ముంబై కోస్టల్ రోడ్ బ్రిడ్జి పైనుంచి కారు బోల్తా.. ముగ్గురు మృతి
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:49 AM
ముంబై కోస్టల్ రోడ్ బ్రిడ్జిపై ప్రమాదం జరిగింది. బ్రిడ్జిపై వెళ్తున్న ఓ బీఎండబ్ల్యూ కారు అదుపు తప్పి బ్రిడ్జి పైనుంచి కిందకు పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు చనిపోయారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ముంబై కోస్టల్ రోడ్ బ్రిడ్జిపై ప్రమాదం జరిగింది. బ్రిడ్జిపై వెళ్తున్న ఓ బీఎండబ్ల్యూ కారు అదుపు తప్పి బ్రిడ్జి పైనుంచి కిందకు పడిపోవడంతో ముగ్గురు చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం 5.20 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. కారు మరైన్ డ్రైవ్ నుంచి హాజీ అలీ వెపు వెళ్తుండగా.. వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, దీంతో కారు బ్రిడ్జి గోడను ఢీకొని కిందకు పడిపోయిందని కోస్టల్ రోడ్ కంట్రోల్ రూం అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న నలుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, అప్పటికే వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ముంబై కోస్టల్ రోడ్ బ్రిడ్జిపై వేగ పరిమితి 11 కిలోమీటర్లు. దక్షిణ ముంబైలోని మరైన్ డ్రైవ్‌ను బాంద్రా వర్లీ సీ లింక్‌కు చెందిన వర్లీతో కలుపుతుంది.