Share News

బీజేపీ-అకాలీదళ్ మళ్లీ పొత్తు పెట్టుకోనున్నాయా?

ABN , Publish Date - Aug 07 , 2026 | 04:43 PM

పంజాబ్ రాజకీయాలకు సంబంధించి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ-అకాలీదళ్ మళ్లీ పొత్తు పెట్టుకోనున్నాయా.. అనే అంశానికి బలం చేకూరుస్తూ.. ఇవాళ ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ప్రధాని మోదీతో సుఖ్‌బీర్ బాదల్ భేటీ అయ్యారు.

బీజేపీ-అకాలీదళ్ మళ్లీ పొత్తు పెట్టుకోనున్నాయా?
PM Modi-Sukhbir Badal Meet Sparks Buzz Over BJP-Akali Dal Alliance Revival

ఢిల్లీ, ఆగస్టు 7: ప్రధాని నరేంద్ర మోదీతో శిరోమణి అకాలీదళ్ (SAD) అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ఇవాళ (శుక్రవారం)జరిగిన ఈ భేటీ.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత పాత మిత్రపక్షాలు మళ్లీ ఒకే గొడుగు కిందకు వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి.


కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020లో అకాలీదళ్ ఎన్‌డీఏ (NDA) కూటమి నుంచి బయటకు వచ్చింది. దాంతో దాదాపు 25 ఏళ్ల నాటి వీరి పొత్తుకు తెరపడింది. పొత్తు విడిపోయిన తర్వాత 2022 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు ఒంటరిగానే పోటీ చేశాయి. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరవకపోగా, అకాలీదళ్ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది.

రాష్ట్రంలో ఎస్ఎస్ఎస్ (RSS), బీజేపీ నేతలు, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నాయకులు మళ్లీ పొత్తు వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నగర ప్రాంతాల్లో బీజేపీకి, గ్రామీణ ప్రాంతాల్లో అకాలీదళ్‌కి బలం ఉండటంతో ఇరు పార్టీలకూ ఇది ప్రయోజనకరంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సీట్ల కేటాయింపుపై కొత్త షరతులు?

గతంలో అకాలీదళ్ పెద్దన్న పాత్ర పోషించగా, బీజేపీ చిన్న భాగస్వామిగా ఉండేది. కానీ, ఈసారి సమాన ప్రాతిపదికన మాత్రమే పొత్తు ఉంటుందని బీజేపీ నాయకత్వం సంకేతాలు ఇస్తోంది. మరోవైపు పంజాబ్‌లో ప్రస్తుతం ఉన్న శాంతిభద్రతల పరిస్థితి, జాతీయ భద్రత అంశాలే తమకు ప్రాధాన్యమని అకాలీదళ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ సమావేశంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. 'ఇరు పార్టీలు మళ్లీ కలిసేందుకు సిద్ధమయ్యాయా?' అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ఈ భేటీ పంజాబ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

ముంబై లోకల్ ‌ట్రైన్‌లో అమానుషం.. మహిళపై వ్యక్తి దాడి..

గుజరాత్‌లో ప్రజలను భయపెడుతున్న బావి రహస్యం..

Updated Date - Aug 07 , 2026 | 05:06 PM