Share News

మూసివేసిన బ్రిడ్జిపై పుట్టిన రోజు వేడుకలు.. ఈవెంట్ నిర్వాహకుడిపై కేసు నమోదు..

ABN , Publish Date - Jul 16 , 2026 | 07:14 PM

భద్రతా కారణాల దృష్ట్యా మూసివేసిన ఓ రైల్వే ఓవర్‌బ్రిడ్జిపై జన్మదిన వేడుకలు నిర్వహించడం కలకలం రేపింది. నిర్మాణ లోపాలతో మూసివేసిన ఆ బ్రిడ్జిపై పెద్దఎత్తున డీజేలు ఏర్పాటు చేసి వందలాది మంది హుషారుగా నృత్యాలతో హోరెత్తించారు.

మూసివేసిన బ్రిడ్జిపై పుట్టిన రోజు వేడుకలు.. ఈవెంట్ నిర్వాహకుడిపై కేసు నమోదు..

బిహార్: భద్రతా కారణాల దృష్ట్యా మూసివేసిన ఓ రైల్వే ఓవర్‌బ్రిడ్జిపై జన్మదిన వేడుకలు నిర్వహించడం కలకలం రేపింది. నిర్మాణ లోపాలతో మూసివేసిన ఆ బ్రిడ్జిపై పెద్దఎత్తున డీజేలు ఏర్పాటు చేసి వందలాది మంది హుషారుగా నృత్యాలతో హోరెత్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి పోలీసుల దృష్టికి వెళ్లడంతో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన బిహార్‌లోని బక్సర్ జిల్లాలో చోటుచేసుకుంది.


బక్సర్ జిల్లాలో మే 31న బక్సర్-ఇటార్హి రైల్వే ఓవర్‌బ్రిడ్జి ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టును దాదాపు 12 ఏళ్ల పాటు రూ.26.4కోట్ల వ్యయంతో అధికారులు నిర్మించారు. అయితే, వాహనాల రాకపోకలకు తెరిచిన కేవలం నాలుగు రోజులకే బ్రిడ్జి దెబ్బతింది. ఐదో పిల్లర్‌పై ఉన్న స్లాబ్ ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో అధికారులు మొదట భారీ వాహనాలను వంతెనపైకి రాకుండా నిషేధించారు. ఆ తర్వాత రైల్వే ఓవర్‌బ్రిడ్జిని నిశితంగా పరిశీలించి జూన్ 5 నుంచి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. బ్రిడ్జిపైకి ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించారు.

Bridge2.jpg


అయితే, అధికారుల ఆంక్షలను ఓ స్థానిక కుటుంబం లెక్కచేయలేదు. జులై 11న పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించింది. ఆ రోజు వందల మంది బ్రిడ్జిపై గుమిగూడారు. పెద్దపెద్ద డీజేలు పెట్టి నచ్చిన పాటలకు డ్యాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రజా వినియోగానికి సురక్షితం కాదని ప్రకటించిన వంతెనపై ఇలాంటి కార్యక్రమానికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఈ విషయం బక్సర్ ఎస్పీ శుభమ్ ఆర్య దృష్టికి వెళ్లింది. దీంతో ఈవెంట్ నిర్వాహకుడు రాకేశ్ కుమార్ సింగ్‌పై కేసు నమోదు చేశారు. అయితే, పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన కుటుంబంపైనా చర్యలు తీసుకుంటారా, లేదా? అనేది వేచి చూడాలి.


ఈ వార్తలు కూడా చదవండి

భూమి కోసం 35 ఏళ్ల పాటు పోరాటం చేసిన వృద్ధురాలు.. చివరికి..

టీఎంసీ, మమతా బెనర్జీకి షాక్.. రాజీనామా చేసిన ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ..

Updated Date - Jul 16 , 2026 | 07:20 PM