టీబీఎంలు, భారీ క్రేన్ల తయారీకి 11 వేల కోట్లు
ABN , Publish Date - Nov 26 , 2026 | 04:27 AM
మెట్రో రైలు, సాగునీటి సొరంగాలు, హిమాలయ సరిహద్దు రహదారుల నిర్మాణంలో కీలకమైన టన్నెల్ బోరింగ్ మెషీన్లు(టీబీఎం), క్రేన్లు, హైడ్రాలిక్ ఎక్స్‌కవేటర్లు వంటి భారీ యంత్రాలను దేశంలోనే తయారు చేసేలా ప్రోత్సహించేందుకు కేంద్రం సిద్ధమైంది
8 ఏళ్లపాటు ప్రోత్సాహకాలు.. టీబీఎంలపై చైనా ఆంక్షల నేపథ్యంలో నిర్ణయం
కామరాజర్ పోర్టులో రూ.4,288 కోట్లతో కంటైనర్ టెర్మినల్
తెలంగాణ, ఏపీ ఎగుమతిదారులకు కొత్త గేట్‌వే..
సిల్చార్‌లో రూ.2,014 కోట్లతో కొత్త విమానాశ్రయం
రూ.19,934 కోట్ల ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం: వైష్ణవ్
టన్నెల్ బోరింగ్ యంత్రాల సరఫరాపై చైనా ఆంక్షల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): మెట్రో రైలు, సాగునీటి సొరంగాలు, హిమాలయ సరిహద్దు రహదారుల నిర్మాణంలో కీలకమైన టన్నెల్ బోరింగ్ మెషీన్లు(టీబీఎం), క్రేన్లు, హైడ్రాలిక్ ఎక్స్‌కవేటర్లు వంటి భారీ యంత్రాలను దేశంలోనే తయారు చేసేలా ప్రోత్సహించేందుకు కేంద్రం సిద్ధమైంది. దేశీయంగా ‘నిర్మాణ, మౌలిక సదుపాయాల పరికరాల(సీఐఈ) తయారీ వ్యవస్థను బలోపేతం’ చేసే పథకానికి రూ.11 వేల కోట్లను కేటాయించేందుకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. టీబీఎంల ఎగుమతులపై చైనా విధించిన లైసెన్సింగ్ ఆంక్షలు ఈ నెల 18న అమల్లోకి వచ్చాయి. సరిగ్గా వారం రోజులకే దేశీయంగా వాటి తయారీని ప్రోత్సహించే నిర్ణయం రావడం గమనార్హం. దీనితో పాటు తమిళనాడులోని కామరాజర్ పోర్టులో రెండో కంటైనర్ టెర్మినల్‌కు, అసోంలోని సిల్చార్‌లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి, తపాలా శాఖకు చెందిన రెండు పథకాల కొనసాగింపునకు కేబినెట్ ఆమోదం లభించింది. మొత్తంగా రూ.19,934 కోట్ల విలువైన పథకాలు, కార్యక్రమాలకు ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం, ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ(సీసీఈఏ) సమావేశాల్లో ఆమోదముద్ర వేశారు. అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరాలు వెల్లడించారు.
రెండేళ్లు ఏర్పాటు.. ఐదేళ్లు ప్రోత్సాహకం
భారీ పరిశ్రమల శాఖ అమలు చేసే సీఐఈ (నిర్మాణ, మౌలిక సదుపాయాల పరికరాలు) పథకం 2026-27 నుంచి ఎనిమిదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. మొదటి రెండేళ్లు తయారీ యూనిట్ల ఏర్పాటుకు గడువు కాలం. 2028-29 నుంచి 2032-33 వరకు ఐదేళ్ల పాటు ప్రోత్సాహకాలు చెల్లిస్తారు. చివరి ఏడాది బకాయిల పరిష్కారానికి కేటాయించారు. యంత్రాల తయారీదారులకు (ఓఈఎం), విడిభాగాల తయారీదారులకు వారి అదనపు అమ్మకాల విలువపై 13 శాతం నుంచి 8 శాతం వరకు క్రమంగా తగ్గుతూ వెళ్లేలా ప్రోత్సాహకం అందుతుంది. ఇక సీఐఈకి సంబంధించి ప్రత్యేక పరీక్షా కేంద్రం ఏర్పాటుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద రూ.375 కోట్ల వరకు గ్రాంటు ఇస్తారు. టీబీఎంలతో పాటు నౌకాశ్రయాల్లో వాడే షిప్-టు-షోర్ క్రేన్లు, హైడ్రాలిక్ ఎక్స్‌కవేటర్లు, గనుల్లో వాడే ఆఫ్-హైవే ట్రక్కులు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. ఈ రంగంలో చైనా, అమెరికా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. 2024-25లో రూ.97,500 కోట్లుగా ఉన్న దేశీయ మార్కెట్ 2029-30 నాటికి రూ.2,28,100 కోట్లకు చేరుతుందని కేంద్రం అంచనా. ప్రస్తుతం ప్రపంచంలో తయారయ్యే టీబీఎంలలో 70 శాతానికిపైగా చైనా సంస్థలవే. తెలంగాణలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, మెట్రో భూగర్భ మార్గాల వంటి పనులు టీబీఎంలపైనే ఆధారపడినవి కావడంతో ఈ యంత్రాల సరఫరా తెలుగు రాష్ట్రాలకూ కీలకమే. ఇదిలా ఉండగా, దక్షిణ అసోంలోని బరాక్ లోయలో, సిల్చార్ సమీపంలోని డోలూ వద్ద రూ.2,014 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించనున్నారు. తపాలా శాఖకు చెందిన రెండు పథకాల కొనసాగింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ’పోస్టల్ ఆపరేషన్స్’ పథకానికి రూ.1,141 కోట్లు కేటాయించారు. ’ఎస్టేట్స్ మేనేజ్‌మెంట్’ పథకానికి రూ.1,491 కోట్లు ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి