100 సీట్లలో కాంగ్రెస్ పోటీ.. హిమంత ప్రభుత్వానికి ఉద్వాసన తప్పుదు: గౌరవ్ గొగోయ్
ABN , Publish Date - Mar 21 , 2026 | 08:02 PM
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లలో పోటీ చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ తెలిపారు. ఐదు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నట్టు చెప్పారు.
గువాహటి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లలో పోటీ చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) తెలిపారు. ఐదు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నట్టు చెప్పారు. బీజేపీ వ్యతిరేక ఓట్లలో చీలిక ఉండకపోవచ్చని, తద్వారా హిమంత బిశ్వ శర్మ సారథ్యంలోని ప్రభుత్వం అధికారం కోల్పోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా, కాంగ్రెస్ ఇంతవరకూ 94 మంది అభ్యర్థులను ప్రకటించింది.
'అస్సాంలోని ఆరు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, అస్సాం జాతీయ పరిషత్, రైజోర్ దళ్, సీపీఎం, సీపీఐ (ఎంఎల్), ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ కలిసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 100 మంది అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలే అవకాశం ఉండదనుకుంటున్నాం. హిమంత బిశ్వా శర్మ సారథ్యంలోని ప్రభుత్వం అధికారం కోల్పోతుందని ఆశాభావంతో ఉన్నాం' అని గొగోయ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తమ భాగస్వామ్య పక్షమైన రైజోర్ దళ్‌కు 11 సీట్లను కేటాయించింది.
కాగా, అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ఈనెల 23తో ముగియనుంది. ఏప్రియల్ 9న పోలింగ్ జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి. మే 20వ తేదీతో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుంది.
ఇవి కూడా చదవండి..
బీజేపీకి కాంగ్రెస్ బీ టీమ్.. రాహుల్‌పై కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శ
ప్రజల ఓటింగ్ హక్కులు లాక్కోనివ్వం..చివరి వరకూ పోరాడుతాం