Share News

డీలిమిటేషన్‌ బిల్లును అడ్డుకుంటాం

ABN , Publish Date - Nov 28 , 2026 | 05:14 AM

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లును పార్లమెంటులో అడ్డుకొని తీరుతామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.

డీలిమిటేషన్‌ బిల్లును అడ్డుకుంటాం
delimitation meeting

  • ప్రస్తుత సీట్ల సంఖ్యలోనే మహిళా రిజర్వేషన్‌ ఇవ్వాలి: కాంగ్రెస్‌

  • 29న ఎంపీలంతా ఢిల్లీకి చేరుకోవాలని ఆదేశాలు జారీ

  • యూపీ ఎన్నికల కోసమే ఈ బిల్లు: ఎస్పీ అధినేత అఖిలేశ్‌

  • నేడు ఇండి కూటమి భేటీ.. డీఎంకేకు కూడా ఆహ్వానం

న్యూఢిల్లీ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లును పార్లమెంటులో అడ్డుకొని తీరుతామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేసేందుకే ఈ బిల్లును ముందుకు తెస్తోందని ఆరోపించింది. ప్రస్తుతం ఉన్న స్థానాల సంఖ్యలోనే మహిళలకు 33 శాతం కోటాను అమలు చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ నెల 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత సోనియాగాంధీ నివాసంలో ఆ పార్టీ ప్రముఖులు శుక్రవారం సమావేశమయ్యారు. రాబోయే 25 ఏళ్లపాటు లోక్‌సభ సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పులు చేయవద్దని డిమాండ్‌ చేస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం ఎక్స్‌ వేదికగా ఆ పార్టీ నేత జైరాం రమేశ్‌ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ‘కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నది మహిళా రిజర్వేషన్ల అమలు కోసం కాదు. మహిళా రిజర్వేషన్లపై ఇప్పటికే పార్లమెంటు చట్టం చేసింది. దానిని ప్రధాని, కేంద్ర హోంమంత్రి కలిసి మూడేళ్లుగా తొక్కిపెట్టారు. బీజేపీకి అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చేందుకే డీలిమిటేషన్‌ బిల్లును తెస్తున్నారు. నియోజకవర్గం భౌగోళిక స్థితిని మార్చే పని ఎవరు చేయబోతున్నారు? ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతను దారుణంగా దెబ్బతీసిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ ఆ పని చేయబోతున్నారు. ఓట్‌ చోరీని విజయవంతంగా అమలుచేసిన వ్యక్తికి నియోజకవర్గాలను మార్చే అధికారాలు ఇవ్వబోతున్నారు. దీనిని మేము తగినవిధంగా అడ్డుకుంటాం’ అని ప్రకటించారు.


లోక్‌సభలో కాంగ్రెస్‌ ఉపనాయకుడు గౌరవ్‌ గొగోయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘మొదట ఎస్‌ఐఆర్‌ ద్వారా ఎన్నికల్లో ఎవరు ఓటు వేయాలి, ఎవరు వేయకూడదో బీజేపీ నిర్ణయించింది. ఇప్పుడు డీలిమిటేషన్‌ ద్వారా ఎక్కడ ఓటు వేయాలి, ఎక్కడ వేయకూడదో నిర్ణయించాలని చూస్తోంది’ అని విమర్శించారు. కాగా, పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు విప్‌ జారీచేసింది. ఎంపీలంతా తప్పనిసరిగా సమావేశాలకు హాజరు కావాలని ఆదేశించింది. ఆదివారం ఉదయం 10 గంటలలోపు అందరూ ఢిల్లీకి చేరుకోవాలని స్పష్టంచేసింది. మరోవైపు శనివారం ఉదయం 11.30 గంటలకు ఇండియా కూటమి సమావేశం జరుగుతుందని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. డీఎంకే పార్టీని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు తెలిపారు.

యూపీ ఎన్నికల కోసమే

డీలిమిటేషన్‌ బిల్లు: అఖిలేష్‌

త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోజనం పొందటానికే బీజేపీ డీలిమిటేషన్‌ బిల్లును తెస్తోందని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీలిమిటేషన్‌ బిల్లు పేరుతో బీజేపీ అతిపెద్ద తప్పు చేస్తోందని మండిపడ్డారు. అయోధ్య రామాలయ విరాళాల చోరీ వల్ల యూపీలో అధికారం చేజారిపోతుందని భయపడుతున్న బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం చివరి ప్రయత్నంగా ఈ బిల్లును తెచ్చిందని విమర్శించారు. డీలిమిటేషన్‌ బిల్లు ఆమోదం పొందితే.. ఆ తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం అనేదే ఉండదని రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ ఆందోళన వ్యక్తంచేశారు. కాగా, ఎన్‌డీఏ మిత్రపక్షమైన శివసేన కూడా తమ ఎంపీలకు విప్‌ జారీచేసింది.

ఈ వార్తలు కూడా చదవండి...

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్

Updated Date - Nov 28 , 2026 | 05:14 AM