Share News

సహకార క్యాబ్‌ సర్వీస్‌!

ABN , Publish Date - Aug 30 , 2026 | 05:22 AM

ఎక్కకడికైనా వెళ్లటం కోసం క్యాబ్‌ బుక్‌ చేస్తే.. తొలుత ఒక రేటు కనిపిస్తుంది. అది ఎక్కువగా ఉందని, మరో పది నిమిషాలకు ప్రయత్నిస్తే.. మరో రేటు ఉంటుంది.

సహకార క్యాబ్‌ సర్వీస్‌!

  • జాతీయ సహకార సంఘాల ఆధ్వర్యంలో భారత్‌ ట్యాక్సీ

ఎక్కకడికైనా వెళ్లటం కోసం క్యాబ్‌ బుక్‌ చేస్తే.. తొలుత ఒక రేటు కనిపిస్తుంది. అది ఎక్కువగా ఉందని, మరో పది నిమిషాలకు ప్రయత్నిస్తే.. మరో రేటు ఉంటుంది. మామూలు వేళల్లోనే ఇలా ఉంటే.. ఇక వర్షం పడుతున్నప్పుడో, ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే పీక్‌ అవర్స్‌లోనోనైతే ఇక చెప్పనక్కర్లేదు. ఇటువంటి జంజాటం ఏమీ లేకుండా.. స్థిరంగా ఒకే ధర చూపుతూ, గమ్యం చేరుకున్నాక కూడా దానిని పెంచకుండా అంతే మొత్తాన్ని వసూలు చేసే క్యాబ్‌ అందుబాటులో ఉంటే?. గత ఏడాది కేంద్రప్రభుత్వం మద్దతు తో పలు జాతీయ సహకార సంఘాలు సంయుక్తం గా ప్రారంభించిన భారత్‌ ట్యాక్సీ సరిగ్గా ఇటువంటిదే. ఈ క్యాబ్‌ సర్వీస్‌తో ప్రయాణికులకే కాదు.. డ్రైవర్ల కు కూడా అనేక ప్రయోజనాలున్నాయి. జీరో కమీషన్‌ పద్ధతిలో ఇది పని చేస్తుంది. అంటే, ప్రయాణికుల నుంచి వచ్చే మొత్తంలో డ్రైవర్లు సంస్థకు ఎలాంటి కమీషన్‌ చెల్లించాల్సిన అవసరం లేదు.

దేశంలోనే తొలిసారిగా సహకార రంగంలో క్యాబ్‌

భారత్‌ ట్యాక్సీ దేశంలోనే తొలిసారిగా సహకార విధానంలో పని చేసే క్యాబ్‌ సర్వీస్‌. గత ఏడాది జూన్‌ 6న ‘బహుళ రాష్ట్రాల సహకార సంఘాల చట్టం-2002’ కింద ‘సహకార్‌ ట్యాక్సీ కో ఆపరేటివ్‌ లిమిటెడ్‌’ పేరుతో ఏర్పాటైంది. నాబార్డ్‌, నాఫెడ్‌, క్రిభ్కో, ఎన్‌సీడీసీ తదితర 8 జాతీయస్థాయి సహకార సంఘాల ఆధ్వర్యంలో ఈ సంస్థను నెలకొల్పారు. ‘సారథి మాలిక్‌’ అనే సూత్రం ప్రాతిపదికగా ఇది నడుస్తుంది. డ్రైవర్లను సారథిగా సంబోధిస్తారు. ప్రస్తుతం భారత్‌ ట్యాక్సీ సేవలు ఢిల్లీ, గుజరాత్‌, లక్నో, చండీగఢ్‌, ముంబై, జైపూర్‌, కాన్పూర్‌, పుణెల లో ఉన్నాయి. భారత్‌ ట్యాక్సీ యజమానులు డ్రైవర్లే. సంస్థ పెట్టుబడి షేర్‌ ధర రూ.100. కనీసం ఐదు షేర్లు(రూ.500) కొని ఏ డ్రైవర్‌ అయినా సంస్థలో భాగస్వామి కావచ్చు.


ఎలా పని చేస్తుంది?

ఇది పూర్తిగా జీరో కమీషన్‌ ప్రాతిపదికన నడుస్తుంది. ట్రిప్పుల ద్వారా లభించే ఆదాయం మొత్తం డ్రైవర్లకే చెందుతుంది. షేర్ల విక్రయం తదితర మార్గాల్లో సంస్థకు లభించే ఆదాయంలో 80 శాతాన్ని డ్రైవర్లకే పంచుతారు. ఒక నిర్ణీత వ్యవధిలో వారి వాహనం ఎన్ని కి.మీ.లు ప్రయాణించింది అన్న దాన్ని బట్టి లాభాలను చెల్లిస్తారు. ఆదాయంలో 20 శాతాన్ని నిర్వహణ ఖర్చుల కోసం సంస్థ వద్దే జమ చేస్తా రు. డిమాండ్‌ను బట్టి ధరలను డైనమిక్‌గా మార్చటం వంటివి ఉండవు. ఎయిర్‌పోర్టు ప్రీపెయిడ్‌ సర్వీసుల మీద మాత్రం 7 శాతం సర్వీస్‌చార్జి వసూలు చేస్తారు. మహిళా డ్రైవర్లను ప్రోత్సహించటం కోసం సారథి దీదీ, బైక్‌ దీదీ అనే ప్రత్యేక విభాగాలను అమలు చేస్తున్నారు. భారత్‌ ట్యాక్సీని క్రమంగా విస్తరిస్తున్నారు. సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో హైదరాబాద్‌లో విస్తరించే ప్రణాళికలున్నాయి. 2029 నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు. - (సెంట్రల్‌ డెస్క్‌)

Also Read:

సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్‌

గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు

Updated Date - Aug 30 , 2026 | 05:51 AM