Share News

యువతపై బీజేపీ ఫోకస్.. జెన్-జీ కోసం కొత్త వ్యూహం..

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:56 PM

నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై విద్యార్థుల నిరసనలు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున రాజకీయ చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన కమ్యూనికేషన్ వ్యూహాన్ని మార్చుకునేందుకు సిద్ధమవుతోంది.

యువతపై బీజేపీ ఫోకస్.. జెన్-జీ కోసం కొత్త వ్యూహం..
BJP Revamps Social Media

న్యూఢిల్లీ: నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై విద్యార్థుల నిరసనలు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున రాజకీయ చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన కమ్యూనికేషన్ వ్యూహాన్ని మార్చుకునేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా జెన్-జీ యువతతో నేరుగా అనుసంధానం కావడానికి కొత్త సోషల్ మీడియా వేదికలను వినియోగించే దిశగా పార్టీ అడుగులు వేస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.


ఇప్పటివరకు ప్రధానంగా ఏకపక్ష సందేశాలకే పరిమితమైన ప్రచార విధానానికి బదులుగా.. ఇకపై యువతతో ద్విముఖ సంభాషణ (Two-way Communication)కు ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. యువతతో తమ పార్టీకి ఉన్న కమ్యూనికేషన్ లోటును జెన్-జీ ఉద్యమం స్పష్టంగా బయటపెట్టిందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత తరం బాధ్యతాయుతమైన సమాధానాలు కోరుతోందని వారు విశ్లేషిస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా ఒక్కటే పరిష్కారం కాదని, వ్యవస్థలో సమూల మార్పులు అవసరమనే భావన యువతలో బలంగా ఉందని పార్టీ గుర్తించినట్లు తెలుస్తోంది.


సంప్రదాయ సోషల్ మీడియాకు పరిమిత ప్రభావం..

ఎక్స్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు జెన్-జీని సమర్థంగా చేరుకోవడంలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు ఈ వేదికలను మరింత సమర్థంగా వినియోగిస్తూ యువతను ఆకర్షిస్తున్నాయని బీజేపీ భావిస్తోంది. దీంతో సోషల్ మీడియా వ్యూహంలో మార్పులు తప్పనిసరి అయ్యాయని నేతలు చెబుతున్నారు.

ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, రెడ్డిట్‌పై దృష్టి..

ఈ నేపథ్యంలో యువత ఎక్కువగా వినియోగించే ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, రెడ్డిట్ మాధ్యమాల్లో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ యోచిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా యువకులతో కూడిన సోషల్ మీడియా బృందాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఇలాంటి బృందాలు ఉంటే ప్రభుత్వ విధానాలు, పార్టీ సందేశాలను యువతకు వారి భాషలో, వారికి నచ్చే శైలిలో చేరవేయవచ్చని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. యువతతో సమర్థవంతంగా మాట్లాడాలంటే యువతే ప్రధాన పాత్ర పోషించాలని, పెద్దలు కూడా వారితో మాట్లాడేటప్పుడు వారి శైలినే అనుసరించాల్సి ఉంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

మోదీ సోషల్ మీడియా శైలే ఆదర్శం..

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరును పార్టీ ఉదాహరణగా చూపుతోంది. విద్యార్థుల ఆందోళనల సమయంలో ప్రధాని సెల్ఫీ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడం యువతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమని పార్టీ నేతలు చెబుతున్నారు. యువత ఎక్కువ యాక్టివ్‌గా ఉండే సమయాన్ని, వారికి చేరువైన మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా వారితో మమేకమయ్యే ప్రయత్నం చేశారని పేర్కొంటున్నారు. అంతేకాకుండా, కేంద్ర మంత్రులు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో మరింత చురుకుగా ఉండాలని, ప్రజలతో ఇంటరాక్టివ్‌గా వ్యవహరించాలని కేబినెట్ సమావేశంలో ప్రధాని సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కొత్త తరానికి చేరవేయడంపై దృష్టి..

ఇటీవల జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో భారతదేశం వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల(FTAs)పై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. యూపీఏ ప్రభుత్వ కాలంతో పోలిస్తే మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల కలిగే ప్రయోజనాలను, చైనాతో పోలికలను, రాష్ట్రాల వారీగా లాభాలను వివరించారు. ఈ తరహా అంశాలను కేవలం గణాంకాల రూపంలో కాకుండా ఇన్‌స్టా రీల్స్, చిన్న వీడియోలు, గ్రాఫిక్స్, ప్లకార్డుల ద్వారా సులభంగా అర్థమయ్యే విధంగా యువతకు చేరవేయాలని పార్టీ ఆలోచిస్తోంది. ప్రభుత్వ విజయాలను ఆకర్షణీయమైన రూపంలో ప్రజెంట్ చేయడం ద్వారా యువతను మరింతగా ఆకట్టుకోవచ్చని భావిస్తోంది.

నీట్ వివాదం ఇచ్చిన గుణపాఠం..

నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో రీ-ఎగ్జామినేషన్ విజయవంతంగా నిర్వహించిన తర్వాత వివాదం తగ్గిపోతుందని భావించినప్పటికీ, అది జరగలేదని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ చర్యలను విద్యార్థులకు సమర్థవంతంగా వివరించలేకపోవడమేనని వారు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా జెన్-జీతో నిరంతర, పారదర్శక, వేగవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థను రూపొందించేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రియుడితో కలిసి భార్య దారుణం.. సైనైడ్‌తో భర్త హత్య..

'నాన్న యూనిఫాం రక్తంతో తడిసిపోయింది'.. న్యాయం చేయండి ప్లీజ్.!

Updated Date - Jul 31 , 2026 | 02:08 PM