Share News

ఏఎంసీఏ తయారీ రేసులో 3 ప్రైవేటు సంస్థలు

ABN , Publish Date - May 28 , 2026 | 05:19 AM

భారత రక్షణ రంగ పరిశ్రమలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న తొలి స్వదేశీ ఐదో తరం స్టెల్త్‌ ఫైటర్‌ జెట్‌...

ఏఎంసీఏ తయారీ రేసులో 3 ప్రైవేటు సంస్థలు

  • బరిలో టాటా, ఎల్‌ అండ్‌ టీ, భారత్‌ ఫోర్జ్‌ కన్సార్షియంలు

  • తొలిసారి హాల్‌ను పక్కనబెట్టిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, మే 27: భారత రక్షణ రంగ పరిశ్రమలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న తొలి స్వదేశీ ఐదో తరం స్టెల్త్‌ ఫైటర్‌ జెట్‌.. అడ్వాన్స్‌డ్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఏఎంసీఏ)ల తయారీని ప్రైవేటు రంగ సంస్థ చేపట్టే దిశగా కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో రూ.15వేల కోట్లతో చేపట్టనున్న భారీ ప్రాజెక్టులో భాగంగా ఏఎంసీఏల తయారీ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం బుధవారం రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎ్‌ఫపీ) జారీచేసింది. అందులో ప్రైవేటు సంస్థలైన టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌, ఎల్‌ అండ్‌ టీ-బీఈఎల్‌-డైనమ్యాటిక్‌ కన్సార్షియం, భారత్‌ ఫోర్జ్‌-బీఈఎంఎల్‌-డేటా ప్యాటర్న్స్‌ కన్సార్టియంలను ఆహ్వానించింది. ఒక ప్రధాన యుద్ధ విమాన ప్రాజెక్టుకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ తొలిసారిగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌)ను కాదని.. తొలిసారిగా మూడు ప్రైవేటు సంస్థలను ఆహ్వానించింది. దీంతో ఈ ప్రాజెక్టులో ప్రైవేటు రంగ భాగస్వామ్యం దాదాపు ఖాయమైనట్టే..! ఏఎంసీఏ ప్రాజెక్టుకు సంబంధించి ఏరోనాటికల్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ (ఏడీఏ), డీఆర్‌డీవో గతేడాది మధ్యలో ‘ఆసక్తి వ్యక్తీకరణ’ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌) జారీచేశాయి. దీనికోసం ఏడు సంస్థలు బిడ్లు సమర్పించగా.. సాంకేతిక మూల్యాంకనం అనంతరం మూడు ప్రైవేటు సంస్థలను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ మూడు సంస్థలు వివరణాత్మక బిడ్లు సమర్పించడానికి 2 నుంచి 3 నెలల సమయం ఉంటుంది. వాటిని పరిశీలించిన అనంతరం ఈ మూడు సంస్థల్లో ఒక దాన్ని ఎల్‌1గా ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ 2027మార్చి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. కాగా, ఈ ప్రాజెక్టును దక్కించుకున్న సంస్థ ఐదు నమూనా యుద్ధ విమానాలు, ఒక నిర్మాణాత్మక పరీక్షా విమానం (స్ట్రక్చరల్‌ టెస్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌) తయారు చేయాలి. దీనికోసం డీఆర్‌డీవోకు చెందిన ఏడీఏతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ ఏపీలోని పుట్టపర్తిలో 650 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న నూతన కేంద్రంలో చేపట్టాల్సి ఉంటుంది.


మరిన్ని ఎస్‌-400లు కావాలి

గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునే దిశగా భారత్‌ అడుగులు వేస్తోంది. రష్యా నుంచి మరిన్ని ఎస్‌-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ విషయాన్ని రష్యా ఫెడరల్‌ సర్వీస్‌ ఫర్‌ మిలిటరీ-టెక్నికల్‌ కోపరేషన్‌ (ఎఫ్‌ఎ్‌సవీటీఎస్‌) ధ్రువీకరించింది. మరోవైపు, భారత వైమానిక దళం కోసం 114 రాఫెల్‌ యుద్ధ విమానాలను సమకూర్చుకునేందుకు ఫ్రాన్స్‌తో కీలక ఒప్పందం దిశగా భారత్‌ మరో ముందడుగు వేసింది. ఈ ఫైటర్‌ జెట్ల కొనుగోలుకు సంబంధించిన అభ్యర్థన పత్రాన్ని భారత్‌ ఖరారు చేసింది. దీన్ని త్వరలోనే ఫ్రాన్స్‌కు పంపనున్నట్లు రక్షణ శాఖ అధికారులు బుధవారం తెలిపారు. ఈ ప్రతిపాదిత ఒప్పందం విలువ రూ.3.25 లక్షల కోట్లు అని అంచనా.

ఈ వార్తలు కూడా చదవండి..

న్యాయవాది మొయినుద్దీన్‌ హత్యకేసులో కీలక పరిణామం

లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్

For More AP News And Telugu News

Updated Date - May 28 , 2026 | 05:22 AM