బిహార్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. బీజేపీకి 12 మంత్రి పదవులు
ABN , Publish Date - May 05 , 2026 | 03:00 PM
బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం కీలకమైన మంత్రివర్గ విస్తరణను ఈనెల 7న చేపట్టనుంది. చారిత్రక గాంధీ మైదాన్‌లో మంత్రుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పాట్నా: బిహార్ (Bihar)లో ఎన్డీయే ప్రభుత్వం కీలకమైన మంత్రివర్గ విస్తరణను ఈనెల 7న చేపట్టనుంది. చారిత్రక గాంధీ మైదాన్‌లో మంత్రుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గంలో 36 మందికి అవకాశం ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, జేడీయూకు చెందిన ఉప ముఖ్యమంత్రులు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ కొత్త మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేశారు. రెండ్రోజుల క్రితం సామ్రాట్ చౌదరి ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్‌షా, ఇతర బీజేపీ సీనియర్ నేతలను కలుసుకున్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.
క్యాబినెట్ కూర్పు ఇదే..
విశ్వసనీయ వర్గాల సమాచారం, సామ్రాట్ చౌదరి మంత్రివర్గంలో బీజేపీ నుంచి 12 మంది, జేడీయూ నుంచి 11 మంది, ఎల్‌జేపీ (రామ్ విలాస్)కి 2, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించే అవకాశం ఉంది. జేడీయూకు చెందిన 8 మంది మంత్రులు తిరిగి అదే పదవుల్లో కొనసాగుతారని, కొత్తగా ఐదుగురికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని తెలుస్తోంది. వారిలో శ్వేత గుప్తా, భగవాన్ కుష్వాహ, రత్నేష్ సదా, షీలా మండల్, బులో మండల్ ఉంటారని తెలుస్తోంది.
నితీశ్ కుమార్ రాజీనామాతో 2026 ఏప్రిల్‌లో బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడంతో స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి పదవికి నితీశ్ రాజీనామా చేశారు. దీంతో ఎన్డీయే ప్రభుత్వానికి బీజేపీ నేత చౌదరి సారథ్యం వహించేందుకు మార్గం సుగమమైంది. నితీశ్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్‌కు మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్టు ప్రచారం జరిగినప్పటికీ, ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర తీసుకునేందుకు నిశాంత్ నిరాకరించారు.
ఇవి కూడా చదవండి..
బెంగాల్‌కు బీజేపీ కేంద్ర పరిశీలకుడిగా అమిత్‌షా, అస్సాంకు జేపీ నడ్డా
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన విజయ్..