బియ్యం నిల్వలు చెప్పాల్సిందే
ABN , Publish Date - Nov 07 , 2026 | 05:11 AM
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో వరి ధాన్యం, బియ్యంపై నిల్వ పరిమితులు విధించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
వ్యాపారులు, మిల్లర్లకు కేంద్రం ఆదేశం.. ప్రతి శుక్రవారం ఆన్‌లైన్‌లో లెక్కలు
తెలంగాణ, ఏపీ సహా ఐదు దక్షిణాది రాష్ట్రాలకు నిల్వ పరిమితులపై అధికారం
2027 జనవరి 31 వరకు అమల్లో
న్యూఢిల్లీ, నవంబరు 6: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో వరి ధాన్యం, బియ్యంపై నిల్వ పరిమితులు విధించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రుతుపవనాల లోటు, అసమాన వర్షాలతో బియ్యం ధరలు పెరుగుతున్నాయి. అక్రమ నిల్వలను అడ్డుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వ్యాపారులు, టోకు, చిల్లర వర్తకులు, పెద్ద రిటైల్ ఛైన్లు, ప్రాసెసర్లు, మిల్లర్లు తమ వద్ద ఉన్న బియ్యం, వరి ధాన్యం నిల్వలను తప్పనిసరిగా వెల్లడించాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం బియ్యం నిల్వలను ఆరు విభాగాలుగా వెల్లడించాలి: అవి బాస్మతి బియ్యం, బాస్మతియేతర ప్రీమియం బియ్యం, బాస్మతియేతర సాధారణ బియ్యం, ఉప్పుడు బియ్యం (పార్‌బాయిల్డ్), నూకలు. నిల్వలు ఉన్న ప్రతి సంస్థ ప్రతి శుక్రవారం ఆహార నిల్వల పోర్టల్ ((foodstock.dfpd.gov.in))లో వివరాలు నమోదు చేయాలి.
రాష్ట్రాల ఉత్తర్వులతోనే అమలు
నవంబరు 6 తేదీతో కేంద్రం ప్రత్యేక లేఖ పంపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు కంట్రోల్ ఆర్డర్ల ద్వారా వరి, బియ్యంపై నిల్వ పరిమితులు విధించుకోవచ్చని ఆ లేఖలో సమ్మతి తెలిపింది. ఈ పరిమితులు 2027 జనవరి 31 వరకు అమల్లో ఉంటాయి. ఎవరి వద్ద ఎంత నిల్వ ఉండొచ్చో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఉత్తర్వుల్లో ఖరారవుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతే ఇక్కడ పరిమితులు అమల్లోకి వస్తాయి. అమలును కేంద్రం, రాష్ట్రాలు కలిసి పర్యవేక్షిస్తాయి.
సోనా మసూరి సెగ
ప్రీమియం దక్షిణాది రకాల ధరలు మిగతా రకాల కంటే ఎక్కువగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినియోగించే సోనా మసూరి టోకు ధర నెల క్రితం కిలో రూ.50 ఉండేది. ఇప్పుడు రూ.65-70 పలుకుతోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. జైశ్రీరాం, హెచ్‌ఎంటీ లాంటి రకాలను తెలంగాణలో రూ.90 నుంచి వంద వరకు అమ్ముతున్నారు. వర్షాభావం, అసమాన వర్షాలే బియ్యం ధరలు బాగా పెరగడానికి కారణమని అంటున్నారు. ఆ ప్రభావం ముఖ్యంగా ప్రీమియం బాస్మతియేతర రకాలపై పడిందని, పలు మార్కెట్లలో వరి ధాన్యం ధరలు కూడా పెరిగాయని చెబుతున్నారు.
సంక్షోభం కాదు.. కొన్ని ప్రాంతాలకే ఒత్తిడి
పరిస్థితి దేశవ్యాప్త సంక్షోభం కాదని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం వద్ద బియ్యం నిల్వలు సౌకర్యవంతమైన స్థాయిలో ఉన్నాయని వారు చెబుతున్నారు. సరఫరా తక్కువగా ఉన్న ప్రాంతాలు, రకాల్లోనే ఒత్తిడి ఎక్కువగా ఉందన్నారు. కాగా, వర్షాభావంతో 2026-27 ఖరీ్‌ఫలో దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం 4ు తగ్గి 4.2 కోట్ల హెక్టార్లకు పరిమితమైంది. 2025-26లో బియ్యం ఉత్పత్తి 15.4 కోట్ల టన్నులు. 2026-27లో అది సుమారు 14.7 కోట్ల టన్నులకు తగ్గవచ్చని వాణిజ్య వర్గాల అంచనా.
దక్షిణాదికి భారత్ రైస్
మార్కెట్లో బియ్యం సరఫరా పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ’భారత్ రైస్’ పేరుతో విక్రయించేందుకు నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, కేంద్రీయ భండార్‌లకు అదనపు బియ్యం కేటాయిస్తోంది. దక్షిణాదిలో అందుబాటులో ఉన్న అన్ని పంపిణీ మార్గాలనూ ఉపయోగించుకోవాలని ఆయా సంస్థలకు సూచించింది. ఈ వేలం ద్వారా బియ్యం అమ్మకాల లక్ష్యాన్ని 2026-27కు గాను 25 లక్షల టన్నుల నుంచి 50 లక్షల టన్నులకు పెంచింది. అక్టోబరు 31 నాటికి ఈ పథకం కింద ప్రైవేటు సంస్థలకు సుమారు 25లక్షల టన్నులు అమ్ముడయ్యాయి.
ఇవి కూాడా చదవండి...
శాటిలైట్లకు చిక్కకుండా పంట వ్యర్థాల దహనం.. ‘ఫైర్ వాచ్’తో సమస్యకు చెక్
ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీంకోర్టు కీలక స్పష్టత.