తమిళనాట కొత్త రాజకీయ ఉద్యమం!
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:37 AM
అత్యధిక సంఖ్యలో ప్రజలను సమైక్యం చేసి, ఒక కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించాలన్నదే తన ఆశయమని బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు...
గౌరవంగానే పార్టీ నుంచి బయటికొచ్చా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై వెల్లడి
మరో ఇద్దరు సీనియర్ నేతల గుడ్‌బై.. పార్టీకి నష్టమేమీ లేదు: బీజేపీ
చెన్నై, జూన్ 5(ఆంధ్రజ్యోతి): అత్యధిక సంఖ్యలో ప్రజలను సమైక్యం చేసి, ఒక కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించాలన్నదే తన ఆశయమని బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు. ఆయన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ శుక్రవారం ఆమోదించారు. దీంతో ఢిల్లీ నుంచే సోషల్ మీడియా ద్వారా తన భవిష్యత్ ప్రణాళికలను అన్నామలై ప్రకటించారు. కొత్త రాజకీయాలను, మౌలిక నిర్మాణాలను మార్చగల రాజకీయాన్ని సృష్టించాలన్నదే తన ఆశయమని, ఈ విషయాన్ని ఢిల్లీలోని బీజేపీ పెద్దలకు తెలిపి పార్టీ నుంచి వైదొలిగానని తెలిపారు. బీజేపీ నుంచి తన నిష్క్రమణ కూడా మర్యాదపూర్వకంగానే జరిగిందన్నారు. రాజకీయ ఉద్యమాన్ని నూతన కోణంలో పనిచేసే విధంగా ప్రారంభించాలనుకుంటున్నానని చెప్పారు. 2009లో విజయకాంత్ ప్రారంభించిన డీఎండీకేలో మూడు నెలలు శిక్షణ పొందానని, ఆ తర్వాత పదేళ్లకు బీజేపీలో చేరి ఆరేళ్లు పనిచేశానని గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోదీపై తనకు చాలా గౌరవం ఉందని, ఆయనే దేశాన్ని కాపాడగల వ్యక్తి అని పేర్కొన్నారు. గత 18 నెలలుగా పార్టీ పరంగా ఎన్నో సమస్యలు ఎదురయ్యాయని, వాటిని అధిష్ఠానవర్గానికి చెబుతూ వచ్చానని, బీజేపీ నుంచి వైదొలగనున్నట్టు గత డిసెంబరు 4నే పార్టీ పెద్దలకు తెలిపానని, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేదాకా ఓపికపట్టాలని వారు సూచించడంతో మే నెలాఖరువరకు పార్టీ పనులను చక్కబెట్టానని వివరించారు. ఈ పరిస్థితుల్లోనే ఓ రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించనున్నానని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని చెప్పారు. ఈ ఉద్యమంలో చేరేందుకు కోయంబత్తూరులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పేరుతో ‘సెంటర్ ఫర్ ఎతిక్స్ అండ్ పాలిటిక్స్’ సంస్థను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. మరోవైపు తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్, రాష్ట్ర కార్యదర్శి సుమతీ వెంకటేశ్ కూడా బీజేపీకి రాజీనామా ప్రకటించారు. ఇది పార్టీలో అంతర్గత విభేదాలపై చర్చకు దారితీసింది. నాగరాజన్ ఢిల్లీ నుంచి వచ్చిన అన్నామలైను చెన్నై విమానాశ్రయంలో కలిసి మద్దతు ప్రకటించారు. రాజీనామా లేఖను త్వరలో పార్టీ అధిష్ఠానానికి పంపుతానని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు
పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్