బెంగళూరులో దారుణం.. భార్యతో సహా ఏడుగురిని చంపిన క్యాబ్ డ్రైవర్
ABN , Publish Date - Nov 06 , 2026 | 10:17 AM
బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్.. తన భార్యతో సహా ఏడుగురిని దారుణంగా హత్య చేశాడు. కుటుంబ కలహాలే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పార్టీ పేరుతో కుటుంబ సభ్యులను ఇంటికి పిలిచి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్.. తన భార్యతో సహా ఏడుగురిని దారుణంగా హత్య చేశాడు. కుటుంబ కలహాలే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పార్టీ పేరుతో కుటుంబ సభ్యులను ఇంటికి పిలిచి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇందుశేఖర్ అనే క్యాబ్ డ్రైవర్.. తన భార్య సునీత పుట్టింటి వారితో నిరంతరం సంబంధాలు కొనసాగించడంపై కోపం పెంచుకున్నాడు. దీంతో పాటూ కుటుంబ కలహాల కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఇందుశేఖర్.. తన భార్య సునీత పుట్టింటి వారితో తరచూ మాట్లాడటంపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే హత్యలకు పథకం రచించినట్లు అనుమానిస్తున్నారు. మొదట భార్యను హత్య చేసిన నిందితుడు.. పార్టీ ఇస్తాననే నెపంతో ఆమె కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఇంటికి పిలిచి హత్య చేసినట్లు సమాచారం. అనంతరం వారి భార్యలు, అత్త రూపవతి, ఏడేళ్ల బాలుడు పునీత్‌ను కూడా హతమార్చినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. సాక్ష్యాధారాలు నాశనం చేసేందుకు రసాయనాలు వాడి, అనంతరం మృతదేహాలను కారులో తీసుకెళ్లి నంది హిల్స్ పరిసర ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల పడేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యలకు ఉపయోగించిన వస్తువులు, మృతదేహాల తరలింపు, నిందితుడి వెనుక ఉన్న అసలు కారణాలపై విచారణ కొనసాగుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