గ్యాస్ సేవ్ చేయాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ABN , Publish Date - Mar 14 , 2026 | 10:17 AM
ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ కొరత ఉన్న నేపథ్యంలో గ్యాస్‌ను జాగ్రత్తగా ఉపయోగించడం అవసరం. గ్యాస్ ఆదా చేయడానికి వంట సమయంలో పాటించాల్సిన కొన్ని సులభమైన చిట్కాలను తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల కారణంగా చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. దీని ప్రభావం భారతదేశంలో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా వాణిజ్య LPG సిలిండర్ల సరఫరా తగ్గడంతో హోటల్ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోకుండా ఉండాలంటే కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు పాటించడం మంచిది. వంట చేసేటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే గ్యాస్ వృథా కాకుండా ఉంటుంది. సిలిండర్ ఎక్కువ రోజులు ఉపయోగించుకోవచ్చు.
మీడియం మంటపై వండండి:
ఎక్కువ మంటపై వండితే ఆహారం త్వరగా ఉడుకుతుందని చాలామంది భావిస్తారు. కానీ ఎక్కువ మంట వల్ల గ్యాస్ ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి పప్పులు, బియ్యం, కూరగాయలు వంటి వాటిని మీడియం మంటపై వండటం మంచిది.
పాత్రకు మూత పెట్టండి:
వంట చేసేటప్పుడు పాత్రకు మూత పెట్టకుండా వండితే ఆవిరి బయటకు వెళ్లిపోతుంది. దీంతో ఆహారం ఉడికేందుకు ఎక్కువ సమయం పడుతుంది. కానీ మూత పెట్టి వండితే వేడి లోపలే ఉండి ఆహారం త్వరగా ఉడుకుతుంది. దీంతో దాదాపు 20–25% వరకు గ్యాస్ ఆదా చేయవచ్చు.
సరైన పాత్ర వాడండి:
చిన్న బర్నర్‌పై పెద్ద పాత్ర పెట్టి వండితే గ్యాస్ ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి బర్నర్ పరిమాణానికి సరిపోయే పాత్రలను ఉపయోగించడం మంచిది.
ప్రెషర్ కుక్కర్ ఉపయోగించండి:
గ్యాస్ ఆదా చేయడానికి ప్రెషర్ కుక్కర్ చాలా ఉపయోగపడుతుంది. కుక్కర్‌లో ఆహారం త్వరగా ఉడుకుతుంది. కాబట్టి బియ్యం, పప్పులు, కూరగాయలు వంటి వాటిని వీలైనంత వరకు కుక్కర్‌లో వండటం మంచిది.
అవసరమైనవి ముందే సిద్ధం చేసుకోండి
కొంతమంది గ్యాస్ వెలిగించి తరువాత కూరగాయలు కట్ చేయడం లేదా మసాలాలు సిద్ధం చేయడం మొదలు పెడతారు. ఇలా చేస్తే గ్యాస్ అనవసరంగా ఖర్చవుతుంది. కాబట్టి వంట ప్రారంభించే ముందు అవసరమైన ఆహార పదార్థాలను సిద్ధం చేసుకోవాలి.
పప్పులు ముందుగా నానబెట్టండి:
పప్పులు లేదా ఇతర ధాన్యాలను వండే ముందు కనీసం అరగంట గోరువెచ్చని నీటిలో నానబెడితే అవి త్వరగా ఉడుకుతాయి. దీంతో గ్యాస్ కూడా తక్కువగా ఖర్చవుతుంది.
గ్యాస్ బర్నర్‌ను శుభ్రంగా ఉంచండి:
బర్నర్ నుంచి వచ్చే మంట పసుపు లేదా నారింజ రంగులో ఉంటే బర్నర్ రంధ్రాలు మూసుకుపోయినట్లు అర్థం. అప్పుడు గ్యాస్ సరిగా మండదు. వృథా అవుతుంది. కాబట్టి బర్నర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తే మంట బాగా వస్తుంది. దీని వల్ల ఆహారం కూడా త్వరగా సిద్ధమవుతుంది. గ్యాస్ కూడా ఆదా అవుతుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read
వేసవిలో బయటకు వెళ్లే ముందు ఈ స్కిన్‌కేర్ తప్పనిసరి
బొప్పాయి తినడానికి సరైన సమయం తెలుసా?
For More Latest News