బాలికపై లైంగిక వేధింపులు.. ఎన్‌కౌంటర్‌లో నిందితుడికి బుల్లెట్ గాయాలు..
ABN , Publish Date - Sep 22 , 2026 | 01:40 PM
బిహార్‌లో పదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న నందన్ యాదవ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. పరారీలో ఉన్న అతడిని పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోతుండటంతో కాళ్లపై కాల్చారు.
పాట్నా: బిహార్‌లో పదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న నందన్ యాదవ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే, వారి నుంచి తప్పించుకునేందుకు యత్నించడంతో నందన్ యాదవ్‌పై కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో అతడి కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం నందన్ యాదవ్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, మిగతా నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
కాగా, రెండు రోజుల కిందట జమయి జిల్లా మద్వా పహాడ్ ప్రాంతంలో ఇద్దరు పదో తరగతి విద్యార్థులపై అల్లరి మూక దాడి చేసింది. కోచింగ్ క్లాసుల నుంచి ఇంటికి వెళ్తున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడగా.. బాలుడిని తీవ్రంగా హింసించారు. బాలికను అసభ్యకరంగా తాకుతూ చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ లైంగిక వేధింపుల ఘటనను సీరియస్‌గా తీసుకున్న బిహార్ ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. దీంతో నిందితులపై పోక్సో కేసు నమోదు కాగా.. ముగ్గురిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిందితుడు నందన్ యాదవ్‌ను పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్..
12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..