అజంతా, ఎల్లోరా గుహలు చూడాలనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీ
ABN , Publish Date - Sep 28 , 2026 | 04:25 PM
మహారాష్ట్రలోని చారిత్రక కట్టడాలు, ప్రాచీన గుహలు, ప్రసిద్ధ ఆలయాలను సందర్శించాలనుకునే హైదరాబాద్ వాసులకు IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ‘Marvels of Maharashtra’ (SHR105) పేరుతో ఉన్న ఈ టూర్‌కు ఎంత ఖర్చవుతుంది? ప్యాకేజీలో ఏయే సౌకర్యాలు ఉన్నాయో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని చారిత్రక ప్రదేశాలను చూడాలనుకునే పర్యాటకులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ‘Marvels of Maharashtra’ (SHR105) పేరుతో రూపొందించిన ఈ ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి రైలు ప్రయాణం ద్వారా ఛత్రపతి సంభాజీనగర్, ఎల్లోరా, అజంతా ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది.
కాచిగూడ నుంచి ప్రయాణం
ఈ టూర్ ప్రతి శుక్రవారం కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:30 గంటలకు 17064 అజంతా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం మొదలవుతుంది. మరుసటి రోజు ఉదయం 5:25 గంటలకు ఛత్రపతి సంభాజీనగర్ చేరుకుంటారు. రైల్వే స్టేషన్ నుంచి హోటల్‌కు తీసుకెళ్లి అల్పాహారం అందిస్తారు. అనంతరం ఎల్లోరా గుహలు, గ్రిష్ణేశ్వర్ ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం బీబీ కా మక్బరాను సందర్శించిన తర్వాత తిరిగి సంభాజీనగర్‌లోనే రాత్రి బస ఉంటుంది.
రెండో రోజు అజంతా గుహలకు..
ఆదివారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్‌అవుట్ చేసి అజంతా గుహలకు బయలుదేరుతారు. సంభాజీనగర్ నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో అజంతా గుహలు ఉన్నాయి. అక్కడి సందర్శన పూర్తయిన తర్వాత సాయంత్రం తిరిగి సంభాజీనగర్‌కు చేరుకుంటారు. అనంతరం రైల్వే స్టేషన్‌కు వెళ్లి రాత్రి 10:45 గంటలకు 17063 రైలులో కాచిగూడకు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. సోమవారం ఉదయం 9:45 గంటలకు కాచిగూడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు ఎంత?
జూలై 2026 నుంచి అమల్లో ఉన్న ధరల ప్రకారం.. 1 నుంచి 3 మంది ప్రయాణికుల కోసం కంఫర్ట్ విభాగంలో 3AC సింగిల్ షేరింగ్ ధర రూ.22,730 నుంచి ఉంది. ట్విన్ షేరింగ్‌కు రూ.13,340, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.10,700 నుంచి ఛార్జీలు ఉన్నాయి.
స్టాండర్డ్ విభాగంలో SL సింగిల్ షేరింగ్ రూ.21,230, ట్విన్ షేరింగ్ రూ.11,830, ట్రిపుల్ షేరింగ్ రూ.9,200 నుంచి ప్రారంభమవుతాయి.
4 నుంచి 6 మంది కలిసి ప్రయాణిస్తే కంఫర్ట్ విభాగంలో ట్విన్ షేరింగ్ రూ.10,810, ట్రిపుల్ షేరింగ్ రూ.10,150 నుంచి ఉంటుంది. స్టాండర్డ్ విభాగంలో ట్విన్ షేరింగ్ రూ.9,310, ట్రిపుల్ షేరింగ్ రూ.8,640 నుంచి ధరలు ఉన్నాయి.
5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు బెడ్‌తో లేదా బెడ్ లేకుండా వేర్వేరు ఛార్జీలు వర్తిస్తాయి.
ప్యాకేజీలో ఏమేం ఉంటాయి?
IRCTC అందిస్తున్న ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణంతో పాటు పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఏసీ వాహన సౌకర్యం ఉంటుంది. అలాగే ఒక రాత్రి హోటల్ వసతి, రెండు బ్రేక్‌ఫాస్ట్‌లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, టోల్, పార్కింగ్, జీఎస్టీ తదితర ఖర్చులు ప్యాకేజీలోనే ఉంటాయి. అయితే లంచ్, డిన్నర్, రైలులో ఆహారం, సందర్శనా స్థలాల ప్రవేశ రుసుములు, టూర్ గైడ్ సేవలు, అదనపు వినోద కార్యక్రమాల ఖర్చులు ప్యాకేజీలో భాగం కావు.
హోటల్ వసతి
ఛత్రపతి సంభాజీనగర్‌లో Enrise By Sayyaji లేదా అదే స్థాయి ఉన్న ఇతర హోటల్‌లో బస ఏర్పాటు చేస్తారు. కంఫర్ట్ విభాగంలో మొత్తం 6 సీట్లు, స్టాండర్డ్ విభాగంలో 16 సీట్ల సామర్థ్యం ఉన్నట్లు ప్యాకేజీ వివరాల్లో పేర్కొన్నారు. ప్రయాణ తేదీని బట్టి సీట్ల లభ్యత మారవచ్చు. హోటల్ చెక్‌ఇన్, రైలు బెర్త్ కేటాయింపు తదితర అంశాలకు IRCTC నిబంధనలు వర్తిస్తాయి. ప్యాకేజీ బుక్ చేసుకునే ముందు తాజా ధరలు, సీట్ల లభ్యత, ప్రయాణ తేదీలను అధికారిక IRCTC వివరాల్లో తప్పనిసరిగా పరిశీలించడం మంచిది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
చలికాలం ముందుగానే మొదలైందా.. ఉష్ణోగ్రతలు ఎందుకు పడిపోయాయంటే..
రకుల్ ప్రీత్ సింగ్, వాషు భగ్నానీకి షాకిచ్చిన ముంబై ఐటీ అధికారులు