Share News

2027 యూపీ ఎన్నికల్లో ఎన్డీయేకి అఖండ విజయం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ధీమా

ABN , Publish Date - Jul 05 , 2026 | 01:03 PM

ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాలు 2027 అసెంబ్లీ ఎన్నికల దిశగా వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అఖండ విజయాన్ని నమోదు చేయబోతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ధీమా వ్యక్తం చేశారు.

2027 యూపీ ఎన్నికల్లో ఎన్డీయేకి అఖండ విజయం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ధీమా
BJP President Nitin Nabin Confident of Massive NDA Victory in UP Assembly Elections 2027

లఖ్‌నవూ, జులై 5: ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాలు 2027 అసెంబ్లీ ఎన్నికల దిశగా వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అఖండ విజయాన్ని నమోదు చేయబోతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ అందిస్తున్న సేవా భావమే కూటమిని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తుందని ఆయన స్పష్టం చేశారు.


ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు రోజుల సంస్థాగత పర్యటనలో ఉన్న నితిన్ నబిన్, లఖ్‌నవూలో పార్టీ పదాధికారులు, ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలతో కీలక సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల వ్యూహాలు, రోడ్‌మ్యాప్‌పై ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు.


అనంతరం మీడియాతో మాట్లాడిన నితిన్ నబిన్, బీజేపీ ఎల్లప్పుడూ ఎన్నికల బరిలో ముందుంటుందని పేర్కొన్నారు. 'ఉత్తర్‌ప్రదేశ్‌ను ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఎన్డీయే కూటమిలోని అన్ని పార్టీలు కలిసికట్టుగా శ్రమించాయి. ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజల కోసం అందించిన నిరంతర సేవలు, సంక్షేమ పథకాలు మాపై నమ్మకాన్ని పెంచాయి. 2027 ఎన్నికల్లో మేము భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం' అని ఆయన వ్యాఖ్యానించారు.


యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ(SP)పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలు గుండాయిజం, వంశపారంపర్య రాజకీయాలను తిరస్కరించి, అభివృద్ధిని కోరుకుంటున్నారని అన్నారు. 'వికసిత్ భారత్' లక్ష్యంతో ముందుకు సాగుతున్న తరుణంలో, రాబోయే 21 ఏళ్ల పాటు సమాజ్‌వాదీ పార్టీ అధికారానికి దరిదాపుల్లో కూడా కనిపించదని మౌర్య జోస్యం చెప్పారు. పార్టీ నాయకత్వం, ప్రభుత్వం, సంస్థాగత యంత్రాంగం అంతా కలిసికట్టుగా 2017 నాటి చరిత్రాత్మక విజయాన్ని 2027లో పునరావృతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


ఎస్పీ నేతలు సమాజాన్ని కులం, భాష, ప్రాంతాల వారీగా విభజించి దేశాన్ని బలహీనపరచాలని చూస్తున్నారని, వారిది పూర్తిగా ప్రతికూల అజెండా అని యూపీ మంత్రి భూపేంద్ర చౌదరి మండిపడ్డారు. నితిన్ నబిన్ పర్యటనతో ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఎన్డీయే కూటమి ఇప్పటినుంచే క్షేత్రస్థాయి వ్యూహాలకు పదును పెడుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: పవన్ కల్యాణ్

డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా తృప్తి క్యాంటీన్‌లను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి నారాయణ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 05 , 2026 | 01:27 PM