Share News

నీట్‌ ఫలితాలు విడుదల 11.21 లక్షల మంది క్వాలిఫై

ABN , Publish Date - Jul 17 , 2026 | 06:31 AM

లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న నీట్‌ యూజీ-2026 పునఃపరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ తదితర అండర్‌ గ్రాడ్యుయేట్‌...

నీట్‌ ఫలితాలు విడుదల 11.21 లక్షల మంది క్వాలిఫై

  • యూపీ నుంచి అత్యధికంగా 1.7 లక్షల మంది

  • 715 మార్కులతో ఆర్యన్‌ గుప్తా, పన్షుల్‌ టాప్‌

  • 19 మందికి 700కు పైగా మార్కులు

  • 138 మందికి 690పైగా మార్కులు

  • టాప్‌-138 అభ్యర్థుల్లో

  • 93 శాతం మందికి మొదటిసారే విజయం

న్యూఢిల్లీ, జూలై 16: లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న నీట్‌ యూజీ-2026 పునఃపరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ తదితర అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం 11.21 లక్షల మంది అర్హత సాధించారు. ఇందులో 58.2 శాతం మహిళా విద్యార్థులే ఉన్నారు. జూన్‌ 21న దేశవ్యాప్తంగా 5,440 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు, దాదాపు 20 లక్షల మంది హాజరుకావడం గమనార్హం. ఈ పరీక్షా ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం రాత్రి విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ుఽ్ఛ్ఛ్ట.ుఽ్ట్చ.ుఽజీఛి.జీుఽ వెబ్‌ పోర్టల్‌ నుంచి తమ స్కోరు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ప్రకటించింది. పంజాబ్‌కు చెందిన ఆర్యన్‌ గుప్తా, హర్యానాకు చెందిన పన్షుల్‌ బన్సాల్‌ 720 మార్కులకు గాను 715 మార్కులు సాధించి దేశంలోనే టాపర్లుగా నిలిచారు. 19 మంది విద్యార్థులు 700కు పైగా మార్కులు సాధించారు. ఇక 138 మంది 690కు పైగా మార్కులను సంపాదించారు. 1,492 మందికి 650కు పైగా, 10,160 మందికి 600కు పైగా, 90,780 మందికి 500కు పైగా మార్కులు వచ్చాయి. దేశవ్యాప్తంగా అత్యధిక మార్కులు సాధించిన 138 మందిలో 93 శాతం మంది మొదటిసారి నీట్‌ రాసినట్ట్టు ఎన్‌ఏటీ తెలిపింది. యూపీ నుంచి అత్యధికంగా 1.7 లక్షల మంది అర్హత సాధించారు.


కేటగిరీల వారీ అభ్యర్థులు..

జనరల్‌ కేటగిరీలో 2.91 లక్షల మంది అర్హత సాధించగా.. అత్యధికంగా 5.12 లక్షల మంది అభ్యర్థులు ఓబీసీ-ఎన్‌సీఎల్‌ విభాగం నుంచి క్వాలిఫై అయ్యారు. ఎస్‌సీ కేటగిరీలో 1.59 లక్షల మంది, ఎస్‌టీ కేటగిరీలో 63,716 మంది, జనరల్‌-ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 95,026 మంది, పీడబ్ల్యూబీడీ కేటగిరీలో 3,666 మంది, పీడబ్ల్యూడీలో 303 మంది అర్హత సాధించారు. ఎన్‌టీఏ రెండు ఫిజిక్స్‌ ప్రశ్నలకు గాను ఒక ప్రశ్నను ఉపసంహరించుకోగా, మరొక ప్రశ్నకు సంబంధించి రెండు సరైన సమాధానాలను అనుమతిస్తూ.. మొత్తం 8 బోనస్‌ మార్కులను కేటాయించింది. అడ్మిషన్లు, కౌన్సిలింగ్‌ ప్రక్రియ ఆలస్యం కాకుండా, షెడ్యూల్‌ ప్రకారం కొనసాగేందుకు వీలుగా రికార్డు స్థాయిలో 25 రోజుల్లోనే ఎన్‌ఏటీ పరీక్షా ఫలితాలను విడుదల చేయడం విశేషం. తొలుత ఈ ఏడాది మే3న నిర్వహించిన నీట్‌ పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం లీక్‌ కావడంతో.. దాన్ని రద్దు చేసి, తిరిగి జూన్‌ 21న నిర్వహించడం తెలిసిందే. జూలై 13న ఓఎంఆర్‌ షీట్లు విడుదల చేసి, 15 వరకు అభ్యంతరాలు స్వీకరించిన ఎన్‌టీఏ, 16న ఫైనల్‌కీని వెబ్‌సైట్‌లో ఉంచి, ఆ వెంటనే తుది ఫలితాలను కూడా విడుదల చేసింది.


