Share News

సీఈసీని తొలగించాలని హస్తం పార్టీ దేశవ్యాప్త నిరసనలు!

ABN , Publish Date - Sep 25 , 2026 | 08:26 PM

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ఆయనను అరెస్టు చేసి ప్రాసిక్యూట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేసింది.

సీఈసీని తొలగించాలని హస్తం పార్టీ దేశవ్యాప్త నిరసనలు!
Congress Holds Nationwide Protests, Seeks CEC Gyanesh Kumar’s Resignation

ఢిల్లీ, సెప్టెంబర్ 15: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, భారత ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ఆయనను అరెస్టు చేసి ప్రాసిక్యూట్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.


జమ్మూ కశ్మీర్, అస్సాం, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, చండీగఢ్, మణిపూర్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీలు నిర్వహించి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయాలను ముట్టడించేందుకు యత్నించారు.


రాష్ట్రాల వారీగా నిరసనలు

మణిపూర్: ఇంఫాల్‌లోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ వైపు కాంగ్రెస్ శ్రేణులు మార్చ్ నిర్వహించాయి. జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరగడంతో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.


ఉత్తరాఖండ్ (డెహ్రాడూన్): రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుమారి సెల్జా, పీసీసీ అధ్యక్షుడు గణేష్ గోడియాల్ నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు సెక్రటేరియట్‌లోని ఎన్నికల కార్యాలయాన్ని ముట్టడించాయి. 'గడిచిన మూడేళ్లుగా రాహుల్ గాంధీ చెప్తున్న 'ఓట్ల దొంగతనం' నిజమని ఈ రోజు నిరూపితమైంది' అని గణేష్ గోడియాల్ పేర్కొన్నారు.


జమ్మూ కశ్మీర్: శ్రీనగర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభ లోపలే బ్యానర్లు పట్టుకుని నిరసన తెలుపగా, జమ్మూలోని ఎన్నికల కమిషన్ ఆఫీస్ బయట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓడిపోయిన ప్రభుత్వాన్ని గెలిపించేలా ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ నేత చౌదరి లాల్ సింగ్ ఆరోపించారు.


లఖ్‌నవూ, గువాహటి, కోల్‌కతా, చండీగఢ్: అన్ని ప్రధాన నగరాల్లో కాంగ్రెస్ శ్రేణులు వీధుల్లోకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.


వివాదానికి ప్రధాన కారణం

ఎలక్షన్ కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గడిచిన 10 నెలల్లో 'సిర్' (SIR) ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాలపై కనీసం 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారని 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికలో కథనం వెలువడింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండీ కూటమి నిరసనలు చేపట్టింది.


ఎన్నికల సంఘం స్పందన

ఈ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఖండించింది. మల్టీ-మెంబర్ బాడీలో నిర్ణయాల ముసాయిదా సమయంలో అంతర్గత అభిప్రాయాలు, పరిపాలనా సలహాలు సాధారణంగా జరిగే ప్రక్రియేనని, వాటిని విభేదాలుగా చిత్రీకరించడం సరికాదని స్పష్టం చేసింది. SIR సహా అన్ని తుది నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని తెలిపింది.


ఇలా ఉండగా, పార్లమెంట్ రెండు సభల్లోనూ సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ఇంపీచ్‌మెంట్ మోషన్ (తొలగింపు తీర్మానం) ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రతిపక్షాలు ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై సెప్టెంబర్ 29న న్యూఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో చర్చించనున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ.. సీఈసీపై సుప్రీంకోర్టులో పిల్

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. రెండు వాహనాల ఢీ, ఆరుగురి మృతి

Updated Date - Sep 25 , 2026 | 08:26 PM