Share News

నన్ను కాంగ్రెస్ అధ్యక్షుడిని చేస్తే కాదనేవాడినా.. నాలుగేళ్ల నాటి వివాదంపై అశోక్ గెహ్లాట్

ABN , Publish Date - Jun 07 , 2026 | 09:03 PM

నాలుగేళ్ల క్రితం తనపై కుట్ర జరిగిందని, నాటి పరిణామాలే తనను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని కాకుండా అడ్డుకున్నాయని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా వెల్లడించారు.

నన్ను కాంగ్రెస్ అధ్యక్షుడిని చేస్తే కాదనేవాడినా.. నాలుగేళ్ల నాటి వివాదంపై అశోక్ గెహ్లాట్
Ashok Gehlot

జైపూర్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికపై నాలుగేళ్ల క్రితం నాటి చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. 2022లో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పటి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు అప్పగించాలని పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే గెహ్లాట్ రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కావాలని భావించినట్టు ప్రచారం జరగడం, అనంతర పరిణామాలతో మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అయితే తనపై కుట్ర జరిగిందని, నాటి పరిణామాలే తనను కాంగ్రెస్ అధ్యక్షుడిని కాకుండా అడ్డుకున్నాయని అశోక్ గెహ్లాట్ తాజాగా వెల్లడించారు. 'సోనియాగాంధీ, కాంగ్రెస్ కలిసి నన్ను కాంగ్రెస్ అధ్యక్షుడిని చేస్తే నేను కాదనేవాడినా?' అని ప్రశ్నించారు.


నాలుగేళ్ల క్రితం జరిగిన పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై ఆదివారంనాడిక్కడ మీడియాతో గెహ్లాట్ మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షులకు ఎలాంటి గౌరవం ఉంటుందో తెలుసునని అన్నారు. గాంధీజీ, పండిట్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి నేతలు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారనీ, తనను పార్టీ అధ్యక్షుడిగా సోనియాగాంధీ, కాంగ్రెస్ నియమించి ఉంటే కాదనేవాడినా? అని ప్రశ్నించారు.


కాంగ్రెస్ అధ్యక్షుడిగా దాదాపు ఖాయం అని అనుకుంటున్న సమయంలో తనపై కుట్ర జరిగిందని గెహ్లాట్ అన్నారు. అకస్మాత్తుగా పార్టీ కేంద్ర పరిశీలకులు వచ్చారనీ, అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయని అన్నారు. తాను రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి వదులుకునేందుకు ఇష్టపడటం లేదని, కాంగ్రెస్ అధ్యక్షుడి పదవిని వద్దనుకుంటున్నానని ప్రచారం జరిగిందని, జనంతో పాటు తన సన్నిహితులు, మద్దతుదారులు కూడా అదే నమ్మారని అన్నారు. నాడు జరిగిన కుట్రతో తన ప్రతిష్ట దెబ్బతిందని, చివరకు పార్టీ సోనియాగాంధీ వద్దకు వెళ్లి క్షమాపణలు తెలియజేశానని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

జేఎంఎం, కాంగ్రెస్ మధ్య సయోధ్య.. చెరో రాజ్యసభ సీటుకు పోటీ

'ఇండియా' కూటమి కీలక సమావేశం.. ఢిల్లీకి బయలుదేరిన మమత

Updated Date - Jun 07 , 2026 | 09:08 PM