సామాన్యుడి జేబుకు పాల ‘సెగ’
ABN , Publish Date - Nov 12 , 2026 | 02:39 AM
కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి సామాన్యుడు ఇప్పటికే సతమతమవుతుండగా.. ఇప్పుడు పాల ధరల బాదుడుతో మరో షాక్ తగలబోతోంది
మదర్ డెయిరీ, అమూల్ పాల ధరలు పెంపు
లీటరుకు రూ.2 నుంచి రూ.6 వరకు భారం
ఈ రోజు నుంచే అమల్లోకి..
పశుగ్రాసం, పాల సేకరణ వ్యయం పెరగడమే కారణం
న్యూఢిల్లీ, నవంబరు 11: కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి సామాన్యుడు ఇప్పటికే సతమతమవుతుండగా.. ఇప్పుడు పాల ధరల బాదుడుతో మరో షాక్ తగలబోతోంది. ప్రముఖ డెయిరీ దిగ్గజాలు అమూల్, మదర్ డెయిరీ వినియోగదారులపై ధరల భారాన్ని మోపాయి. పాల రకాన్ని బట్టి లీటరుకు రూ. 2నుంచి ఏకంగా రూ. 6వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు గురువారం నుంచే అమల్లోకి రానున్నాయి. సాధారణంగా శీతాకాలంలో పాల ఉత్పత్తి పెరిగి ధరలు స్థిరంగా ఉంటాయని, కానీ ఈసారి సరఫరా లేమి కారణంగా పాలలోని కొవ్వు(మిల్క్ ఫ్యాట్) ధరలు గడిచిన కొద్ది నెలల్లోనే 20 నుంచి 25శాతానికి పెరిగాయని కంపెనీలు తెలిపాయి. లోటు వర్షపాతం, పాల లభ్యత తగ్గిపోవడంతో పాటు పశువుల మేత, రైతుల వద్ద నుంచి పాల సేకరణ ధరలు గణనీయంగా పెరిగాయని, దాంతో పెరిగిన నిర్వహణ వ్యయంలో కొంతభాగాన్ని వినియోగదారులపై మోపక తప్పడం లేదని స్పష్టం చేశాయి. కాగా, ఈ రెండు సంస్థలు ఏడాదిలో పాల ధరలను పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం. చివరగా గత మే నెలలో సవరించాయి.
ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో పెరిగిన పాల ధరలను పరిశీలిస్తే.. అమూల్ సంస్థ తమ పాల ధరలను లీటరుకు రూ. 2 నుంచి గరిష్ఠంగా రూ. 4వరకు పెంచింది. ఎక్కువగా అమ్ముడయ్యే అమూల్ ‘తాజా’ లీటరుపై రూ.2 పెరగగా, అమూల్ ‘గోల్డ్’ రూ.4 చొప్పున పెరిగాయి. మదర్ డెయిరీ విక్రయించే 6.5శాతం వెన్న ఉన్న గేదె పాలు లీటరుపై ఏకంగా రూ.6కు పెంచడంతో రూ. 80 నుంచి రూ. 86కు చేరింది. టోన్డ్ పాలు లీటరుకు రూ. 58 నుంచి రూ. 60కి, ఫుల్క్రీం పాలు రూ. 72 నుంచి రూ. 76కు చేరుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
వివాహేతర బంధంపై అభ్యంతరం.. ప్రియుడితో కలిసి కుమారుడిని చంపిన తల్లి
దీపావళి వస్తేనే కాలుష్యం గుర్తుకొస్తోందా.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు.