Share News

దక్షిణాదికి అన్యాయం జరగదు

ABN , Publish Date - Nov 28 , 2026 | 03:30 AM

పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోదని సీఎం చంద్రబాబు తెలిపారు.

దక్షిణాదికి అన్యాయం జరగదు

  • ప్రతి రాష్ట్రంలోనూ లోక్‌సభ స్థానాలు, అసెంబ్లీ సీట్లు 50 శాతం పెరుగుతాయి

  • దామాషా తగ్గదు.. దక్షిణాదికి పూర్తి న్యాయం

  • కేంద్రం నిర్ణయానికి సంపూర్ణ మద్దతు

  • మహిళా రిజర్వేషన్లు మూడు దశాబ్దాల కల

  • బిల్లును అడ్డుకుంటే అతివల ఆగ్రహం తప్పదు

  • రెండు బిల్లులకు అన్ని పార్టీలూ మద్దతివ్వాలి

  • విపక్ష పార్టీలకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

  • కుమారస్వామితో కలిసి మీడియా సమావేశం

న్యూఢిల్లీ, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోదని సీఎం చంద్రబాబు తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనతో అన్ని రాష్ట్రాల్లోనూ పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలు 50శాతం వరకు పెరగనున్నాయని, తద్వారా ఆయా రాష్ట్రాలో ప్రజలకు సైతం మేలు జరుగుతుందని చెప్పారు.

ముఖ్యంగా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం, దేశవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్యను 50 శాతం పెంచేలా కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వృద్థి రేటు తగ్గినప్పటికీ, ప్రతి రాష్ట్రంలో 50ు సీట్లు పెంచడం వల్ల ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్య నిష్పత్తి చెక్కుచెదరదని, దక్షిణాదికి అన్యా యం జరగదని తేల్చిచెప్పారు.

శుక్రవారం ఢిల్లీలోని వన్‌ జన్‌పథ్‌లో.. కేంద్ర మంత్రి కుమారస్వామితో కలసి మీడియాతో మాట్లాడారు. ఎన్‌డీఏ ప్రభుత్వ కీలక నిర్ణయాలకు మద్దతు తెలిపేందుకే ఢిల్లీకి వచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..


ఏకగ్రీవంగా మద్దతివ్వండి!

మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లు, డీలిమిటేషన్‌ అంశాలపై అన్ని రాజకీయ పార్టీలు విభేదాలను పక్కన పెట్టి ఏకగ్రీవంగా మద్దతివ్వాలి. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఎన్‌డీఏ ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకం. మహిళా సాధికారతకు సామాజిక, ఆర్థిక, రాజకీయ భాగస్వామ్యం కీలకం. బిల్లులను వ్యతిరేకించినా, అడ్డుకున్నా మహిళలు క్షమించరు. భవిష్యత్తులో వారి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

సమన్యాయం జరిగేలా!

కుటుంబ నియంత్రణ, జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు దేశానికే ఆదర్శం. ఇప్పుడు పరిస్థితులు మారినందున జనాభా నిర్వహణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో నష్టపోకూడదు. ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలోనూ 50శాతం అదనపు సీట్లు పెంచే విధానం తీసుకురావడం సముచితం. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు కూడా పూర్తి ప్రయోజనం చేకూరుతుంది. అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా డీలిమిటేషన్‌ ప్రక్రియ ఉండాలి.


ఇది.. విన్‌-విన్‌ ఫార్ములా

2026, జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి రాష్ట్రంలోనూ ఉన్న సీట్లలో 50 శాతం పెంపు అనేది ‘విన్‌-విన్‌’ ఫార్ములా. ఈ 50 శాతం సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్య 129 నుంచి 195కు చేరుతుంది. మొత్తం సీట్లలో దక్షిణాది వాటా(23.76 శాతం) యథాతథంగా ఉంటుంది.

లోక్‌సభ సీట్లు ఏపీలో 25 నుంచి 38కి(వాటా 4.6ు), తమిళనాడులో 39 నుంచి 59కి (వాటా 7.18ు), కర్ణాటకలో 28 నుంచి 42కి(వాటా 5.16ు), కేరళలో 20 నుంచి 30కి(వాటా 3.68ు), తెలంగాణలో 17 నుంచి 26కి(వాటా 3.13ు) పెరుగుతాయి. లోక్‌సభతో పాటు అసెంబ్లీ సీట్లలోనూ 50 శాతం పెంపు వర్తిస్తుంది. 2029 ఎన్నికల నాటికి ఈ ప్రక్రియ అమలులోకి వచ్చేలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. 2026 నాటికి 147 కోట్ల జనాభాతో ప్రతి 27-28 లక్షల మందికి ఒక ఎంపీ ఉన్నారు.

50 శాతం సీట్లు పెంచితే ప్రతి 18లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రజల సమస్యలను పార్లమెంటులో సమర్థవంతంగా ప్రస్తావించేందుకు, ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని విస్తరించేందుకు ఇది దోహదపడుతుంది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉండటానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. 1996లో ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ హయాంలో నేను యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా ఉన్నప్పుడు తొలిసారి బిల్లు ప్రవేశపెట్టాం.

తర్వాత 1998, 1999, 2002, 2003లో వాజపేయి ప్రభుత్వం, 2008లో మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టాయి. కాంగ్రెస్‌, డీఎంకే, సమాజ్‌వాదీ సహా అన్ని పార్టీలు రాజకీయ విభేదాలు పక్కనపెట్టి ‘నారీ శక్తి’కి మద్దతివ్వాలి. మహిళా రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి వివక్షకు తావులేకుండా బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలి.


డ్వాక్రా, ‘స్వయం’ బ్రాండ్‌తో ఆర్థిక శక్తి

మహిళా సాధికారతకు ఎన్టీఆర్‌ బలమైన పునాది వేశారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఆస్తిలో సమానహక్కు కల్పించడంతోపాటు 1986లోనే స్థానిక సంస్థల్లో మహిళలకు 9శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, ఇటీవలి ఎన్నికల్లో 60 శాతం సీట్లు ఇస్తే 10 మేయర్‌ స్థానాల్లో 8 మంది మహిళలే గెలిచారని చెప్పారు.

విశాఖపట్నానికి బీసీ, మరోచోట ముస్లిం యువతి మేయర్లుగా ఎన్నికయ్యారని హర్షం వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన విషయాన్ని, ఆర్టీసీ కండక్టర్లుగా మహిళలు రాణించిన తీరును గుర్తుచేశారు. డ్వాక్రా, మెప్మా సంఘాల ద్వారా రాష్ట్రంలో 1.10 కోట్ల మంది మహిళలు ఉన్నారని, రూ.35 వేల కోట్ల కార్పస్‌ ఫండ్‌, రూ.లక్ష కోట్ల టర్నోవర్‌ సాధించారని చెప్పారు.

అమూల్‌ తరహాలో ‘స్వయం’ పేరుతో కామన్‌ బ్రాండ్‌ తీసుకొచ్చి గ్లోబల్‌ మార్కెట్‌లోకి తీసుకెళ్తున్నామని, గతేడాది లక్ష మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామన్నారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎంపీలు సానా సతీశ్‌, లావు శ్రీకృష్ణదేవరాయలు, జీఎం హరీశ్‌ ఉన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 03:39 AM