అత్తారింటిపై పగతో ఏడుగురి హత్య
ABN , Publish Date - Nov 07 , 2026 | 03:15 AM
అతనో క్యాబ్ డ్రైవర్...పెళ్లయి 20ఏళ్లైంది. తరచూ భార్యతో గొడవ పడడంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లేది. అక్కడ తల్లి, ఇద్దరు సోదరులు ఆమెకు మద్దతుగా నిలిచేవారు.
ఇంటికి పిలిచి రుబ్బురోలుతో కొట్టి చంపిన
ఓ క్యాబ్ డ్రైవర్.. బెంగళూరులో ఘటన
బెంగళూరు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): అతనో క్యాబ్ డ్రైవర్...పెళ్లయి 20ఏళ్లైంది. తరచూ భార్యతో గొడవ పడడంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లేది. అక్కడ తల్లి, ఇద్దరు సోదరులు ఆమెకు మద్దతుగా నిలిచేవారు. దీంతో తమ కాపురం నాశనం కావడానికి తన భార్య కుటుంబమే కారణమని ఆ క్యాబ్ డ్రైవర్ రగిలిపోయాడు. ఉన్మాదిగా మారి.. భార్యతో సహా ఆమె కుటుంబంలోని ఏడుగురిని ఒకరి తర్వాత ఒకరిని ఇంటికి పిలిచి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆపై వారి మృతదేహాలను మాయం చేశాడు. బెంగళూరులో ఈ దారుణం వెలుగుచూసింది. నగర పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ ఈ హత్యల వివరాలను శుక్రవారం మీడియాకు వివరించారు. బెంగళూరు శ్రీరాంపురకు చెందిన క్యాబ్ డ్రైవర్ ఇందుశేఖర్ చేతిలో ఆయన భార్య సునీత(45), అత్త రూపవతి(65), బావమరిది శివకుమార్, ఆయన భార్య దివ్య(30), మరో బావమరిది శంకర్, ఆయన భార్య నళిని(29), వీరి కుమారుడు పునీత్(7) హత్యకు గురయ్యారని తెలిపారు. శంకర్, నళిని దంపతుల 14 ఏళ్ల మరో కుమారుడిని కూడా హత్యచేసేందుకు సిద్ధమయ్యాడని, ఈలోగా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
పార్టీ చేసుకుందామని బామ్మర్దుల హత్య
అత్తారింట్లో ఉన్న భార్యను ‘మాట్లాడుకుందాం రా..’ అని అక్టోబరు 17న ఇంటికి పిలిచాడు. అక్కడ ఆమెను రుబ్బురోలుతో కొట్టి చంపేసి.. మృతదేహాన్ని నందిహిల్స్‌లో పడేశాడు. భార్య విహార యాత్రకు వెళ్లిందని అందరితో నమ్మబలికాడు. ఆమె ఫోన్ స్విచాఫ్ రావడంతో తల్లి రూపవతి శ్రీరాంపుర పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఓ వైపు ఈ దర్యాప్తు జరుగుతుండగానే బావమరుదులు శివకుమార్, శంకర్‌లను పార్టీ చేసుకుందామని ఇంటికి పిలిచి వారిని కూడా ఇందుశేఖర్ రుబ్బురోలుతో కొట్టి చంపేశాడు. తర్వాత వారిద్దరిని వెతుకుదామంటూ శివకుమార్, శంకర్ భార్యలను ఇంటికి పిలిచి హత్యచేశాడు. చివరగా అత్త రూపవతిని, శంకర్ కుమారుడు పునీత్‌ను ఇదే తరహాలో చంపేశాడు. సునీత అదృశ్యం కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఇందుశేఖర్ రోజుకోమాట చెప్పేవాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఏడు హత్యలు వెలుగులోకి వచ్చాయి. ‘అక్టోబరు 17 నుంచి.. ఆ నెలాఖరువరకు ఈ హత్యలు జరిగాయి’ అని కమిషనర్ చెప్పారు.
ఇవి కూాడా చదవండి...
శాటిలైట్లకు చిక్కకుండా పంట వ్యర్థాల దహనం.. ‘ఫైర్ వాచ్’తో సమస్యకు చెక్
ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీంకోర్టు కీలక స్పష్టత.