Share News

దేశం, సమాజం కోసం పనిచేయండి.. కేజ్రీవాల్‌కు అన్నాహజారే సలహా

ABN , Publish Date - Feb 27 , 2026 | 09:32 PM

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు న్యాయస్థానం క్లీన్ చిట్ ఇవ్వడాన్ని అవినీతి వ్యతిరేక ఉద్యమ కార్యకర్త అన్నాహజారే స్వాగతించారు. న్యాయవ్యవస్థే అత్యున్నతమైనందున కోర్టు తీర్పును గౌరవించాలని అన్నారు.

దేశం, సమాజం కోసం పనిచేయండి.. కేజ్రీవాల్‌కు అన్నాహజారే సలహా
Anna Hazare

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) కు న్యాయస్థానం క్లీన్ చిట్ ఇవ్వడాన్ని అవినీతి వ్యతిరేక ఉద్యమ కార్యకర్త అన్నాహజారే (Anna Hazare) స్వాగతించారు. న్యాయవ్యవస్థే అత్యున్నతమైనందున కోర్టు తీర్పును గౌరవించాలని అన్నారు. కేజ్రీవాల్ తన గురించో, పార్టీ గురించో కాకుండా సమాజం, దేశం కోసం పాటుపడాలని సలహా ఇచ్చారు. తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో మీడియాతో శుక్రవారంనాడు ఆయన మాట్లాడారు.


'మన దేశం న్యాయవ్యవస్థపై నడుస్తోంది. దేశంలో న్యాయవ్యవస్థే అత్యున్నతమైనది. అనేక పార్టీలు, కులాలు, మతాలతో కూడిన అతిపెద్ద దేశం మనది. అయినప్పటికీ సజావుగా నడుస్తోందంటే న్యాయవ్యవస్థే కారణం' అని హజారే అన్నారు. బలమైన న్యాయవ్యవస్థ లేకుంటే నేరపూరిత శక్తులదే పైచేయి అవుతుందని చెప్పారు.


అరవింద్ కేజ్రీవాల్‌పై గతంలో తాను చేసిన విమర్శలను అన్నాహజారే ప్రస్తావిస్తూ, తాను వ్యాఖ్యలు చేసినప్పుడు న్యాయస్థానం ఎలాంటి తీర్పు చెప్పలేదని అన్నారు. అప్పట్లో ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయని, ఇప్పుడు న్యాయస్థానం ఎలాంటి తప్పు జరగలేదని చెప్పడంతో దానిని గౌరవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కేజ్రీవాల్, మాజీ ఉప ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తన కార్యకర్తలేనని కూడా హజారే చెప్పారు.


ఇవి కూడా చదవండి..

ఢిల్లీ మద్యం పాలసీ కేసు.. దిగువ కోర్టు తీర్పుపై హైకోర్టులో సీబీఐ పిటిషన్

అవిముక్తేశ్వరానంద స్వామికి అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ

Updated Date - Feb 27 , 2026 | 09:45 PM