టు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేబినెట్ సహచరులకు సూచించానని అన్నారు.


స్టింగ్ ఆపరేషన్‌కు ప్రయత్నించిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ వ్యవహారంలో పోలీసులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. విషయాలను గోప్యం ఉంచుతున్నారని వెల్లడించారు. ‘చర్యలు తీసుకోవట్లేదని మీకు ఎవరు చెప్పారు? మీకు తెలీదు అంతే.. మేము ఈ విషయాలను బయటకు చెప్పట్లేదు’ అని సీఎం డీకే శివకుమార్ అన్నారు.

ప్రస్తుతం కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సంబంధించి స్టింగ్ ఆపరేషన్‌ తాలుకూ వీడియోలు కలకలం రేపుతున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. తనపై ఇంతటి కుట్ర జరుగుతుంటే మాజీ సీఎం సిద్దరామయ్య ఎందుకు మౌనంగా ఉంటున్నారని కేంద్ర మంత్రి కుమార స్వామి ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టింగ్ ఆపరేషన్ వెనుక ఎవరున్నారో, ఏ లక్ష్యంతో ఈ ఆపరేషన్‌కు తెరతీశారో అనే అంశాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

యువశక్తితో బలమైన భారత్.. చిన్మయ సమ్మేళనంలో మోదీ ప్రసంగం

ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి పోలీసులు, డాగ్ స్క్వాడ్ బృందాలు

Updated Date - Oct 23 , 2026 | 03:08 PM