శీతాకాలంలో ఎక్కువగా ఆకలి వేస్తోందా.. ఇవే అసలు కారణాలు..
ABN , Publish Date - Nov 23 , 2026 | 08:39 AM
చలికాలం వచ్చిందంటే చాలు.. ఏదో ఒకటి తినాలనిపిస్తోందా? ఆకలి లేకపోయినా పదేపదే స్నాక్స్ తింటున్నారా? కారణాలేంటో తెలుసుకుందామా..
శీతాకాలంలో బాగా ఆకలిగా అనిపిస్తుందా.. ఎక్కువగా తింటున్నారా.. ఎక్కువగా పని చేయనప్పటికీ.. ఎందుకు ఆకలి అవుతుందని ఆశ్చర్యపోతున్నారా.. భయపడకండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదు. ఈ ఆకలి వెనుక కారణాలేంటో తెలుసుకుందాం పదండి..
1. చలిని తట్టుకోవడానికి శరీరానికి ఎక్కువ శక్తి అవసరం
శీతాకాలంలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం తన ఉష్ణోగ్రతను కాపాడుకోవాలి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రణ చేసుకోవడానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. అందుకే శీతాకాలంలో మనకు ఎక్కువగా ఆకలి అనిపిస్తుంటుంది.
2. పగటి సమయం తగ్గడం వల్ల ఆకలి కలిగించే హార్మోన్లు ప్రభావితం అవుతాయి.
శీతాకాలంలో పగటిపూట తక్కువగానూ, రాత్రి పూట ఎక్కువగానూ ఉంటుంది. ఇది శరీరం.. అంతర్గతంగా పాటించే గడియార చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల నిద్ర, ఆకలి వంటి జీవన క్రియలు ప్రభావితం అవుతాయి. సరిగా నిద్ర పోకపోవడం లేదా ఆహారం తీసుకునే సమయాల్లో మార్పుల కారణంగా హార్మన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీని వల్ల హార్మోన్లు ఎక్కువ ఆకలి కలిగేలా ప్రేరేపిస్తాయి. అందుకే శీతాకాలంతో శారీరక శ్రమ పెద్దగా చేయనప్పటికీ ఎక్కువ ఆకలి కలుగుతుంది.
3. వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని కోరుకోవడం
వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతూ ఉండడం వల్ల.. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి మనం వేడి వేడి ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతుంటాం. వేడి వేడి పరోటాలు, బజ్జీలు, స్నాక్స్, స్వీట్లు, పిండిపదార్థాలు.. వంటి ఆకర్షణీయమైన, రుచికరమైన పదార్ధాలను తింటుంటాం. ఇలాంటి కార్బోహైడ్రేట్లకు బదులుగా.. తృణధాన్యాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడం చాలా ఉత్తమం.
4. ఇంట్లో ఎక్కువ సమయం ఉండడం వల్ల తినాలనిపిస్తుంది.
వాతావరణం చల్లగా ఉన్నందున ఉదయం, సాయంత్రం వేళల్లో బయటికి వెళ్లడానికి చాలా మంది ఇష్టపడరు. రోజులో ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతుంటారు. ఈ దినచర్యలో మార్పు వల్ల.. మీకు ఆకలి లేకపోయినా.. ఆలోచనారహితంగా ఏదో ఒకటి తినాలనే కోరిక కలుగుతుంది. ఎంత తింటున్నారో తెలియకుండా తింటుంటారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఇంట్లో గడిపినప్పటికీ.. ఇతర కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యేందుకు ప్రయత్నించండి.
5. డీ హైడ్రేషన్‌ను కూడా ఆకలిగా పొరపడతాం
శీతాకాలంలో చలి కారణంగా ఎక్కువగా దాహం వేయదు. తక్కువ నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు లోనవుతుంది. దీన్నే ఆకలిగా పొరపడి.. ఏదైనా తినాలనే కోరిక కలుగుతుంది. అందుకే శీతాకాలంలో దాహంగా అనిపించినా.. అనిపించకపోయినా.. తగినంత నీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. వేడివేడి సూప్‌లు తాగడం వల్ల కూడా శరీరానికి కావాల్సిన ద్రవాలు అందుతాయి.