‘హద్దుల’ మధ్య వెతలు!
ABN , Publish Date - Jun 16 , 2026 | 05:50 AM
బెంగాల్‌లోని కూచ్‌బెహార్, పానిశాల వద్ద సరిహద్దుల నుంచి 10 మంది బంగ్లాదేశీలను పంపించేందుకు భారత సరిహద్దు రక్షణ దళం (బీఎ్‌సఎఫ్) ప్రయత్నించింది. అందులో మహిళలు, పిల్లలు కూడా...
అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీలను వెనక్కి పంపేందుకు ఉధృతంగా ప్రయత్నాలు
చొరబాటుదార్లను బీఎస్ఎఫ్‌కు అప్పగిస్తున్న సరిహద్దు రాష్ట్రాలు
వారిని స్వదేశంలోకి రానివ్వని బంగ్లా బలగాలు.. సరిహద్దుల్లో ఉద్రిక్తత
(సెంట్రల్ డెస్క్)
బెంగాల్‌లోని కూచ్‌బెహార్, పానిశాల వద్ద సరిహద్దుల నుంచి 10 మంది బంగ్లాదేశీలను పంపించేందుకు భారత సరిహద్దు రక్షణ దళం (బీఎ్‌సఎఫ్) ప్రయత్నించింది. అందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. అయితే బంగ్లాదేశ్ దళాలు వారిని అనుమతించలేదు. ఇటు బీఎ్‌సఎఫ్ వారిని వెనక్కి రానివ్వలేదు. దీనితో వారంతా హద్దుల మధ్యలోనే నిలిచిపోయారు. సుమారు రెండు రోజుల పాటు రాత్రీపగలూ అక్కడే పడిగాపులు కాశారు. బంగ్లాదేశ్ దళాలు తగిన ధ్రువపత్రాలు పరిశీలించి, సమాచారాన్ని నిర్ధారించుకున్నాక.. 10 మందిని తమ దేశంలోకి రానిచ్చారు.
భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద సుమారు నెలన్నర రోజులుగా రోజూ ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అక్రమంగా చొరబడినవారిని పంపేసేందుకు భారత్‌వైపు నుంచి జరుగుతున్న ప్రయత్నాలు ఒకవైపు.. వారు తమ దేశ పౌరులేనా, కాదా అని తేలకుండా ఎలా అనుమతిస్తామంటూ అడ్డుకుంటున్న బంగ్లాదేశ్ మరోవైపు.. మానవతా సంక్షోభం తరహా పరిస్థితి నెలకొంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరువైపులా తగిన ప్రణాళిక లేకపోవడం, ముందస్తు సమాచార మార్పిడి లేకపోవడం, సరిహద్దుల్లో భద్రతా బలగాలు మొండిగా వ్యవహరిస్తుండటమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. బంగ్లాదేశ్‌లో ఉపాధి లేక, తరచూ దాడులు, ఉద్రిక్తతలను తట్టుకోలేక.. చాలా మంది బంగ్లాదేశీలు భారత్‌లోకి చొరబడుతున్నారు. సరిహద్దుల మీదుగా అస్సాం, పశ్చిమబెంగాల్, మేఘాలయ తదితర రాష్ట్రాల్లోకి వచ్చి వివిధ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. వారితో స్థానికుల ఉపాధికి గండిపడటమేకాకుండా, కొందరి కారణంగా భద్రతాపరమైన సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీలను పంపేయాలనే డిమాండ్లు చాలాకాలంగా ఉన్నాయి. ఈ క్రమంలో అస్సాంలో హిమంత నేతృత్వంలోని బీజేపీ సర్కారు బంగ్లాదేశీలను గుర్తించి వెనక్కి పంపేందుకు ఇటీవల చర్యలు చేపట్టింది. మరోవైపు బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. చాలా మంది బంగ్లాదేశీలు తమదేశానికి వెళ్లిపోతున్నారు. వారిని ‘బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్(బీజీబీ) దళాలుఅడ్డుకుని, తిరిగి భారత్‌లోకి పంపేస్తున్నాయి. బంగ్లాదేశ్ అనుమతించని వారిని కొన్ని సందర్భాల్లో వెనక్కి రానిస్తున్న బీఎ్‌సఎఫ్.. క్యాంపుల్లో ఉంచి, తర్వాత పంపిస్తున్నట్టు కూడా వార్తలు వెలువడుతున్నాయి.
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు
ఈ నెల 5న పశ్చిమబెంగాల్‌లోని పానిశాల, సీతల్‌కుచి, దిన్‌హటా, జల్పాయ్‌గురి తదితర ప్రాంతాల నుంచి సరిహద్దుల మీదుగా 40 మంది బంగ్లాదేశీలను పంపేందుకు బీఎ్‌సఎఫ్ ప్రయత్నించింది. వారు తమ పౌరులు కాదంటూ బంగ్లాదేశ్ దళాలు అడ్డుకున్నాయి. దీనితో ఇరుదేశాల సైనికాధికారుల ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటు కోసం బీఎ్‌సఎఫ్ ప్రయత్నించింది. కానీ బంగ్లాదేశ్ బీజీబీ స్పందించలేదు. దీనితో మహిళలు, పిల్లలు సహా 40 మందీ సరిహద్దుల మధ్యే ఉండిపోయారు. వారందరి పౌరసత్వం నిర్ధారించుకున్న బీజీబీ 6వ తేదీన బంగ్లాదేశ్‌లోకి అనుమతించింది. ఇక తాజాగా సోమవారం అస్సాంలోని మంకాచార్ వద్ద సరిహద్దుల్లో కొందరు బంగ్లాదేశీలు చిక్కుకుపోయారు. బీఎ్‌సఎఫ్ వారిని పంపేందుకు ప్రయత్నిస్తుంటే.. బంగ్లాదేశ్ దళాలు రాకుండా అడ్డుకున్నాయి. తాము బంగ్లాదేశ్ పౌరులమేనని, తమ వద్ద పత్రాలు ఉన్నా రానివ్వడం లేదని బాధితులు పేర్కొంటున్న వీడియోలు వైరల్‌గా మారాయి.
తగిన నిఘా లేని చోట అటూ.. ఇటూ..
భారత్-బంగ్లాదేశ్ మధ్య సుమారు 4 వేల కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. అందులో 80శాతానికిపైగా బెంగాల్, అస్సాం రాష్ట్రాలతోనే అనుసంధానమై ఉంది. దీనితో ఈ రెండు రాష్ట్రాల్లోకి, ముఖ్యంగా బెంగాల్‌లోకి బంగ్లాదేశీల వలసలు ఎక్కువ. వేల కిలోమీటర్ల సరిహద్దులు కావడంతో.. తగిన నిఘా లేనిచోట అటూ, ఇటూ చొరబాట్లు జరుగుతూనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్రమ చొరబాటుదారులుగా గుర్తించినవారి వివరాలను బంగ్లాదేశ్‌కు ముందుగా అందజేసి పంపిస్తే.. సమస్య ఇంత తీవ్రంగా ఉండదని నిపుణులు అంటున్నారు.
ఇవీ చదవండి:
పైలట్ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!
టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!