ఓటెత్తిన పల్లెలు
ABN , Publish Date - Nov 06 , 2026 | 01:17 AM
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభంకాగా.. అప్పటికే పెద్ద సంఖ్యలో పురుషులు, మహిళలు ఆయా పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు. మహిళలు, వృద్ధులు, యువత... అన్ని వర్గాల వారు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఎన్నికల అధికారులు అందించిన వివరాల ప్రకారం సుమారు 75 శాతం ఓటింగ్ నమోదైంది.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఉత్సాహంగా ఓట్లు వేసిన గ్రామీణులు
ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు
పలుచోట్ల సాయంత్రం ఐదు గంటల తరువాత కూడా క్యూలు
పోలింగ్ కేంద్రాల గేట్లు వేసి.. ఓటింగ్‌ను కొనసాగించిన అధికారులు
మొత్తం ఓటర్లు: 12,35,090
పోలైన ఓట్లు: 9,23,662
సుమారు 75 శాతం ఓటింగ్
రోలుగుంటలో అత్యధికం: 80.4 శాతం
పాయకరావుపేటలో అత్యల్పం: 66.66 శాతం
ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశిక పోలింగ్
అనకాపల్లి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభంకాగా.. అప్పటికే పెద్ద సంఖ్యలో పురుషులు, మహిళలు ఆయా పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు. మహిళలు, వృద్ధులు, యువత... అన్ని వర్గాల వారు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఎన్నికల అధికారులు అందించిన వివరాల ప్రకారం సుమారు 75 శాతం ఓటింగ్ నమోదైంది.
జిల్లాలో 24 జడ్పీటీసీ, 427 ఎంపీటీసీ స్థానాలు వున్నాయి. అచ్యుతాపురం, ఎస్.రాయవరం మండలాల్లో ఒక్కో ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 24 జడ్పీటీసీ, 425 ఎంపీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది. ఇందుకోసం 1,530 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ స్థానాలకు 80 మంది, ఎంపీటీసీ స్థానాలకు 989 మంది పోటీపడ్డారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. జిల్లాలో మొత్తం 12,35,090 మంది ఓటర్లు వుండగా 9,23,662 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 4,43,835 మంది, మహిళలు 4,79,824 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు. అక్కడక్కడ స్వల్ప వాగ్వాదాలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బ్యాలెట్ బాక్సులను పోలీసు బందోబస్తు మధ్య సంబంధిత స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. అతి సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెట్టారు. గట్టి పోటీ నెలకొన్న ఎంపీటీసీ స్థానాలు, ఎంపీపీ పదవిని ఆశిస్తున్న అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో ఆయా ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ఓటర్లకు తాయిలాలు అందజేశారు. ఎక్కువచోట్ల ఒక్కో ఓటుకు రూ.1,000 చొప్పున పంపిణీ చేసినట్టు చెబుతున్నారు. పురుషులకు డబ్బులతోపాటు మద్యం సీసాలు కూడా ఇచ్చారు
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి, ఎమ్మెల్యేలు
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నక్కపల్లి జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో సాధారణ ఓటర్లతో కలిసి క్యూలైన్లో నిల్చుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి దంపతులు తమ స్వగ్రామమైన పరవాడ మండలం వెన్నెలపాలెంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు పట్టణంలోని కొత్తూరు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ కుటుంబ సభ్యులతో కలిసి రాంబిల్లి మండలం కొత్తూరులో ఓటు వేశారు.
పోలింగ్‌ను పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్సీ
కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా జిల్లాలోని పలు మండలాల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులకు, పోలీసులకు పలు సూచనలు చేశారు. కశింకోట మండలం నర్సింగబిల్లి పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ విజయకృష్ణన్, ఇదే మండలం ఏఎస్ పేట, బయ్యవరం పోలింగ్ కేంద్రాలను ఎస్పీ తుహిన్ సిన్హా సందర్శించారు. ఆయా కేంద్రాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఎస్.రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా వేర్వేరుగా సందర్శించారు. అదే విధంగా కలెక్టర్ ఎలమంచిలి మండలం రేగుపాలెం పోలింగ్ బూత్‌ను, పాయకరావుపేటలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. కలెక్టర్ విజయకృష్ణన్ సాయంత్రం 4.30 గంటలకు నక్కపల్లి మండలం ఉపమాక పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ ముగియడానికి ఇంకా 30 నిమిషాలు మాత్రమే వుండడం, క్యూ లైన్లలో ఎక్కువ మంది ఓటర్లు వుండడంతో త్వరగా ఓటింగ్ జరిగేలా చూడాలని పోలింగ్ అధికారులను ఆదేశించారు.
కాగా ఎన్నికల పరిశీలకుడు రోణంకి గోపాలకృష్ణ గొలుగొండ మండలంలోని ఎర్రవరం, చీడిగుమ్మల పోలింగ్ కేంద్రాలను, నర్సీపట్నం మండలంలోని వేములపూడి, దుగ్గాడ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అనంతరం నర్సీపట్నంలోని డాన్‌బాస్కో కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములను పరిశీలించారు.
మండలం మొత్తం పోలైన శాతం
ఓటర్లు ఓట్లు
01 అనకాపల్లి 81,568 57,333 70.29
02 కశింకోట 56,589 42,762 75.56
03 మునపాక 45,716 36,520 79.88
04 అచ్యుతాపురం 63,003 46,130 73.22
05 రాంబిల్లి 42,356 32,902 77.70
06 ఎలమంచిలి 20,422 15,706 76.91
07 ఎస్.రాయవరం 62,032 42,369 68.30
08 నక్కపల్లి 66,206 51,507 77.8
09 పాయకరావుపేట 79,851 53,232 66.66
10 కోటవురట్ల 44,650 33,857 75.83
11 నర్సీపట్నం 23,962 18,840 78.62
12 నాతవరం 51,781 39,233 75.77
13 గొలుగొండ 41,612 30,907 74.27
14 మాకవరపాలెం 46,985 36,628 77.96
15 రోలుగుంట 37,950 30,511 80.40
16 రావికమతం 56,003 43,019 76.81
17 బుచ్చెయ్యపేట 52,238 37,625 72.03
18 చోడవరం 72,986 52,396 71.79
19 మాడుగుల 53,538 40,741 76.10
20 చీడికాడ 36,784 29,241 79.49
21 దేవరాపల్లి 47,250 37,094 78.50
22 కె.కోటపాడు 49,338 39,581 80.22
23 సబ్బవరం 54,337 43,626 80.29
24 పరవాడ 44,926 33,982 75.64