Share News

తమిళనాడు అసెంబ్లీ రద్దు.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్

ABN , Publish Date - May 06 , 2026 | 08:09 PM

తమిళనాడులో టీవికే ప్రభుత్వం ఏర్పాటుపై ఓవైపు సస్పెన్స్ కొనసాగుతుండగా, మరోవైపు తమిళనాడు 16వ శాసనసభను (2021-26) గవర్నర్ రాజేంద్ర ఆర్లేకల్ బుధవారంనాడు రద్దు చేశారు. ఈనెల 5 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్టు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.

తమిళనాడు అసెంబ్లీ రద్దు.. కొత్త  ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్
Tamil Nadu Assembly Dissolves

చెన్నై: తమిళనాడులో టీవికే ప్రభుత్వం ఏర్పాటుపై ఓవైపు సస్పెన్స్ కొనసాగుతుండగా, మరోవైపు తమిళనాడు 16వ శాసనసభ (2021-26)ను గవర్నర్ రాజేంద్ర ఆర్లేకల్ (Rajendra Arlekar) బుధవారంనాడు రద్దు చేశారు. ఈనెల 5 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్టు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.


గవర్నర్ నిరాకరణ.. ప్రమాణస్వీకారంలో జాప్యం

ఈనెల 7న ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజయ్ సారథ్యంలోని టీవీకే ఆలోచనగా ఉంది. ఇందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ప్రమాణస్వీకారం మరింత జాప్యమయ్యే అవకాశం ఉంది. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను విజయ్ కలిశారు. కాంగ్రెస్ ఇచ్చిన మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి కోరారు. అయితే విజయ్ చూపిన సంఖ్యాబలంతో గవర్నర్ సంతృప్తి చెందలేదు. ప్రభుత్వం ఏర్పాటు టీవీకేకు తగినంత సంఖ్యాబలం లేదని భావించిన గవర్నర్ 118 మంది సభ్యులు సమకూరిన తర్వాత రావాలని సూచించినట్టు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.


ఈ ఎన్నికల్లో టీవీకే 108 చోట్ల గెలిచింది. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 మంది సభ్యుల బలం సంపాదించలేకపోయింది. డీఎంకేతో పొత్తులో భాగంగా 5 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ విజయ్‌కు మద్దతు ప్రకటించింది. విజయ్ గెలిచిన రెండు సీట్లలో ఒక సీటును మినహాయిస్తే టీవీకే సంఖ్యాబలం 112కు చేరుకుంది. దీంతో మరో ఆరుగురి మద్దతు టీవీకేకు అవసరమైంది.


మద్దతుకు అన్నాడీఎంకే నో..

ప్రస్తుతం టీవీకేకు ఎవరు మద్దతు ఇవ్వనున్నారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. విజయ్‌కు మద్దతిచ్చే అవకాశాలను అన్నాడీఎంకే బుధవారంనాడు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఎడప్పాడి పళనిస్వామి నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమై టీవీకేకు సపోర్ట్ ఇవ్వరాదని నిర్ణయించారు. డీఎంకే భాగస్వామ్య పార్టీ అయిన వీసీకే మద్దతును టీవీకే కోరినప్పటికీ ఆ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వీసీకేకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. టీవీకే ఆహ్వానం అందిననప్పటికీ డీఎంకే భాగస్వాములుగా ఉన్న వామపక్షాలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లిగ్ పార్టీలు టీవీకేకు సపోర్ట్ నిరాకరించాయి. ఈ పార్టీల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను కలుసున్నారు. అనంతరం డీఎంకేకు తమ మద్దతు కొనసాగుతుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఆరుగురు ఎమ్మెల్యేల బలాన్ని టీఎంసీ ఎలా కూడగట్టనుందనేది సస్పెన్స్‌గా మారింది.


ఇవి కూడా చదవండి..

విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు

సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ

Updated Date - May 06 , 2026 | 08:20 PM