Share News

భారత స్వాతంత్ర్యం పోరాటంలో BJP-RSS పాత్ర శూన్యం: ఖర్గే

ABN , Publish Date - Aug 08 , 2026 | 04:17 PM

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. BJP, RSS లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో వీరి పాత్ర శూన్యమని, అలాంటి వాళ్ల నుంచి కాంగ్రెస్ దేశభక్తి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

భారత స్వాతంత్ర్యం పోరాటంలో BJP-RSS పాత్ర శూన్యం: ఖర్గే
BJP-RSS Did Nothing for India's Freedom Struggle: Mallikarjun Kharge

హల్ద్వాని (ఉత్తరాఖండ్), ఆగస్టు 8: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భారతీయ జనతా పార్టీ (BJP), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర శూన్యమని, వారి నుంచి కాంగ్రెస్ పార్టీ దేశభక్తి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.


బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ నాయకులెవరూ దేశ స్వాతంత్య్రం కోసం జైలుకు వెళ్లలేదని ఖర్గే విమర్శించారు. ఒకవేళ ఎవరైనా జైలుకు వెళ్లి ఉంటే, వారు గతంలో కాంగ్రెస్‌లో ఉండి ఆ తర్వాత మారినవారే తప్ప అసలైన బీజేపీ/ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారు కారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడమే కాకుండా, ప్రజాస్వామ్యాన్ని రక్షించిందని, కాంగ్రెస్ నాయకులే నిజమైన దేశభక్తులని ఆయన స్పష్టం చేశారు. బెదిరింపులకు కాంగ్రెస్ పార్టీ భయపడదని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని కొనియాడారు. బీజేపీ నాయకుల్లా కాకుండా, రాహుల్ గాంధీ స్వయంగా ప్రజల్లోకి వెళ్తూ యువకులు, రైతులు, విద్యార్థులు, పేదల సమస్యలను అర్థం చేసుకుంటున్నారని తెలిపారు.


ఆగస్టు 8న మహాత్మా గాంధీ ప్రారంభించిన 'క్విట్ ఇండియా'(1942) ఉద్యమాన్ని ఖర్గే ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 'డూ ఆర్ డై' నినాదంతో దేశ ప్రజలంతా ఏకమై బ్రిటిష్ పాలనను పారద్రోలారని అన్నారు.

దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్ సైనికుల త్యాగాలను ఆయన ప్రశంసించారు. కుమావూన్, గర్హ్వాల్ రెజిమెంట్ల ప్రాముఖ్యాన్ని, తొలి పరమ్ వీర్ చక్ర గ్రహీతను స్మరించుకుంటూ, ఉత్తరాఖండ్ ప్రజలు దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

హల్ద్వానీలోని రామ్‌లీలా మైదానంలో ఇవాళ జరిగిన ఈ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల బరిలో తమ స్వాతంత్య్ర పోరాట చరిత్రను, రాజ్యాంగ పరిరక్షణను ప్రధాన అస్త్రాలుగా మలచుకుని ముందుకు సాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..

డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ

Updated Date - Aug 08 , 2026 | 05:01 PM