Share News

కదం తొక్కిన కాక్రోచ్‌

ABN , Publish Date - Jul 21 , 2026 | 06:32 AM

విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలకు సంబంధించి రాజకీయ వ్యంగ్య ఉద్యమంగా కేవలం రెండు నెలల కిందట ఆవిర్భవించిన కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ).. సోమవారం దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో...

కదం తొక్కిన కాక్రోచ్‌

సీజేపీ పిలుపునకు యువత నుంచి అనూహ్య స్పందన.. ‘చలో సంసద్‌’కు తరలివచ్చిన వేలాది మంది

  • పెద్ద సంఖ్యలో పాల్గొన్న తల్లిదండ్రులు, సీనియర్‌ సిటిజన్లు

  • పోలీసుల లాఠీ చార్జీ, బాష్పవాయువు ప్రయోగం

  • నిరసనకారులకు తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

  • బారికేడ్లను దాటుకొని పార్లమెంట్‌ సమీపానికి యువత

  • తోపులాటలో పలువురు పోలీసులకూ గాయాలు

  • ఇంటర్నెట్‌ బంద్‌.. అదుపులో 70 మంది.. కేసుల నమోదు

  • కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డాతో సీజేపీ ప్రతినిధుల చర్చలు

  • ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందేనని స్పష్టీకరణ

  • చర్చించి చెబుతా: నడ్డా.. ఉద్యమం కొనసాగుతుంది: సీజేపీ

న్యూఢిల్లీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలకు సంబంధించి రాజకీయ వ్యంగ్య ఉద్యమంగా కేవలం రెండు నెలల కిందట ఆవిర్భవించిన కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ).. సోమవారం దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో కదం తొక్కింది. నీట్‌ తదితర ప్రవేశపరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందుల పాలు కావటం, పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ సీజేపీ ప్రారంభించిన ఉద్యమం ‘చలో సంసద్‌’ (చలో పార్లమెంటు)తో మరో మలుపు తిరిగింది. సీజేపీ పిలుపునకు అనూహ్య స్పందన లభించింది. పోలీసుల అనుమతి లేకున్నా, పార్లమెంటుకు దారితీసే రోడ్లను బారికేడ్లతో దిగ్బంధించినా వేలాదిమంది విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలు, తల్లిదండ్రులు, సీనియర్‌ సిటిజన్లు తరలివచ్చి.. ‘భారత్‌మాతా కీ జై’, ‘వందేమాతరం’, ‘జై భీం’, ‘ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చెయ్‌’ వంటి నినాదాలతో ముందుకు సాగారు. వారిని నిలువరించటానికి పోలీసులు లాఠీచార్జికి దిగారు. పలుచోట్ల టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. అయినా నిరసనకారులు బెదరలేదు. దీంతో ఇప్పటి వరకూ ఈ ఉద్యమంపై కనీసంగానైనా స్పందించని కేంద్రప్రభుత్వం దిగి వచ్చింది. సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరిపింది. వారి డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చింది.

