Share News

ధైర్యానికి, దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి మారుపేరు.. నవతరానికి ఒక స్ఫూర్తి

ABN , Publish Date - Feb 19 , 2026 | 09:39 AM

ధైర్యానికి, దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి మారుపేరు.. నవతరానికి ఒక స్ఫూర్తి... ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి నేడు. ఆయన స్థాపించిన మరాఠా సామ్రాజ్యం తర్వాతి కాలంలో భారత దేశమంతటా విస్తరించింది. నేటికీ శివాజీ మహరాజ్ సుపరిపాలనకు గొప్ప చిహ్నంగా నిలుస్తారు.

ధైర్యానికి, దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి మారుపేరు.. నవతరానికి ఒక స్ఫూర్తి
Chhatrapati Shivaji Maharaj Jayanti

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 19: తన మతాన్ని కాపాడుకుంటూ, పరమత సహనంతో రాజ్యాన్ని పాలించిన లౌకిక పాలకుడు, ధీశాలి, రాజనీతిజ్ఞుడు, పటిష్ట మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహరాజ్. భారత చరిత్రలో అత్యంత ప్రసిద్ధమైన యోధుడు, రణనీతి నిపుణుడు, న్యాయవంతమైన పరిపాలకుడు. ఆయన జీవితం ధైర్యం, త్యాగం, స్వాతంత్ర్య ఆకాంక్షలకు ప్రతీక.

జననం.. శివాజీ బాల్యం:

శివాజీ రాజే భోంస్లే 1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఉన్న శివనేరి కోటలో జన్మించారు. ఆయన తండ్రి షాహాజీ భోంస్లే బీజాపూర్ సుల్తాన్(ఆదిల్‌షాహీ సేనలో ఉన్న మరాఠా సేనాని) వద్ద సైన్యాధికారిగా ఉండేవారు. తల్లి జిజియాబాయి గొప్ప దైవభక్తురాలు.. వీరనారి. శివాజీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఆమె పాత్ర ఎంతో కీలకమైనది. రామాయణ, మహాభారత గాథలను వినిపిస్తూ శివాజీలో ధైర్యాన్ని, ధర్మాన్ని పెంపొందించారు జిజియాబాయి.

ప్రారంభ విజయాలు.. స్వరాజ్య స్థాపన:

చిన్నతనం నుండే శివాజీకి పరాయి పాలన పట్ల వ్యతిరేకత ఉండేది. కేవలం 16 ఏళ్ల వయసులోనే ఆయన తన స్నేహితులతో కలిసి తోరణ కోటను జయించి స్వరాజ్య స్థాపనకు పునాది వేశారు. గెరిల్లా యుద్ధ తంత్రాలను (గణీమీ కావా) ఉపయోగించి శత్రువుల గుండెల్లో నిద్రపోయారు. బీజాపూర్ సుల్తాన్ పంపిన బలవంతుడైన అఫ్జల్ ఖాన్‌ను తన తెలివితేటలతో మట్టుబెట్టడం ఆయన వీరత్వానికి ఒక నిదర్శనం. కొండాణ (సింహగఢ్), రాజ్‌గఢ్, పురందర్ వంటి కోటలు స్వాధీనం చేసుకుని పూణే ప్రాంతంలో బలమైన సైన్యాన్ని సృష్టించారు.

మొఘల్ సామ్రాజ్యం, ఆదిల్‌షాహీ, నిజాంషాహీల వంటి అత్యంత శక్తివంతమైన శత్రువులను ఎదిరించి, మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన మహానుభావుడు శివాజీ అని ప్రతీతి. శివాజీ పెరుగుతున్న శక్తిని చూసి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు భయపడి, ఆయనను అణచివేయడానికి షైస్తా ఖాన్‌ను పంపాడు. కానీ శివాజీ అతి తక్కువ సైన్యంతో వెళ్లి షైస్తా ఖాన్‌పై మెరుపు దాడి చేసి అతని వేళ్లను నరికేశారు. ఆగ్రా కోటలో బందీగా ఉన్నప్పుడు, పండ్ల బుట్టలలో దాక్కుని అక్కడి నుండి తప్పించుకున్న తీరు అద్భుతం.


