Share News

బీజేపీకి దక్కేవి ఒకటి రెండు సీట్లే.. పంజాబ్ సీఎం లిఖితపూర్వక జోస్యం

ABN , Publish Date - May 25 , 2026 | 08:52 PM

పంజాబ్‌లో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి పది సీట్లకు మించి గెలవలేవని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జోస్యం చెప్పారు. లిఖితపూర్వకమైన లెక్కలతో ఆయన ఈ జోస్యం చెప్పడం విశేషం.

బీజేపీకి దక్కేవి ఒకటి రెండు సీట్లే.. పంజాబ్ సీఎం లిఖితపూర్వక జోస్యం
Bhagwant Mann

ఛండీగఢ్: పంజాబ్‌లో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి పది సీట్లకు మించి గెలవలేవని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) జోస్యం చెప్పారు. లిఖితపూర్వకమైన లెక్కలతో ఆయన ఈ జోస్యం చెప్పడం విశేషం. ఈ రేసులో బీజేపీ కంటే కాంగ్రెస్ ఒకింత మెరుగ్గా ఉండొచ్చని ఆయన అంచనా వేశారు.


పఠాన్‌కోట్ ప్రాంతంలో బీజేపీ ఒకటి, రెండు సీట్లు గెలుచుకోవచ్చని, కాంగ్రెస్ పరిస్థితి సింగిల్ డిజిట్‌కు పడిపోతుందని మాన్ అన్నారు. ఆ పార్టీకి ఒకటి నుంచి తొమ్మిది సీట్లు రావచ్చని అచనా వేశారు. 'అంతకంటే తక్కువ కూడా రావచ్చు. ఆ పార్టీ అగ్ర నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం' అని సీఎం పేర్కొన్నారు.


బెంగాల్‌లో బీజేపీ ఇటీవల చారిత్ర విజయాన్ని సాధించడంపై అడిగినప్పుడు.. 'అదే ఇక్కడ (పంజాబ్) కూడా పునరావృతమవుతుందని ఎందుకనుకోవాలి? ఎందుకంటే నేను ప్రజల్లోనే జీవిస్తున్నాను. నేను చెప్పేది రాసిపెట్టుకుని, భద్రపరుచుకోండి' అని మాన్ సమాధానమిచ్చారు.


అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 2022లో పంజాబ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 117 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి 92 స్థానాలు గెలుచుకుంది. 2017లో 77 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 18 సీట్లకు పరిమితమైంది. రెండు సీట్లలో పోటీచేసిన అప్పటి ముఖ్యమంత్రి చరణజిత్ సింగ్ చన్నీ సహా ఆ పార్టీకి చెందిన పలువురు ప్రముఖ నేతలు ఓటమి చవిచూశారు. బీజేపీ కేవలం 2 సీట్లలో గెలిచింది. శిరోమణి ఆకాలీదళ్ (సాద్) 3 సీట్లకే పరిమితమైంది. ఈసారి సాద్‌కు 'జీరో' సీట్లేనని తాజాగా మాన్ జోస్యం చెప్పారు.


ఇవి కూడా చదవండి..

రైతు రుణాల మాఫీ... విజయ్ మరో కీలక నిర్ణయం

ఆస్తులపై నోటీసు..అభిషేక్ బెనర్జీ నివాసానికి భారీగా పోలీసులు

Updated Date - May 25 , 2026 | 09:00 PM