ఆ కేసుల సెటిల్‌మెంట్ కోసం సిండికేట్ నడుపుతున్న సీఎం భార్య..?
ABN , Publish Date - Sep 03 , 2026 | 03:17 PM
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భార్య గుర్‌ప్రీత్ కౌర్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి. అత్యాచారం కేసులను పరిష్కరించేందుకు కోట్లా రూపాయాలు డిమాండ్ చేస్తూ దందా నడుపుతున్నారంటూ బీజేపీ ఆరోపణలు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (CM Bhagwant Mann ) భార్య గుర్‌ప్రీత్ కౌర్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. రూ.5 కోట్లతో అత్యాచారం కేసులను పరిష్కరించేందుకు సీఎం భార్య గుర్‌ప్రీత్ కౌర్ సిండికేట్‌ను నడుపుతున్నారని బీజేపీ ఆరోపించింది. మధ్యవర్తుల ద్వారా ఈ దందాను నడుపుతున్నట్లు బీజేపీ నేతలు విమర్శించారు.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం భార్య గుర్ ప్రీత్ కౌర్.. అత్యాచార, క్రిమినల్ కేసులను పరిష్కరించడానికి తన రాజకీయ పలుకుబడిన ఉపయోగిస్తుందని తెలిపాడు. తనకు ముఖ్యనేతలతో సంబంధాల ఉన్నాయని, అత్యాచార కేసును పరిష్కరిస్తానంటూ ఓ మధ్యవర్తి మాట్లాడిన ఆడియో క్లిప్‌లను కూడా ప్రదీప్ విడుదల చేశాడు. అయితే ఆ ఆడియోలో సీఎం లేదా ఆయన భార్య పేరు ఎక్కడా ప్రస్తావన రాలేదు.
'సీఎం భగవంత్ మాన్, అతని భార్య అవినీతి దందాను నడుపుతున్నారు. దీని కోసం వారు మధ్యవర్తులను ఉపయోగించి భారీగా డబ్బులు డిమాంట్ చేస్తూ అత్యాచార కేసులను పరిష్కరిస్తున్నారు. ఒక్కో కేసుకు రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆడియో క్లిప్‌లు.. కేసులను పరిష్కరించడానికి ముఖ్యమంత్రినే వ్యక్తిగతంగా జోక్యం చేసుకుంటున్నారా? అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. సీఎం నివాసం కేసుల ఒప్పందాలు, రాజీలు కుదిర్చే ప్రదేశంగా మారింది. ఇక్కడ వచ్చే అవినీతి సొమ్ములో కొంత పంజాబ్ 'సూపర్ సీఎం' అరవింద్ కేజ్రీవాల్‌కు చేరుతుంది' అంటూ ప్రదీప్ బండారీ ఆరోపణలు చేశారు.
గతంలో పంజాబ్-హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్ కూడా గుర్ ప్రీత్ కౌర్‌పై ఇదే తరహా ఆరోపణలు చేశారు. ఓ అత్యాచారం కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు ఆమె రూ.5 కోట్లు డిమాండ్ చేశారని విమర్శించారు. ఈ తీవ్రమైన ఆరోపణలపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా స్పందించలేదు. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఆరోపణలు చర్చనీయాశంగా మారాయి.
ఇవి కూడా చదవండి:
వాళ్లు ఓడలేదా?... భారత్‌పై పీసీబీ చీఫ్ నఖ్వీ అక్కసు