FTR బుకింగ్ అంటే ఏమిటి? రైలులో ప్రత్యేక కోచ్ లేదా స్పెషల్ ట్రైన్ ఎలా బుక్ చేసుకోవాలి?
ABN , Publish Date - Apr 05 , 2026 | 09:00 PM
ఎక్కువ మంది కలిసి ఒకేసారి ప్రయాణించాలి అనుకునే వారికి ఐఆర్‌సీటీసీ.. ఫుల్ టారిఫ్ రేట్ సర్వీస్‌ను అందిస్తోంది. దీని ద్వారా ఒకే కోచ్ లేదా మొత్తం రైలును బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: పెళ్లిళ్లు, తీర్థ యాత్రలు లేదా ఇతర శుభకార్యాల కోసం ఒకేసారి ఎక్కువ మంది కలిసి ప్రయాణించాల్సి వచ్చినప్పుడు రైలు టికెట్లు బుక్ చేయడం ఒక పెద్ద సవాలు. అందరికీ ఒకే కోచ్‌లో లేదా ఒకే రైలులో బెర్తులు దొరకడం కష్టతరమవుతుంది. ఇలాంటి సమయాల్లో ఇండియన్ రైల్వేస్ అందించే FTR (Full Train Reservation) సౌకర్యం అద్భుతంగా ఉపయోగపడుతుంది. మొత్తం రైలు లేదా కోచ్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. మొత్తం రైలు లేదా కోచ్ బుక్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.
FTR బుకింగ్ అంటే ఏమిటి?
ఇండియన్ రైల్వేస్ అందించే FTR అంటే ఫుల్ టారిఫ్ రేట్ అని అర్థం. అంటే పెళ్లి బృందాలు, విద్యార్థులు విహారయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రల కోసం వెళ్లేవారు ఏకకాలంలో అందరూ కలిసి ప్రయాణించడానికి ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక సదుపాయం. ఈ పథకం కింద వ్యక్తులు లేదా సంస్థలు ఈ క్రింది వాటిలో దేనినైనా బుక్ చేసుకోవచ్చు.
1. రైల్వే కోచ్ చార్టర్: ఒక పూర్తి కోచ్ (18–100 సీట్లు)
2. రైలు చార్టర్: ఒక పూర్తి రైలు (18 నుండి 24 కోచ్‌లు, తప్పనిసరి జనరేటర్ కార్లతో సహా)
3. సలూన్ చార్టర్: పూర్తి నివాస సౌకర్యాలతో ప్రైవేట్, విలాసవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.
IRCTC ద్వారా కోచ్ లేదా రైలును బుక్ చేసుకునే విధానం:
మొదట ఐఆర్‌సీటీసీ అధికారిక FTR వెబ్‌సైట్ www.ftr.irctc.co.in ను ఓపెన్ చేయాలి.
మీరు ఇప్పటికే లాగిన్ కాకపోయి ఉంటే.. కొత్తగా లాగిన్ క్రియేట్ చేసుకోవాలి.
లాగిన్ కోసం OTP అడుగుతుంది.. దాన్ని ధృవీకరించాలి.
మీ యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
ప్రయాణ తేది, రైలు నంబర్(లేదా ప్రయాణం మార్గం), కోచ్ రకం (ఏసీ, స్లీపర్) ప్రయాణికుల సంఖ్యను నమోదు చేయాలి.
వివరాలన్నీ పూర్తి చేసిన తర్వాత, నిర్ణీత సెక్యూరిటీ డిపాజిట్‌ను ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
పేమెంట్ పూర్తయిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. దీని ద్వారా మీ బుకింగ్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవచ్చు.
స్టేషన్ కౌంటర్ ద్వారా ఆఫ్‌లైన్ బుకింగ్:
మీరు బయలుదేరే రైల్ స్టేషన్‌లో చీఫ్ బుకింగ్ సూపర్ వైజర్ (CBS) లేదా స్టేషన్ మేనేజర్ ను కలవండి. ప్రయాణ వివరాలతో కూడిన ఒక లెటర్ ఇవ్వాలి. CBS ఒక రిఫరెన్స్ నంబర్, రిజిస్ట్రేషన్ స్లిప్‌ను మీకు ఇస్తారు. మీ FTR నంబర్‌ను పొందడానికి UTS కౌంటర్‌లో మొత్తాన్ని చెల్లించండి. మీ బుకింగ్ వివరాలను తిరిగి పొందడానికి FTR నంబర్‌ను చీఫ్ బుకింగ్ సూపర్ వైజర్ ఆఫీస్ తీసుకురావాలి.
గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన వివరాలు ఏంటంటే..
ప్రయాణ తేదీకి కనీసం 30 రోజుల ముందు నుంచి గరిష్ఠంగా 6 నెలల (180 రోజులు) ముందు వరకు బుక్ చేసుకోవచ్చు.
చెల్లించాల్సిన రుసుము.. ఒక్కో కోచ్‌కు రూ.50,000 (7 రోజుల వరకు ప్రయాణం) తర్వాత ప్రతి కోచ్‌కు రోజుకు రూ.10,000 అదనంగా చెల్లించాలి. అలాగే 18-కోచ్‌ల రైలు బుకింగ్‌కు కనీసం రూ.9,00,000 చెల్లించాలి.
చీఫ్ కమర్షియల్ మేనేజర్ (ప్యాసింజర్ మార్కెటింగ్) ద్వారా మాన్యువల్‌గా ప్రాసెస్ చేయబడతాయి. సమయాన్ని బట్టి రద్దు ఛార్జీలు వర్తిస్తాయి.
అదనపు షరతులు:
రైలు 10 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సేపు ఆగే స్టేషన్లలో మాత్రమే కోచ్‌ను వేరు చేయడం లేదా జోడించడానికి అనుమతించబడుతుంది.
బుకింగ్ రిక్వెస్ట్ చేసినంత మాత్రాన ఆమోదం లభిస్తుందని గ్యారంటీ లేదు.
ఈ వార్తలు కూడా చదవండి
నీటి సంరక్షణపై 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సీఎం చంద్రబాబు..
శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు తల్లీకుమార్తె మృతి..