నేను వీడియో తీస్తే మరో విమానం కూలిపోతుందేమో!
ABN , Publish Date - Jun 12 , 2026 | 02:38 PM
దేశ విమానయాన చరిత్రలోనే అత్యంత ఘోరమైన అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి సరిగ్గా ఏడాది పూర్తైంది. నాటి ప్రమాదానికి ప్రత్యక్ష సాక్షిగా ఉండి.. ఏరోప్లేన్ బాయ్‌గా పేరొందిన ఆర్యన్ అనే యువకుడికి ఆనాటి భయాలు వెంటాడుతున్నాయట.
ఇంటర్నెట్ డెస్క్: దేశ విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన అహ్మదాబాద్ విమాన ప్రమాదం (ఎయిర్ ఇండియా AI-171) జరిగి సరిగ్గా ఏడాది పూర్తైంది. 2025 జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన 32 సెకన్లకే ఓ భవనంపై కూలిపోయింది. ఈ భీకర ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది కాలి బూడిదయ్యారు. వీరితో పాటు హాస్టల్‌లో విద్యార్థులు, రోడ్డుపై వెళుతున్న వారు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలు నేటికీ ఆ వేదన నుంచి కోలుకోలేకపోతున్నారు. అలానే గుజరాత్‌కు చెందిన ఆర్యన్ అసారీ (18) అనే యువకుడిని కూడా ఆనాటి భయానక దృశ్యాలు నిత్యం వెంటాడుతూనే ఉన్నాయట.
గుజరాత్ రాష్ట్రంలోని ఆరావళ్లి జిల్లాకు చెందిన ఆర్యన్.. ప్రమాదం జరిగిన రోజు మేఘాణీనగర్‌లోని తన బంధువుల ఇంటి టెర్రస్‌పై ఉన్నాడు. గ్రామం నుంచి మొదటిసారి నగరానికి వచ్చిన ఆర్యన్, విమానాన్ని అంత దగ్గరగా చూసి మురిసిపోతూ.. తన స్నేహితులకు చూపించడం కోసం మొబైల్‌లో వీడియో తీయడం ప్రారంభించాడు. కానీ, ఆ సంతోషం క్షణాల్లో ఘోర విషాదంగా మారింది. విమానం ఒక్కసారిగా కిందికి వస్తూ పెద్ద మంటల మధ్య పేలిపోవడాన్ని అతను అనుకోకుండా తన కెమెరాలో బంధించాడు. ఆ దృశ్యాలు ప్రపంచాన్ని కుదిపేయడంతో ఆర్యన్ రాత్రికి రాత్రే 'ఏరోప్లేన్ బాయ్'గా సోషల్ మీడియాలో నిలిచాడు.
కానీ, ఈ సంఘటన ఆర్యన్ మనసుపై చెరగని ముద్ర వేసింది. 'ఆ ప్రమాదం తర్వాత నేను మొబైల్‌లో విమానాల వీడియోలు తీయడం ఆపేశాను. నేను రికార్డ్ చేస్తే ఎక్కడ మరో విమానం కూలిపోతుందోనని భయమేస్తోంది' అని ఆర్యన్ ఆవేదన వ్యక్తం చేశాడు. చదువు పూర్తి చేసుకుని కాలేజీలో అడుగుపెడుతున్నప్పటికీ.. భవిష్యత్తులో విమానమెక్కే ధైర్యం తనకు లేదని చెబుతున్నాడు. ప్రమాద బాధితులతో ఎలాంటి రక్తసంబంధం లేకపోయినా, కళ్లముందు జరిగిన ఈ దుర్టటన ఒక యువకుడి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో చెప్పడానికి ఆర్యన్ ఒక సజీవ సాక్ష్యమని పలువురు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
నేటి నుంచే ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్.. పాక్‌తో భారత్ పోరు.. ఎప్పుడంటే?
భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత