Share News

నేతాజీపై వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ అనంత మహారాజ్‌కు బెంగాల్ ప్రభుత్వం షాక్..

ABN , Publish Date - Aug 13 , 2026 | 06:28 PM

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు నాగేంద్ర రాయ్ (అనంత మహారాజ్)కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం షాకిచ్చింది.

నేతాజీపై వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ అనంత మహారాజ్‌కు బెంగాల్ ప్రభుత్వం షాక్..
Netaji Controversy

ఇంటర్నెట్ డెస్క్: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు నాగేంద్ర రాయ్ (అనంత మహారాజ్)కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రదానం చేసిన రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం 'బంగ విభూషణ్'ను ఉపసంహరించి, రద్దు చేసింది. ఈ నిర్ణయం గురువారం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది (Ananta Maharaj Banga Bibhushan).


అనంత మహారాజ్ ఇటీవల నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను 'యుద్ధ నేరస్థుడు'గా అభివర్ణించి వివాదానికి తెర తీశారు. స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీ నాయకత్వం, ఆజాద్ హింద్ ఫౌజ్ పాత్రపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. అత్యంత గౌరవనీయ నాయకుడైన నేతాజీపై అవమానకర వ్యాఖ్యలను సహించబోమని ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ విషయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులు అనే తేడా ఉండదని కూడా ఆయన పేర్కొన్నారు (Netaji Controversy).


కాగా, నాగేంద్ర రాయ్‌కు 2026 ఫిబ్రవరి 21న 'బంగ విభూషణ్' పురస్కారం లభించింది (Bengal Politics). అప్పట్లో మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారంలో ఉంది. రాష్ట్రానికి, ప్రజలకు విశిష్టమైన సేవలు చేశారనే కారణంతో నాగేంద్రరాయ్‌కు మమత సర్కారు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయనకు ఇచ్చిన పురస్కారాన్ని ఉపసంహరించుకుని రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. నేతాజీ వారసత్వాన్ని అవమానించే వ్యాఖ్యలు పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించవచ్చని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.


ఇవి కూడా చదవండి..

మావోయిస్టు క్యాంప్‌ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు..


మీరు చేయలేకపోతే మేమే చేస్తాం.. లేబుల్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక..

Updated Date - Aug 13 , 2026 | 06:28 PM