60 రవాణా విమానాలు, 150 శిక్షణ విమానాలు.. భారత రక్షణ రంగం భారీ కొనుగోళ్లు..
ABN , Publish Date - Aug 13 , 2026 | 05:54 PM
భారత వాయుసేనను మరింత బలోపేతం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ భారీగా విమానాలను కొనుగోలు చేయనుంది. 60 రవాణా విమానాలు, 150 శిక్షణ విమానాలను సమకూర్చుకునేందుకు సిద్ధమవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత వాయుసేనను మరింత బలోపేతం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ భారీగా విమానాలను కొనుగోలు చేయనుంది. 60 రవాణా విమానాలు, 150 శిక్షణ విమానాలను సమకూర్చుకునేందుకు సిద్ధమవుతోంది. భారతదేశంలో తయారైన విమానాలను కొనుగోలు చేయడానికే ప్రాధాన్యం ఇవ్వడం ఈ ప్రాజెక్టులో కీలకాంశం (India Transport Aircraft).
వివిధ ప్రయోజనాల కోసం వినియోగించే 60 రవాణా విమానాల కొనుగోలు ప్రాజెక్టు విలువ దాదాపు రూ.1 లక్ష కోట్లు ఉండవచ్చని రక్షణ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్టులో దేశీయ సంస్థలకు కీలక పాత్ర లభించే అవకాశం ఉంది. టాటా గ్రూప్, మహీంద్రా గ్రూప్, ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) పోటీలో ముందుండే అవకాశం ఉందని సమాచారం. గుజరాత్‌లో ఎయిర్‌బస్‌తో కలిసి సీ-295 రవాణా విమానాల తయారీలో టాటా ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తోంది (60 Transport Aircraft).
బాగా పాతబడిన భారత వాయుసేన రవాణా విమానాల స్థానంలో కొత్త విమానాలను ప్రవేశపెట్టడం ఈ కొనుగోలు ప్రధాన ఉద్దేశం. సైనికులు, ఆయుధ సామగ్రి, ఇతర అవసరమైన సరఫరాలను దేశంలోని సుదూర ప్రాంతాలకు వేగంగా తరలించేందుకు ఈ విమానాలు ఉపయోగపడనున్నాయి (Defence Procurement India).
ఇక, 150 శిక్షణ విమానాలను కొనుగోలు చేసేందుకు కూడా రక్షణ మంత్రిత్వ శాఖ మరో అభ్యర్థనను జారీ చేసింది. ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ.15,000 కోట్లు ఉండవచ్చని అంచనా. వాయుసేనలో కొత్త తరం పైలట్లను సిద్ధం చేయడానికి శిక్షణ విమానాలు అత్యంత కీలకం. ప్రాథమిక శిక్షణకు ఉపయోగపడే హెచ్‌టీటీ-40 విమానాలను ఇప్పటికే హెచ్‌ఏఎల్ తయారు చేస్తోంది. కాగా, ఈ రెండు కొనుగోలు ప్రక్రియలు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా దేశీయ విమాన తయారీ సామర్థ్యాన్ని పెంచే కీలక అడుగుగా భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మావోయిస్టు క్యాంప్ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు..
మీరు చేయలేకపోతే మేమే చేస్తాం.. లేబుల్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక..