పుదుచ్చేరిలో కాంగ్రెస్‌కు షాక్.. ఏవీ సుబ్రమణియన్ రాజీనామా
ABN , Publish Date - Mar 28 , 2026 | 09:06 AM
పుదుచ్చేరి రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పుదుచ్చేరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడైన ఏవీ సుబ్రమణియన్ పార్టీలోని తన పదవులన్నింటికీ రాజీనామా చేశారు.
పుదుచ్చేరి, మార్చి 28: పుదుచ్చేరి రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పుదుచ్చేరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడైన ఏవీ సుబ్రమణియన్ పార్టీలోని తన పదవులన్నింటికీ రాజీనామా చేశారు. ఆయన తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ పంపారు.
సుబ్రమణియన్ తన రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాలని ప్రస్తావించినప్పటికీ, పార్టీ అంతర్గత పరిణామాలు, నాయకత్వంతో ఉన్న విభేదాలే ఇందుకు కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా పుదుచ్చేరి కాంగ్రెస్ యూనిట్‌లో నాయకుల మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలో సీనియర్లకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తి ఆయన నిర్ణయానికి ఒక కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.
ఏవీ సుబ్రమణియన్ పుదుచ్చేరి కాంగ్రెస్‌లో దశాబ్దాలుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన పుదుచ్చేరి కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసి పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. మాజీ మంత్రిగా, ఎమ్మెల్యేగా పుదుచ్చేరి అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. కష్టకాలంలో పార్టీని నడిపించిన అతికొద్ది మంది సీనియర్ నాయకులలో ఆయన ఒకరు. ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో సుబ్రమణియన్ వంటి సీనియర్ నేత వైదొలగడం కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!
Read Latest Telangana News and National News