అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం 26మంది దుర్మరణం
ABN , Publish Date - Nov 14 , 2026 | 04:36 AM
అతివేగం 26 మంది నిండు ప్రాణాల్ని బలిగొంది.
కంటైనర్ ట్రక్కును ఢీకొట్టిన మినీ బస్సు
20మందికి తీవ్ర గాయాలు..
గువాహటి, నవంబరు 13: అతివేగం 26 మంది నిండు ప్రాణాల్ని బలిగొంది. అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో ప్రముఖ కాజీరంగా నేషనల్ పార్క్ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. గోల్‌ఘాట్ నుంచి నాగావ్ వైపు వెళ్తున్న మినీ బస్సు, ఎదురుగా వస్తున్న కంటైనర్ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. కాజీరంగా నేషనల్ పార్కు సమీపంలో వేగ నియంత్రణ నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ, అతివేగంగా ప్రయాణించడం వల్ల డ్రైవ ర్ నియంత్రణ కోల్పోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాద సమయంలో మినీ బస్సులో 35మంది ప్రయాణికులుండగా, వారిలో ఎక్కువమంది కాలేజీ విద్యార్థులేనని గుర్తించారు. ప్రమాద తీవ్రతకు మినీబస్సు నుజ్జునుజ్జు కాగా, భారీ కంటైనర్ రోడ్డు పక్కకు జారిపోయింది. ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయి ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన మినీబస్సు గతంలోనూ అనేకసార్లు అతివేగంతో నడిపినట్లు రవాణా శాఖ అధికారులు గుర్తించారు. ఈ దుర్ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన ఆయన, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు అరెస్టు