11-National-21.jpg


తరలివచ్చిన వేలాదిమంది

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే సోమవారం రోజున జంతర్‌మంతర్‌ నుంచి పార్లమెంటు వరకూ ర్యాలీ నిర్వహిస్తామని సీజేపీ ప్రకటించటం, ఆ పార్టీకి మద్దతుగా ఆమరణ నిరాహారదీక్షలో ఉన్న సోనమ్‌ వాంగ్‌చుక్‌ను బలవంతంగా ఆస్పత్రికి తరలించటం వంటి పరిణామాల నేపథ్యంలో.. ఢిల్లీలో అప్పటికే ఉత్కంఠ నెలకొంది. దీనికితోడు పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. వేలాదిమంది పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు. పార్లమెంట్‌ చుట్టూ బారికేడ్లు, భద్రతా వలయాలను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లను మూసివేయించారు. నిరసనకారులను అరెస్టు చేసి తరలించటానికి బస్సులను సిద్ధం చేశారు. అయినప్పటికీ, జంతర్‌మంతర్‌ వద్ద ఉన్న సీజేపీ దీక్షాశిబిరం వద్ద సోమవారం ఉదయం నుంచే సందడి మొదలైంది. ఢిల్లీతోపాటు బిహార్‌, మహారాష్ట్ర, యూపీ, హరియాణా, పంజాబ్‌ తదితర పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వేల సంఖ్యలో రావటం ప్రారంభమైంది. రాత్రంతా రైళ్లలో, బస్సుల్లో ప్రయాణించి బ్యాగులతో (బ్యాక్‌ప్యాక్‌లతో) వచ్చినవారు, వర్షం వచ్చే అవకాశాల దృష్ట్యా గొడుగులు తెచ్చుకొని వచ్చిన వారు ఎంతోమంది కనిపించారు. కొందరు విద్యార్థులు కాలేజీ, పాఠశాలల యూనిఫాంలతోనే వచ్చారు. మరికొందరు సీజేపీని సూచించే బొద్దింకల చిత్రాలతో కూడిన షర్లులు ధరించారు. ర్యాలీ ప్రారంభానికి ముందు సీజేపీ సోషల్‌ మీడియాలో ఒక పోస్టు పెట్టి ‘భారీ వర్షాలు, పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు.. ఇవేవీ ఈ రోజు సీజేపీని ఆపలేవు’ అని పేర్కొంది. ర్యాలీ ప్రారంభం కావటానికి ముందు సీజేపీ ప్రతినిధి సౌరవ్‌దాస్‌ మాట్లాడుతూ.. శాంతియుతంగా వ్యవహరించాలని, పోలీసులు అడ్డుకున్నా సహనం కోల్పోవద్దని పిలుపునిచ్చారు. ఉదయం ప్రారంభమైన ర్యాలీని పోలీసులు కన్నాట్‌ప్లేస్‌ వద్ద అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులు ప్లకార్డులు, జాతీయ జెండాలను చేతబూని ఇరుకు సందుల్లోంచి, గల్లీల్లోంచి వేర్వేరు మార్గాల్లో ముందుకు సాగారు. సంసద్‌ మార్గ్‌లో ఉన్న రిజర్వుబ్యాంకు వద్దకు వెళ్లిన వారిని పోలీసులు అడ్డగించారు. వారు మరో వైపు నుంచి రైల్వేభవన్‌ వద్ద ఉన్న పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. దీంతో భద్రతాసిబ్బంది పార్లమెంట్‌ అన్ని గేట్లనూ మూసి వేశారు. యువ వెల్లువ అంతకంతకూ పెరిగిపోతుండటంతో పోలీసులు తొలుత శాస్త్రిభవన్‌ వద్ద బాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ విద్యార్థులు, యువత ముందుకు రావడంతో దొరికిన వారిని దొరికినట్లు లాఠీలతో చితగ్గొట్టారు. పలువురు యువతీ యువకులు తీవ్రంగా గాయపడ్డారు, ఓ వ్యక్తి.. తన ఎదుట ఉన్న పోలీసులతో ‘మారో సార్‌, మారో’ (నన్ను కొట్టండి సార్‌) అంటూ ధైర్యంగా చెబుతున్న వీడియో వైరలైంది. ఓ యువతి తన తలకు తగిలిన దెబ్బలు మీడియా ప్రతినిధులకు చూపించింది. మొత్తమ్మీద సెంట్రల్‌ ఢిల్లీ రణరంగంగా మారింది. పోలీసులు నిలిపివేసిన చోటే ఉద్యమకారులు బైఠాయించి నినాదాలిచ్చారు. ఒక ప్రాంతంలో నిలిపివేస్తే మరో మార్గం నుంచి చీమలదండులాగా తరలివచ్చారు. పోలీసుల లాఠీచార్జిలో పలువురు నిరసనకారులకు తీవ్ర గాయాలయ్యాయని, రాంమనోహర్‌లోహియా ఆస్పత్రిలోనే ఏకంగా 65 మెడికో లీగల్‌ కేసులు నమోదయ్యాయని వెల్లడైంది. నిరసనకారుల తోపులాటలో, దాడిలో దాదాపు 118 మంది పోలీసులకు, పారామిలిటరీ సిబ్బందికి గాయాలయ్యాయని పోలీసులు ప్రకటించారు. మరోవైపు, నిరాహారదీక్షలో ఉన్న అభిజిత్‌ దీప్కేను పోలీసులు జంతర్‌మంతర్‌ నుంచి తరలించారు. దీప్కేతోపాటు వాంగ్‌చుక్‌భార్య గీతాంజలి ఆంగ్మోను కేరళ హౌస్‌కు తీసుకెళ్లారు.


ప్రభుత్వం నుంచి పిలుపు

ఢిల్లీ వీధులు నిరసనకారులతో పోటెత్తిన నేపథ్యంలో.. చర్చలకు రావాలంటూ కేంద్ర నుంచి సీజేపీకి ఉదయం 11.45 గంటల సమయంలో పిలుపు వచ్చింది. పార్టీ అధికార ప్రతినిధులు అశుతోష్‌ రన్‌కా, సౌరవ్‌దాస్‌ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా నివాసానికి వెళ్లారు. సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి బలవంతంగా తరలించిన సోనమ్‌ వాంగ్‌చుక్‌ను తక్షణం విడుదల చేయాలని, ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలి లేదా మంత్రివర్గం నుంచి తొలగించాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలన్న డిమాండ్లను మంత్రి ముందు ఉంచారు. దీనిపై సౌరవ్‌దాస్‌ ఎక్స్‌లో స్పందిస్తూ.. అంతర్గతంగా చర్చించి, ఆ తర్వాత స్పందిస్తానని నడ్డా చెప్పారని తెలిపారు. డిమాండ్లను సాధించేవరకూ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీజేపీతో జరిగిన చర్చలపై నడ్డా కూడా ఎక్స్‌లో పోస్టు పెట్టారు. మరోవైపు, సీజేపీ ర్యాలీ నేపథ్యంలో హోంమంత్రి అమిత్‌షాతో ధరేంద్ర ప్రధాన్‌ భేటీ కావటం చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి...

విక్రమ్‌-1 విజయంలో తెలుగు తేజాల కృషి

ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ.

Updated Date - Jul 21 , 2026 | 06:35 AM