పోలీసులపై దాడి బీజేపీ గూండాల పనే
ABN , Publish Date - Aug 01 , 2026 | 05:50 AM
‘చలో సంసద్’ సందర్భంగా పోలీసుల మీద జరిగిన దాడి ఘటనలకు విద్యార్థులు కారణం కాదని, బీజేపీ పంపించిన గూండాలే ఆ పని చేశారని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు...
ఉద్యమాన్ని గందరగోళపరిచే
కుట్రతోనే వారిని ఆ పార్టీ పంపించింది
సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దీప్కే
న్యూఢిల్లీ, జూలై 31: ‘చలో సంసద్’ సందర్భంగా పోలీసుల మీద జరిగిన దాడి ఘటనలకు విద్యార్థులు కారణం కాదని, బీజేపీ పంపించిన గూండాలే ఆ పని చేశారని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. గాయపడిన పోలీసుల కుటుంబసభ్యులు ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించిన నేపథ్యంలో దీప్కే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆ రోజు గాయపడిన పోలీసుల పట్ల మాకు సానుభూతి ఉంది. అదే సమయంలో పోలీసుల చేతుల్లో దారుణంగా దెబ్బలు తిన్న విద్యార్థులు, వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి?’ అని ప్రశ్నించారు. జంతర్‌మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఉద్యమంలో గందరగోళం సృష్టించటానికి బీజేపీ తన గూండాలను, రౌడీలను పంపిస్తుందని నిరసన ప్రారంభమైన తొలిరోజు నుంచే తాను హెచ్చరించిన విషయాన్ని దీప్కే గుర్తు చేశారు. ఆ రౌడీలు, గూండాలను అరెస్టు చేసి చర్యలు తీసుకోవాల్సిందిపోయి విద్యార్థులను పోలీసులు వేధిస్తున్నారని విమర్శించారు.
ఉద్యమాలతోనే మార్పు సాధ్యం
రాజకీయపార్టీలు, సంస్థలు, దర్యాప్తు ఏజెన్సీల పట్ల దేశంలోని యువతలో, ప్రజల్లో అపనమ్మకం పెరుగుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద సవాల్ అని దీప్కే పేర్కొన్నారు. ప్రజాస్వామిక సంస్థలపై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మార్పు ఎన్నికల రాజకీయాల ద్వారా రాదని, విస్తృత ప్రజానీకం భాగస్వామ్యంతో జరిగే ఉద్యమాలతోనే సాధ్యమవుతుందని చెప్పారు. తాము విద్యారంగానికే పరిమితం కాబోమని, దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగం, ఆర్థిక అంతరాలు వంటి ఇతర అంశాల మీద కూడా దృష్టి పెడతామన్నారు. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించే బదులు ప్రజా ఉద్యమ వేదికగానే సీజేపీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమ వలంటీర్లు, శ్రేణులతో త్వరలో సమావేశాలు నిర్వహిస్తామని, తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని అభిజీత్ దీప్కే తెలిపారు.
అనుచిత వ్యాఖ్యలపై క్రిమినల్ కేసా?
జంతర్‌మంతర్ వద్ద నిరసన సందర్భంగా.. ప్రధాని మోదీ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 25 ఏళ్ల మహిళ రుచికాసింగ్ మీద జీరో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయటాన్ని సీజేపీ ఖండించింది. ‘అనుచిత మాటలు మాట్లాడితే క్రిమినల్ కేసు పెట్టటం అనేది అధికార దుర్వినియోగం. బీజేపీలో 100 మంది ఎంపీలపై, లోక్‌సభలో ఉన్న ఎంపీల్లో సగం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వాటి మీద పోలీసులు తమ శక్తిసామర్థ్యాలను కేంద్రీకరించాలి. అంతేగానీ, 25 ఏళ్ల ఓ యువతి మీద కాదు’ అని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ పేర్కొన్నారు.
బాధిత పోలీసుల గురించి పార్లమెంటులో మాట్లాడరా?
మీడియా సమావేశంలో పోలీసు కుటుంబాల ఆవేదన
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జూలై 20వ తేదీన జరిగిన ‘చలో సంసద్’ సందర్భంగా పలువురు పోలీసులు గాయపడ్డారని, వారి గురించి కూడా పార్లమెంటులో మాట్లాడాలని పోలీసుల కుటుంబాలు డిమాండ్ చేశాయి. విద్యార్థుల మీద జరిగిన లాఠీచార్జి గురించే అందరూ మాట్లాడుతున్నారని, కానీ, గాయపడిన పోలీసులకు కూడా కుటుంబాలు ఉంటాయని, అవి తీవ్రమైన ఆవేదనతో ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు కొందరు పోలీసు అధికారుల భార్యలు, పిల్లలు శుక్రవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. జంతర్‌మంతర్ వద్ద తన తండ్రిని కొట్టి చంపేంత పని చేశారని, ఆయన నాలుగు గంటలపాటు స్పృహ లేకుండా ఉండిపోయారని ఓ ఎస్సై కుమార్తె కుంజల్ తెలిపారు. కానీ, సోషల్ మీడియాలో పోలీసులనే విలన్లుగా చిత్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులపై దాడులు అసాంఘిక శక్తుల పనేనన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News