తాజ్ నుంచి ఒబెరాయ్ వరకు.. బ్రిక్స్ కోసం ఢిల్లీలో హై సెక్యూరిటీ..
ABN , Publish Date - Sep 10 , 2026 | 07:56 PM
పలు దేశాల అధినేతలు ఒకే చోట చేరుతున్న వేళ దేశ రాజధాని ఢిల్లీ హై సెక్యూరిటీ జోన్‌గా మారింది. 18వ బ్రిక్స్ సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: పలు దేశాల అధినేతలు ఒకే చోట చేరుతున్న వేళ దేశ రాజధాని ఢిల్లీ హై సెక్యూరిటీ జోన్‌గా మారింది. 18వ బ్రిక్స్ సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనుంది. ఈ నేపథ్యంలో చాణక్యపురి సహా ఢిల్లీలోని ప్రముఖ లగ్జరీ హోటళ్లలో విదేశీ అధినేతలు, మంత్రులు, ఉన్నతాధికారుల బసకు భారీ ఏర్పాట్లు చేశారు. రాజధానిలోని ప్రముఖ హోటళ్లలో 3,000కు పైగా గదులను బుక్ చేశారు (BRICS Summit 2026).
తాజా సమాచారం ప్రకారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఐటీసీ మౌర్యలో బస చేయనున్నారు. రష్యా ముందస్తు బృందం ఇప్పటికే హోటల్‌కు చేరుకుని భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తోంది. మరోవైపు చైనా ప్రతినిధి బృందం తాజ్ ప్యాలెస్‌లో బస చేయనుంది. జిన్‌పింగ్ సెప్టెంబర్ 12న ఢిల్లీకి చేరుకోనుండగా, పుతిన్ సెప్టెంబర్ 11న భారత్‌కు రానున్నారు. ఇరాన్, ఇండోనేషియా, ఇథియోపియా, కజకిస్థాన్ వంటి దేశాల అధినేతలు కూడా ఢిల్లీలోని ప్రముఖ హోటళ్లలో బస చేయనున్నారు. ఇతర ప్రతినిధుల కోసం షెరటాన్, లే మెరిడియన్, ది క్లారిడ్జెస్, ది ఇంపీరియల్, ది అశోక్ వంటి హోటళ్లలో బస ఏర్పాట్లు చేసినట్లు సమాచారం (BRICS Summit Delhi hotels).
విదేశీ అధినేతలు బస చేసే హోటళ్ల వద్ద మల్టీ-లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు ఎన్‌ఎస్‌జీ కమాండోలు, ఇతర భద్రతా సంస్థలు రంగంలోకి దిగాయి. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భద్రతా తనిఖీలు, స్నైపర్ టీమ్‌లు, బాంబ్ డిస్పోజల్ బృందాలు వంటి ఏర్పాట్లు చేశారు. మొత్తంగా సదస్సు భద్రత కోసం దాదాపు 30,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో సుమారు 15,000 మంది ఢిల్లీ పోలీసులు కాగా, మిగిలిన వారు పారా మిలటరీ బలగాలకు చెందినవారు (BRICS security Delhi).
విదేశీ అధ్యక్షులు బస చేసే హోటళ్లలో పనిచేసే ప్రతి ఉద్యోగిని భద్రతా సంస్థలు వెరిఫై చేస్తున్నాయి. ఢిల్లీలోని వివరాలతో పాటు స్వస్థలాల్లో బ్యాగ్రౌండ్ చెకింగ్‌ను కూడా నిర్వహించినట్లు సమాచారం. పుతిన్ బస చేసే హోటల్‌లో అదనపు డీసీపీ, ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారులు వేర్వేరు షిఫ్టుల్లో భద్రతను పర్యవేక్షించనున్నారు. జిన్‌పింగ్, పుతిన్ తమ భద్రతా ఏర్పాట్లలో భాగంగా కొన్ని సొంత వాహనాలు, కాన్వాయ్ కార్లను విమానాల ద్వారా భారత్‌కు తీసుకురానున్నట్లు సమాచారం. దీంతో విమానాశ్రయం నుంచి హోటళ్ల వరకు వారి రాకపోకలకు ప్రత్యేక భద్రతా ప్రణాళిక రూపొందించారు.
ఇవి కూడా చదవండి..
సస్పెన్స్‌కు తెర.. ఏడేళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్..
ఐఫోన్ ధరలు ఎందుకు తగ్గడం లేదు.. భారత్‌లో యాపిల్ వ్యూహం ఇదేనా..