Share News

జోక్‌ను విప్లవంగా మార్చే సమయం ఆసన్నమైంది!

ABN , Publish Date - Jun 06 , 2026 | 06:11 AM

‘బొద్దింకలారా! ఢిల్లీలో కలుద్దాం. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాను తీసుకొని తీరుదాం. జోక్‌ను విప్లవంగా మార్చే సమయం ఆసన్నమైంది. ఢిల్లీ వీధులను శాంతియుత, ప్రేమపూర్వక నిరసనతో...

జోక్‌ను విప్లవంగా మార్చే సమయం ఆసన్నమైంది!

రండి.. ఢిల్లీ వీధులను శాంతియుత నిరసనతో నింపేద్దాం

  • యువతకు కాక్రోచ్‌ పార్టీ పిలుపు

  • నేడే జంతర్‌మంతర్‌ వద్ద ప్రదర్శన

  • కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌

న్యూఢిల్లీ, లండన్‌, జూన్‌ 5: ‘బొద్దింకలారా! ఢిల్లీలో కలుద్దాం. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాను తీసుకొని తీరుదాం. జోక్‌ను విప్లవంగా మార్చే సమయం ఆసన్నమైంది. ఢిల్లీ వీధులను శాంతియుత, ప్రేమపూర్వక నిరసనతో నింపేద్దాం’ అంటూ యువతకు కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా జెన్‌జీ ఉద్యమాన్ని రగిలించి సంచలనం సృష్టించిన సీజేపీ శనివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద తన తొలి బహిరంగ నిరసన కార్యక్రమానికి సిద్ధమైంది. నీట్‌, సీబీఎ్‌సఈ తదితర పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, అవకతవతకలు, విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. నిరసనలో పాల్గొనేందుకు పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే అమెరికా నుంచి బయల్దేరారు. ఆయన శనివారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగి.. పార్టీ నేతలతో కలిసి పార్లమెంటు స్ట్రీట్‌లోని పోలీస్‌ స్టేషన్‌ను చేరుకుంటారు. నిరసన ప్రదర్శనకు అనుమతి కోరుతారు. సీజేపీ నిరసనలో పాలుపంచుకుంటానని పర్యావరణ ఉద్యమకారుడు, విద్యావేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఇప్పటికే ప్రకటించారు. ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. తనకు శనివారం షూటింగ్‌ ఉందని, అయినప్పటికీ, ఢిల్లీ నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. నిరననకు మద్దతు తెలుపుతూ శివసేన (ఉద్ధవ్‌) నేత ఆదిత్య థాకరే ట్వీట్‌ చేశారు. హరియాణాకు చెందిన రైతు నాయకుడు గుర్నామ్‌సింగ్‌ చరుణి తమ సంఘం ప్రతినిధులను పంపిస్తున్నామని వెల్లడించారు.


సీజేఐకి లండన్‌లో ప్రశ్నలు

ఆరు రోజుల బ్రిటన్‌ పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్‌కు భిన్న అనుభవం ఎదురైంది. లండన్‌ యూనివర్సిటీ బ్రిక్‌బెక్‌ కాలేజీలో ‘ఏఐ, అంతర్జాతీయ చట్టాలు’ అన్న అంశంపై ఆయన ప్రసంగించారు. అనంతరం సభికుల నుంచి ప్రశ్నలను ఆహ్వానించగా.. ఓ యువతి లేచి.. ‘ఏఐ యుగంలో ప్రజాస్వామ్యాన్ని భారత్‌ ఎలా కాపాడుకుంటుందో మీరు చక్కగా వివరించారు. కానీ, భారత్‌తోపాటు పలువురు అంతర్జాతీయ న్యాయ నిపుణులు.. భారతదేశంలో అసమ్మతిపై తీవ్ర అణచివేత కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై ఈ మధ్య మీరు కూడా వ్యాఖ్యానించినట్లున్నారు..’ అని ప్రశ్నిస్తుండగానే.. సభ నిర్వాహకులు ఆమెను అడ్డుకున్నారు. సభ అంశంతో సంబంధం లేని ప్రశ్న కాబట్టి అనుమతించటం లేదని చెప్పారు. మరో సభికుడు.. ‘మాకు కొంచెం గౌరవం ఇవ్వండి’ అంటూ నినదించారు. ఈ వీడియోలను సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్‌దాస్‌ ఎక్స్‌లో షేర్‌ చేశారు. కాగా, సీజేఐ నిరుద్యోగులను బొద్దింకలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలతోనే సీజేపీ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.

ఒక చేతిలో జాతీయజెండా.. మరో చేతిలో పుస్తకం

నిరసనలో పాల్గొనే యువతకు కొన్ని సూచనలు చేస్తూ సీజేపీ సోషల్‌ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. ‘శనివారం ఉదయం 9 గంటల వరకు జంతర్‌మంతర్‌ వద్దకు చేరుకోవాలి. జాతీయజెండాలను తీసుకురావాలి. విద్య ప్రాధాన్యం తెలియజేసేలా చేతిలో ఒక పుస్తకం కూడా ఉండాలి. నిరసనను పూర్తిగా రికార్డు చేయాలి. బాధ్యతాయుతంగా, శాంతియుతంగా మెలగాలి. ఎవరైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నట్లు అనిపిస్తే తక్షణం పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఉద్యమాన్ని పక్కదారి పట్టించటానికి కొందరు కావాలనే ప్రయత్నిస్తుంటారు. ట్రోల్స్‌ చేస్తుంటారు. వాటికి స్పందించవద్దు’ అంటూ జాగ్రత్తలు చెప్పింది. కాగా, జంతర్‌మంతర్‌ వద్ద నిరసన ప్రదర్శనకు సీజేపీ ఇప్పటి వరకూ తమకు దరఖాస్తు చేయలేదని ఢిల్లీ పోలీసు విభాగం శుక్రవారం వెల్లడించింది. అయితే, ముందుజాగ్రత్త చర్యగా వెయ్యి మంది పోలీసులను మోహరించనున్నట్లు తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి

అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు

పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్

Updated Date - Jun 06 , 2026 | 06:11 AM