Share News

బ్రిక్స్‌ ప్రతినిధులకు ‘ఇండియా ఫ్రెండ్‌షిప్‌ మెనూ’

ABN , Publish Date - Sep 12 , 2026 | 09:19 PM

బ్రిక్స్‌ సదస్సుకు హాజరవుతున్న దేశాధినేతలు, ప్రతినిధులకు భారతీయ ఆహార సంస్కృతిని పరిచయం చేసేందుకు ఢిల్లీలో ప్రత్యేక మెనూను సిద్ధం చేశారు. నల్లి నిహారి నుంచి కమలం ఆకారంలోని మిఠాయిల వరకు వివిధ రకాల వంటకాలను ఇందులో చేర్చారు.

బ్రిక్స్‌ ప్రతినిధులకు ‘ఇండియా ఫ్రెండ్‌షిప్‌ మెనూ’
BRICS India 2026 Delegates Food

ఇంటర్నెట్ డెస్క్: 18వ బ్రిక్స్‌ సదస్సు ఢిల్లీలో జరుగుతున్న విషయం తెలిసిందే. సదస్సుకు హాజరైన దేశాధినేతలు, ప్రతినిధులకు భారతీయ ఆహార సంస్కృతిని పరిచయం చేసేందుకు ప్రత్యేక మెనూను సిద్ధం చేశారు. ఢిల్లీకి చెందిన సంప్రదాయ వంటకాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రత్యేక రుచులను ఇందులో చేర్చారు. ఈ ప్రత్యేక మెనూకు ‘ఇండియా ఫ్రెండ్‌షిప్‌ మెనూ’ అని పేరు పెట్టారు. భోజన సమయంలోనూ దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగాలనే ఉద్దేశంతో ఈ మెనూను రూపొందించారు. అంతర్జాతీయ అతిథులకు భారతీయ ఆహార సంస్కృతిని పరిచయం చేయడంతో పాటు, వారికి సొంత ఇంట్లో భోజనం చేస్తున్న అనుభూతి కలిగేలా వంటకాలను సిద్ధం చేశారు.


ఈ ప్రత్యేక మెనూ రూపకల్పనలో ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ కౌశిక్‌ మిశ్రా కీలక పాత్ర పోషించారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయ వంటకాలు, రుచులను పరిశీలించడంతో పాటు.. బ్రిక్స్‌ దేశాల ప్రతినిధుల ఆహారపు అలవాట్లు, ఇష్టాయిష్టాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. భారతీయ వంటకాల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు, మూలికలు, పూలు, ప్రాంతీయ రుచులను దృష్టిలో పెట్టుకుని ఈ మెనూను రూపొందించినట్లు చెఫ్‌ కౌశిక్‌ మిశ్రా తెలిపారు. ప్రతినిధులు తమ ఇళ్లలో ఇష్టంగా తినే వంటకాలను కూడా ఇందులో చేర్చినట్లు చెప్పారు. ఢిల్లీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ వంటకాలు ఈ మెనూలో ఉండనున్నాయి.

ప్రత్యేక ఆకర్షణగా భారతదేశ పాకశాస్త్ర పటం

ఈ ప్రత్యేక మెనూలో నల్లి నిహారి, బాదంపప్పులతో పెప్పర్‌ ఫ్రై వంటి వంటకాలు ఉన్నాయి. వీటితో పాటు వివిధ రకాల మిఠాయిలు, ప్రలైన్లు, ఇతర తీపి, రుచికరమైన పదార్థాలను కూడా ప్రత్యేకంగా తయారు చేశారు. కమలం, ఆర్కిడ్‌ వంటి పూల నుంచి స్ఫూర్తి పొంది కొన్ని మిఠాయిలను ప్రత్యేక ఆకారాల్లో రూపొందించారు. ఈ విందులో మరో ప్రత్యేక ఆకర్షణగా భారతదేశ పాకశాస్త్ర పటం నిలవనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందిన ప్రత్యేక వంటకాలను ప్రతినిధులకు పరిచయం చేసేలా ఈ పటాన్ని రూపొందించారు. ఒక్కో ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేక తీపి పదార్థాలు, వంటకాలను ఇందులో ప్రదర్శించారు.


భారతదేశంలోని ఆహార వైవిధ్యాన్ని ప్రతినిధులకు పరిచయం చేయడమే ఈ ప్రత్యేక మెనూ ఉద్దేశమని చెఫ్‌ కౌశిక్‌ మిశ్రా తెలిపారు. దేశంలోని ఏ ప్రాంతంలో ఎలాంటి ప్రత్యేక వంటకాలు ఉంటాయో సులభంగా తెలుసుకునేలా ఈ కాన్సెప్ట్‌ను రూపొందించినట్లు చెప్పారు. ఈ మెనూను సిద్ధం చేసేందుకు తమ బృందం మూడు నుంచి ఆరు నెలల పాటు పరిశోధన చేసినట్లు మిశ్రా తెలిపారు. ప్రతినిధుల ఆహారపు అలవాట్లు, ఇష్టాయిష్టాలు, వారికి సుపరిచితమైన రుచులపై వివరాలు సేకరించిన తర్వాతే తుది మెనూను రూపొందించినట్లు వెల్లడించారు.

వంటకాల పుస్తకం కూడా..

ప్రతినిధులకు ఈ ప్రత్యేక అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోయేలా మరో ఏర్పాటును కూడా చేశారు. చెఫ్‌లు ఎంపిక చేసిన ప్రత్యేక వంటకాలతో కూడిన రెసిపీ పుస్తకాన్ని వారికి బహుకరించనున్నారు. ఇందులో కొన్ని సంప్రదాయ భారతీయ వంటకాల తయారీ విధానాలను పొందుపరిచారు. సదస్సు ముగిసిన తర్వాత కూడా ప్రతినిధులు ఈ పుస్తకాన్ని తమతో పాటు తీసుకెళ్లేలా రూపొందించారు. ఆయా వంటకాల వెనుక ఉన్న ప్రత్యేకత, వాటిలో ఉపయోగించే పదార్థాలు, తయారీ విధానం వంటి వివరాలను కూడా ఇందులో చేర్చారు. దీంతో భారతీయ వంటకాల రుచిని ఆస్వాదించడంతో పాటు.. వాటి వెనుక ఉన్న సంప్రదాయాలు, ప్రత్యేకతలను కూడా ప్రతినిధులు తెలుసుకునే అవకాశం ఉంటుంది.


Also Read:

బ్రిక్స్ వేదికగా ముగిసిన మోదీ, జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ..

బ్రిక్స్ కరెన్సీ ప్రతిపాదన లేదు: విదేశాంగ మంత్రిత్వ శాఖ

Updated Date - Sep 12 , 2026 | 09:25 PM