నీట్‌ పేపర్‌ లీక్‌ కేసు.. 5 లక్షలకు 111 కెమిస్ట్రీ ప్రశ్నలు!

ప్రశ్నపత్రాల రూపకల్పన కమిటీ సభ్యుడి

నుంచి కోచింగ్‌ సెంటర్‌ యజమాని కొనుగోలు

ప్రత్యేక కోర్టుకు వెల్లడించిన సీబీఐ..

నీట్‌ (యూజీ)-2026 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కెమిస్ట్రీ ప్రశ్నపత్రాల సెట్లలోని 111 ప్రశ్నలను రూ.5 లక్షలకు విక్రయించినట్లు ప్రత్యేక కోర్టుకు బుధవారం సీబీఐ తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన మహారాష్ట్ర లాతూరుకు చెందిన కోచింగ్‌ సెంటర్‌ యజమాని శివరాజ్‌ రఘునాథ్‌.. ఎన్టీయే ప్రశ్నపత్రాల రూపకల్పనలో కమిటీలో సభ్యుడైన పీవీ కులకర్ణి నుంచి కెమిస్ట్రీ ప్రశ్నలను సేకరించాడనేందుకు అన్ని ఆధారాలున్నాయని తెలిపింది. శివరాజ్‌ రఘునాథ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ.. కోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన దర్యాప్తు సంస్థ ఈ విషయాలను వెల్లడించింది. ‘కులకర్ణి నిర్వహించిన కెమిస్ట్రీ కోచింగ్‌ తరగతులకు శివరాజ్‌ రఘునాథ్‌ కుమారుడు హాజరయ్యే వాడు. ఇక్కడే వీరి కుట్రకు బీజం పడింది. శివరాజ్‌ రఘునాథ్‌ ఫోన్‌ను పరిశీలించగా.. అందులో కెమిస్ట్రీకి సంబంధించిన 132 చేతి రాత ప్రశ్నలున్న 36 ఫొటోలు (5 నకిలీవి సహా) కనిపించాయి. అందులో 111 ప్రశ్నలు నీట్‌ మాస్టర్‌ పేపర్‌లోని ప్రశ్నలతో సరిపోలాయి. మే 3న జరిగిన నీట్‌ పరీక్షకు దాదాపు 10 రోజుల ముందు ఫోన్‌లో ఈ ఫొటోలు తీసినట్లుగా మెటా డేటా విశ్లేషణ ద్వారా గుర్తించాం. దీనికి సంబంధించి ఫోరెన్సిక్‌ ఆధారాలు కూడా ఉన్నాయి’ అని సీబీఐ పేర్కొంది. కాగా, పేపర్‌ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో మే 3న నిర్వహించిన నీట్‌ పరీక్షను రద్దు చేసిన ఎన్టీయే.. జూన్‌ 21న మళ్లీ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ వార్తలనూ చదవండి:

న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌‌పై హెచ్చరిక

Updated Date - Jul 17 , 2026 | 06:32 AM