మొఘలులతో పోరాటం: ప్రముఖ యుద్ధాలు, ఘటనలు:

1659 – ప్రతాప్‌గఢ్ యుద్ధం: ఆదిల్‌షాహీ సేనాధిపతి అఫ్జల్ ఖాన్‌ను బాగ్‌నాఖ్ (పులి గోళ్లు)తో వధించి, భారీ సైన్యాన్ని ఓడించారు. ఇది శివాజీ మహారాజ్ యుద్ధ నైపుణ్యానికి ప్రపంచ ప్రసిద్ధి తెచ్చింది.

1660 – పవన్ ఖిండ్ యుద్ధం: బాజీ ప్రభు దేశపాండే తన ప్రాణాలతో శివాజీ మహారాజ్ తప్పించుకోవడానికి సహాయపడ్డారు.

1663 – షాయిస్తా ఖాన్ దాడి: మొఘల్ సుబేదార్ షాయిస్తా ఖాన్ (ఔరంగజేబ్ మామ) పూణేలోని లాల్ మహల్‌లోకి రహస్యంగా చొరబడి దాడి చేసి, ఆయనను గాయపరిచారు.

1666 – అగ్రా నుంచి తప్పించుకోవడం: ఔరంగజేబ్ ఆహ్వానంతో అగ్రాకు వెళ్లి, గృహనిర్బంధంలో ఉండి, మిఠాయి పెట్టెల్లో దాక్కుని తప్పించుకున్నారు – ఇది చరిత్రలో అత్యంత ప్రసిద్ధ ఎస్కేప్.

1670 తర్వాత: సూరత్ దాడులు, మొఘల్ దళాలపై విజయాలు, దక్షిణంలో గింగీ, వెల్లూరు వరకు తన రాజ్యాన్ని విస్తరించారు.

పరిపాలన, సంస్కరణలు:

శివాజీ కేవలం గొప్ప యోధుడు మాత్రమే కాదు, గొప్ప పాలకుడు కూడా. భారత నౌకాదళ పితామహుడిగా (Father of Indian Navy) ఆయనను పిలుస్తారు. సముద్ర మార్గం గుండా వచ్చే విదేశీ ఆక్రమణదారులను అడ్డుకోవడానికి బలమైన నౌకాదళాన్ని నిర్మించారు.

మహిళా గౌరవం: యుద్ధంలో గెలిచినప్పుడు శత్రువుల మహిళలను కూడా తల్లులుగా, సోదరీమణులుగా గౌరవించాలని తన సైనికులకు కఠినమైన ఆదేశాలు ఇచ్చేవారు. అష్టప్రధాన్ పేరిట సమర్థవంతమైన పాలన కోసం ఎనిమిది మంది మంత్రులతో కూడిన 'అష్టప్రధాన్' వ్యవస్థను ఏర్పాటు చేశారు.

1674లో శివాజీకి రాయగఢ్ కోటలో పట్టాభిషేకం జరిగింది. అప్పటి నుండి ఆయన 'ఛత్రపతి'గా పిలవబడ్డారు. 1680 ఏప్రిల్ 3న ఆయన పరమపదించారు. ఆయన స్థాపించిన మరాఠా సామ్రాజ్యం తర్వాతి కాలంలో భారత దేశమంతటా విస్తరించింది. నేటికీ శివాజీ మహరాజ్ ధైర్యానికి, దేశభక్తికి, సుపరిపాలనకు గొప్ప చిహ్నంగా నిలుస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కనిపించిన నెలవంక.. నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు

శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..

For More TG News And Telugu News

Updated Date - Feb 19 , 2026 | 12:46 PM