Share News

పెంపుడు కుక్క దాడి.. మహిళకు 50 కుట్లు.. సీసీటీవీలో భయానక దృశ్యాలు!

ABN , Publish Date - Jan 31 , 2026 | 08:41 AM

మార్నింగ్ వాక్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న మహిళపై ఎదురింటి వారి పెట్ డాగ్ అత్యంత క్రూరంగా దాడి చేసింది. ఆ దాడి వల్ల బాధిత మహిళకు 50కి పైగా కుట్లు పడ్డాయి. CCTVలో భయానక దృశ్యాలు రికార్డయ్యాయి.

పెంపుడు కుక్క దాడి.. మహిళకు 50 కుట్లు.. సీసీటీవీలో భయానక దృశ్యాలు!
Bengaluru Dog Attack

బెంగళూరు, జనవరి 31: బెంగళూరు HSR లేఅవుట్‌లోని టీచర్స్ కాలనీలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. ఎదురింటి వాళ్ల పెంపుడు కుక్క చేసిన దాడిలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ దాడి తీవ్రత ఎంతలా ఉందంటే, ఆమె శరీరానికి ఏకంగా 50కుట్లు వేయాల్సి వచ్చిందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

Bengalore-Dog-Attack.jpgఏం జరిగింది?

బాధిత మహిళ మార్నింగ్ వాక్ కు వెళ్లి తిరిగి ఉదయం 6:54 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకుంటోంది. గేట్ దగ్గరకి సమీపిస్తున్న సదరు మహిళపై ఎదురింటికి(అమరేష్ రెడ్డి అనే వ్యక్తి) చెందిన పెంపుడు కుక్క ఒక్కసారిగా విరుచుకుపడింది. ఆమెను కింద పడేసి ముఖం, మెడ, కాళ్లపై తీవ్రంగా కొరికి గాయపరిచింది. ఆమె అరుస్తున్నా కుక్క వదలకుండా దాడిని కొనసాగించింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన కుక్క యజమానికీ గాయాలయ్యాయి.

సీసీటీవీలో రికార్డైన బీభత్సం

ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు బాధితురాలి ఇంటి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అందులో కుక్క అత్యంత క్రూరంగా ఆమెను వేటాడుతున్నట్లు కనిపిస్తోంది. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలిని వెంటనే సెయింట్ జాన్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె ముఖం, మెడ భాగంలో లోతైన గాయాలయ్యాయని, కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.


పోలీసులకు ఫిర్యాదు

ఘటనపై బాధిత మహిళ భర్త సత్యప్రకాశ్ దుబే HSR లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుక్క యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. బాధితురాలైన తన భార్య డీప్ షాక్‌లోకి వెళ్లిపోయిందని వాపోయాడు. ఆయన ఇంకా ఏమన్నారంటే, 'సదరు కుక్క అంత్యంత ప్రమాదకరంగా ఉంది. యజమాని కూడా అదుపు చేయలేకపోయాడు. పెట్ డాగ్ పెంచుకునేవారు బాధ్యతగా చూసుకోవాలి. ఈ క్రాస్‌బ్రీడ్(సంకరజాతి) కుక్కను లీష్(మెడ తాడు) లేదా ముజిల్(నోటి కవర్) చేయకుండా వదిలేశారు' అని బాధిత మహిళ భర్త సత్యప్రకాశ్ దుబే తెలిపారు.


దాడి చేసిన కుక్క యజమానికి కఠిన శిక్ష పడాలని, ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యం చూపే వారికి గుణపాఠం కావాలని బాధితురాలి భర్త దుబే డిమాండ్ చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. CCTV ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. బాధిత మహిళ (31 ఏళ్లు) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పెంపుడు జంతువుల యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇతరుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవీ చదవండి:

బడ్జెట్ 2026.. కొత్త పన్ను విధానంలో మరిన్ని మార్పులు రానున్నాయా?

మూడో అతిపెద్ద విమాన మార్కెట్‌గా భారత్‌

Updated Date - Jan 31 , 2026 | 12:44 PM