సుశాంత్ రాజ్‌పుత్ మేనేజర్ కేసులో కీలక పరిణామం.. రంగంలోకి సీబీఐ
ABN , Publish Date - Sep 14 , 2026 | 03:37 PM
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ దిశా శాలియన్ మరణానికి సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ దిశా శాలియన్ మరణానికి సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది. దిశా ప్రమాదవశాత్తు మరణించలేదని ఆమెను హత్య చేశారని ఆమె తండ్రి హైకోర్టులో వేసిన పిటిషన్ మేరకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజుల ముందే ఆయన మేనేజర్ దిశా శాలియన్ అనుమానాస్పద స్థితిలో బాల్కనీ నుంచి కింద పడి మరణించారు. ప్రమాదవశాత్తు బాల్కనీ నుంచి జారి పడి మరణించారని పోలీసులు కేసును మూసివేశారు. తన కూతురు ప్రమాదవశాత్తు మరణించలేదని.. ఆమెను హత్య చేశారని దిశా తండ్రి సతీశ్ శాలియన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుశాంత్ మరణానికి తన కూతురు మరణానికి సంబంధం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే తన కూతురును హత్య చేసి ప్రమాదంగా సృష్టించారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసులు దీనిపై కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని.. అందుకే కోర్టును ఆశ్రయించానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జస్టిస్ భారతి డాంగ్రే, జస్టిస్ మంజూష దేశ్‌పాండే ఆధ్వర్యంలోని ధర్మాసనం సతీశ్ పిటిషన్‌ను విచారించింది. దిశ ఆత్మహత్య చేసుకోలేదని.. ఆమెను హత్య చేశారని ఆమె తండ్రి ఆరోపిస్తున్నప్పటికీ ఎఫ్ఐఆర్‌లో ప్రమాదవశాత్తు మరణించిందని నమోదు చేసి కేసును ఎందుకు క్లోజ్ చేశారు. అనుమానాస్పద మరణం, హత్య అనే కోణంలో ఎందుకు దర్యాప్తు చేపట్టలేదు. దిశా మరణించి 5 సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆమె కుటుంబానికి పోస్ట్‌మార్టం నివేదిక, ఎఫ్ఐఆర్ కాపీని ఎందుకు ఇవ్వలేదు.. ’ అని పోలీసులను ప్రశ్నించింది. అనంతరం.. దిశా కేసును లోతుగా దర్యాప్తు చేయవలసిందిగా సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.
వాస్తవాన్ని ఎక్కువ కాలం ఆపలేరు: సుశాంత్ సోదరి
కోర్టు ఆదేశాలపై సుశాంత్ సోదరి శ్వేతాసింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘వాస్తవం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మీరు కొంతకాలం అణగదొక్కి ఉంచవచ్చు. కానీ.. అడ్డుకోలేరు’ అని పేర్కొన్నారు. దిశా కేసులో సీబీఐ ఎఫ్ఆర్ఐ నమోదు చేయడంపై అనుకూలంగా స్పందించారు. ఇప్పటికైనా.. దోషులు బయటపడాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. కోర్టు ఆదేశాలపై దిశా తండ్రి సతీశ్ స్పందించారు. కోర్టు న్యాయం చేస్తుందనే నమ్మకం తమకుందని ఆయన అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఇసుకతిన్నెలపై అక్షరాల ఓనమాలు.. మహిళలు దిద్దుతున్న సంతకాలు
స్కూటీపై వెళ్తున్న యువతిని ఢీకొట్టిన ఎద్దు.. క్షణాల్లో షాకింగ్ సీన్ వీడియో వైరల్