Share News

మరిన్ని వ్యాధులకు ‘ఆయుష్మాన్‌ భారత్‌’!

ABN , Publish Date - Nov 19 , 2026 | 04:19 AM

ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స అందించే రోగాల సంఖ్య గణనీయంగా పెరగనుంది.

మరిన్ని వ్యాధులకు ‘ఆయుష్మాన్‌ భారత్‌’!
ayushmanbharath

  • 23 నుంచి 112కు పెరగనున్న చికిత్స ప్యాకేజీలు

న్యూఢిల్లీ, నవంబరు 18: ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స అందించే రోగాల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం 23 రకాల వ్యాధులకు ఈ పథకం కింద ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్సలు అందిస్తుండగా, వాటి సంఖ్యను 112కు పెంచనున్నట్టు జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్‌హెచ్‌ఏ) వర్గాలు తెలిపాయి. తీవ్ర అనీమియా, తీవ్ర రక్తపోటు, తీవ్ర బ్రాంకైటిస్‌, డయేరియా, గ్యాస్ట్రోఎంటెరైటిస్‌, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీల్లో రాళ్లు, మధుమేహం సంబంధిత కొన్ని సమస్యలు, హెమరాయిడ్స్‌, డయాబెటిక్‌ రెటినోపతి, గ్లకోమా తదితర వ్యాధులను తాజాగా జాబితాలో చేర్చారు. ఆ జాబితాను పరిశీలించి ఈనెల 25వ తేదీలోగా తమ సూచనలు అందజేయాలంటూ రాష్ట్ర వైద్యఆరోగ్య సంస్థలకు ఎన్‌హెచ్‌ఏ సర్క్యులర్‌ జారీ చేసింది. రాష్ట్రాల నుంచి అందే సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని సవరించిన మార్గదర్శకాలు డిసెంబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయని ఎన్‌హెచ్‌ఏ వర్గాలు తెలిపాయి. తమ వద్ద అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, వైద్య నిపుణులు, ఇతర సౌకర్యాల ఆధారంగా ఈ ప్యాకేజీల సంఖ్యను తగ్గించుకునే అవకాశం రాష్ట్రాలకు ఉంటుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..

జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్‌.. కొట్టివేసిన సుప్రీంకోర్టు

Updated Date - Nov 19 , 2026 | 04:20 AM