Share News

ఏఐతో ఫేక్ ఐడీ కార్డు.. రైళ్లలో నకిలీ టీటీఈ నయా దందా

ABN , Publish Date - Jul 17 , 2026 | 07:41 AM

రైల్వే ప్రయాణికులను మోసం చేస్తూ నకిలీ గుర్తింపు కార్డులతో టీటీఈ‌లుగా చలామణి అవుతున్న ఇద్దరు కేటుగాళ్లను ఆర్‌పీఎఫ్, రైల్వే పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు.

ఏఐతో ఫేక్ ఐడీ కార్డు.. రైళ్లలో నకిలీ టీటీఈ నయా దందా
Railway Passenger Fraud

ఇంటర్నెట్ డెస్క్: డబ్బు సంపాదన కోసం కొంతమంది కేటుగాళ్లు ఏఐ టెక్నాలజీని వాడుకుంటున్నారు. రైల్వే ప్రయాణికులను మోసం చేస్తూ నకిలీ గుర్తింపు కార్డులతో రైల్వే ఉద్యోగులుగా చలామణి అవుతున్న ఇద్దరు కేటుగాళ్లను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.

పశ్చిమ బెంగాల్‌లోని రాంపూర్‌హాట్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్-1 వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆర్యదీప్ సాహా అనే వ్యక్తిని ఆర్‌పీఎఫ్ ఏఎస్ఐ అదుపులోకి తీసుకున్నారు. తాను సీల్దా డివిజన్ టీటీఈ అని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఓ నకిలీ ఐడీ కార్డును చూపాడు. అయితే.. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్(CTI) కార్యాలయంలో విచారించగా అసలు నిజం బయటపడింది. ఇందుకోసం నకిలీ పత్రాలు, గుర్తింపు కార్డులను తయారుచేసేందుకు తాను అధునాతన 'జెమిని ఏఐ' టెక్నాలజీనీ ఉపయోగించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి నకిలీ ఐడీ కార్డులు, డూప్లికేట్ టికెట్ చెకింగ్ అథారిటీ లేఖ, నగదు, 5G స్మార్ట్‌ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకుని జీఆర్‌పీ పోలీసులకు అప్పగించారు.


గయా జంక్షన్ వద్ద మరో కేటుగాడి అరెస్ట్..

మరో ఘటనలో.. బిహార్‌లోని జముయి జిల్లా బేలాకు చెందిన అమర్ కుమార్ అనే వ్యక్తి బెంగాల్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లోని M-2AC కోచ్‌లో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడ్డాడు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్ భద్రతా నియంత్రణ గది ఇచ్చిన సమాచారంతో ఆ రైలు గయా జంక్షన్‌కు చేరుకోగానే ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ, వాణిజ్య శాఖల సంయుక్త బృందం అతణ్ని అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద ఉన్న నకిలీ ఐడీ కార్డును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌‌పై హెచ్చరిక

Updated Date - Jul 17 , 2026 | 09:42 AM