భారత్‌లో పాక్ క్రికెట్ ఆడనప్పుడు ఆ వెబ్ సిరీస్ ఎందుకు?: నటి ఖుష్బూ వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 27 , 2026 | 07:46 PM
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న 'జో బాచే హైన్ సంగ్ సమైత్లో' అనే పాకిస్థాన్ సిరీస్ విడుదలపై వివాదం చెలరేగుతోంది. తాజాగా సినీ నటి ఖుష్బూ సుందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సిరీస్ 2026 డిసెంబర్ 4న విడుదల కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: వినోదం కంటే దేశ ప్రయోజనాలు, జాతీయతా భావమే అత్యంత ముఖ్యమని ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన వెబ్ సిరీస్ ‘జో బచే హైన్ సంగ్ సమైత్లో’ను భారత్‌లో ప్రసారం చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ డిసెంబర్ 4న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ‘ఎక్స్’ వేదికగా ఖుష్బూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
కళ నదిలా స్వేచ్ఛగా ప్రవహించాలని, దానికి హద్దులు ఉండకూడదని తాను విశ్వసిస్తానని ఖుష్బూ పేర్కొన్నారు. అయితే, భారత్‌లో పాకిస్థాన్ సిరీస్‌ను ప్రసారం చేయడం.. ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్‌ను మన గడ్డపై ఆడటానికి అనుమతించడంతో సమానమని ఆమె పోల్చారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లకు అనుమతి లేనప్పుడు, ఈ సిరీస్‌నూ ప్రసారం చేయకూడదని ఆమె స్పష్టం చేశారు. 'దర్శకనిర్మాతలు , నటులకు గౌరవం,అలానే క్షమించండి. మేము భారతీయులు మా దేశం మాకు ప్రథమం' అని ఆమె పాకిస్థాన్ సినీ ఇండస్ట్రీని ఉద్దేశించి అన్నారు. చివరకగా ‘సారే జహా సే అచ్ఛా హిందుస్తాన్ హమారా’ అంటూ భావోద్వేగంగా ముగించారు.
మరోవైపు, పాకిస్థాన్ మూలాలున్న సినిమాలు, సిరీస్‌లు, పాటలు, పాడ్‌కాస్ట్‌లను భారత్‌లో స్ట్రీమింగ్ చేయకూడదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 2025 మే 8న జారీ చేసిన మార్గదర్శకాలను నెట్‌ఫ్లిక్స్‌కు మరోసారి గుర్తు చేసింది. గత ఏడాది జూన్‌లో తాము పాకిస్థాన్ కంటెంట్‌ను భారతీయ వినియోగదారులకు అందుబాటులో ఉంచలేదని నెట్‌ఫ్లిక్స్ తెలిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ నిబద్ధతకు కట్టుబడి ఉండాలని కోరింది. ఈ సిరీస్‌ను నిలిపివేయాలని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ (FWICE), ఏఐసీడబ్ల్యూఏ (AICWA) వంటి సినీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా నటి ఖుష్బూ పై వ్యాఖ్యలు చేశారు. ‘జో బచే హైన్ సంగ్ సమైత్లో’ అనే ఈ ఉర్దూ సీరీస్ 'ఆల్ ది లవ్ అవర్ హార్ట్స్ కేరీ' అనే ఇంగ్లీష్ శీర్షికతో కూడా ప్రసిద్ధి చెందింది. ఈ సిరీస్‌ను దర్శకుడు మోమినా దురైద్ తెరకెక్కించారు.
ఇవి కూడా చదవండి:
మహిళా ఐఏఎస్ అధికారిపై వేధింపులు.. టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ అరెస్ట్
ఎన్ని కుట్రలు జరిగినా కలిసే ఉంటాం.. కాంగ్రెస్‌తో విభేదాలపై అఖిలేష్ యాదవ్