తెలంగాణలో కొత్త విమానాశ్రయాలపై కేంద్రం క్లారిటీ..
ABN , Publish Date - Jul 20 , 2026 | 08:09 PM
తెలంగాణలోని ఆదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెం విమానాశ్రయాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి కీలక అప్‌డేట్ ఇచ్చారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ వేం నరేందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు..
న్యూఢిల్లీ, జులై 20: తెలంగాణలోని ఆదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెం విమానాశ్రయాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి కీలక అప్‌డేట్ ఇచ్చారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ వేం నరేందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మామునూరు ఎయిర్‌పోర్టు పనులకు టెండర్లు పిలిచామని తెలిపారు. తెలంగాణలో ఉడాన్ పథకం కింద ఇప్పటివరకు 58 రూట్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయ అభివృద్ధి పనుల్లో వేగం పెరిగిందని వెల్లడించారు.
కేంద్రం సమాధానంలోని ముఖ్యాంశాలు
రూ. 496.86 కోట్ల అంచనా వ్యయంతో (జీఎస్టీతో కలిపి) మామునూరు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు ఏఏఐ (AAI) సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. అందులో భాగంగానే రన్‌వే, అప్రాన్, టాక్సీవే వంటి పెవ్‌మెంట్ పనులతో పాటు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి టెండర్లను ఏఏఐ ఇప్పటికే పబ్లిష్ చేసింది. అయితే.. భూసేకరణ, అవసరమైన కేంద్ర అనుమతులు పూర్తికావడంపైనే విమానాల రాకపోకలు ప్రారంభమయ్యే గడువు ఆధారపడి ఉంటుందని కేంద్ర తెలిపింది. ఆదిలాబాద్ విమానాశ్రయం జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌గా ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు ఏఏఐ టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ అధ్యయనం పూర్తి చేసింది.
దీనికి సంబంధించి ఎంత భూమి అవసరమనే వివరాలను కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికే సమాచారం అందించామని కేంద్రం పేర్కొంది. పెద్దపల్లిలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం కోసం ప్రతిపాదించిన స్థలానికి సంబంధించిన ప్రీ-ఫీజిబిలిటీ అధ్యయన నివేదికను ఏఏఐ 2026 ఫిబ్రవరిలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. 2025 జనవరిలో భద్రాద్రి కొత్తగూడెంలోని రామావరం, చుంచుపల్లి, సుజాతనగర్ గ్రామాల్లో చేసిన సర్వేలో కొండలు, రైల్వే లైన్ అడ్డంకిగా ఉండటంతో ఆ స్థలం సరిపోదని తేలింది.
ఇవి కూడా చదవండి
ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి వ్యాఖ్య
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు